BBC: బీబీసీ ఛైర్మన్‌ రాజీనామా.. బోరిస్‌ జాన్సన్‌ రుణ వివాదమే కారణం!

ప్రముఖ వార్తాసంస్థ ‘బీబీసీ’ ఛైర్మన్‌ రిచర్డ్‌ షార్ప్‌ తన పదవికి రాజీనామా చేశారు. బోరిస్ జాన్సన్‌కు రుణం విషయంలో సహకరించడం తదితర విషయాలు దాచిపెట్టి.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఓ దర్యాప్తులో తేలడంతో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Published : 28 Apr 2023 18:52 IST

లండన్‌: బ్రిటన్‌ (Britain)కు చెందిన ప్రముఖ వార్తాసంస్థ ‘బీబీసీ (BBC)’ ఛైర్మన్‌ రిచర్డ్‌ షార్ప్‌ (Richard Sharp) తన పదవికి రాజీనామా చేశారు. 2021లో అప్పటి బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌ (Boris Johnson)కు రుణం ఇప్పించిన విషయంలో తన ప్రమేయాన్ని వెల్లడించకుండా.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఓ స్వతంత్ర దర్యాప్తులో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘బీబీసీ ఛైర్మన్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకోకముందే.. తాను ఈ పదవి విషయంలో ఆసక్తి చూపుతున్నట్లు అప్పటి ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు చెప్పారు. ఆయనకు రూ.8 కోట్ల మేర రుణం ఇప్పించే విషయంలోనూ సాయం చేశారు. కానీ, బీబీసీ ఛైర్మన్‌ పదవి నియామకం సమయంలో ఈ విషయాలు వెల్లడించలేదు’ అని రిచర్డ్‌ షార్ప్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై వాస్తవాలు తేల్చేందుకు.. ప్రభుత్వ నియామకాల కమిషనర్‌ ఆదేశాలతో ఓ స్వతంత్ర దర్యాప్తు చేపట్టారు.

బీబీసీ ఛైర్మన్‌ పదవికి ఇంటర్వ్యూ సమయంలో రిచర్డ్‌ షార్ప్‌.. పైన పేర్కొన్న విషయాలను వెల్లడించకుండా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు దర్యాప్తు నివేదికలో తేలింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన తన రాజీనామా ప్రకటించారు. బీబీసీ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. తదుపరి నియామకం వరకు పదవిలో కొనసాగుతానని వెల్లడించారు.

రిచర్డ్‌ షార్ప్‌ 2021లో బీబీసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. బ్యాంకింగ్‌ రంగంలో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ ‘గోల్డ్‌మన్‌ శాక్స్‌’లో పనిచేస్తున్నప్పుడు.. రిషి సునాక్‌(ప్రస్తుత బ్రిటన్‌ ప్రధాని)కు పైఅధికారిగా వ్యవహించారు. అయితే, రిషి సునాక్‌ ఈ వివాదానికి దూరంగా ఉన్నారు. బీబీసీ ఛైర్మన్‌గా రిచర్డ్‌ షార్ప్‌ నియామకం.. తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించకముందే జరిగినట్లు సునాక్‌ ఇటీవల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని