Australia: చైనా దూకుడును ఖండించిన ఆస్ట్రేలియా..!

దక్షిణ చైనా సముద్రం( South China Sea)లో చైనా(China) దూకుడును ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండించింది.

Published : 24 Jun 2022 01:38 IST

దిల్లీ: దక్షిణ చైనా సముద్రం( South China Sea)లో చైనా(China) దూకుడును ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండించింది. దీనిని వాస్తవాధీన రేఖ(LAC) వద్ద జరిగిన గల్వాన్ ఘర్షణతో పోలుస్తూ.. భయానకంగా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషన్ వద్ద మీడియాతో ఆ దేశ రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ విధంగా స్పందించారు. 

‘చైనా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంతకుముందెన్నడూ చూడనివిధంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వైఖరి గత దశాబ్దం నుంచే కనిపిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా మనం దూకుడుతో ముందుకెళ్తోన్న చైనాను చూస్తున్నాం. భారతదేశంతో ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి చైనా భయానక ప్రవర్తనను మనం చూశాం. గల్వాన్‌ ఘర్షణ విషయంలో మేం భారత ప్రభుత్వానికి సంఘీభావంగా నిలబడతాం. దక్షిణ చైనా సముద్రం(ఎస్‌సీఎస్‌) విషయంలో మేం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాం’ అని వెల్లడించారు. ఈ సముద్రంలో కృత్రిమ ద్వీపాల నిర్మాణం జరుగుతోందన్నారు. అది ఎల్‌ఏసీ అయినా, ఎస్‌సీఎస్‌ అయినా.. ఈ ప్రాంతానికి ముఖ్యమైన నిబంధనల ఆధారిత క్రమాన్ని చైనా సవాలు చేస్తోందని విమర్శించారు. ఆ దేశం సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా కాకుండా బలంతో పరిష్కరించుకోవాలని చూస్తోందని, ఈ తీరే ఆందోళన కలిగిస్తోందన్నారు.  

భారత్‌, ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుతూ.. ఈ రెండూ ప్రజాస్వామ్య దేశాలని, తమతమ దేశాల్లో చట్టబద్ధమైన పాలనను అందిస్తున్నాయని చెప్పారు. ‘భారత్‌తో మాకు భౌగోళిక బంధం ఉంది. ఆస్ట్రేలియా హిందూ మహాసముద్ర (Indian ocean) దేశం. మన రెండింటి మధ్య రక్షణ సంబంధాలు, ఆర్థిక కార్యకలాపాలున్నాయి. ఇండియన్-ఆస్ట్రేలియన్ కమ్యూనిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది’ అని వెల్లడించారు. అలాగే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం గురించి మాట్లాడుతూ.. ఇది ఆహార, ఇంధన భద్రతపై పెను ప్రభావాన్ని చూపుతుందన్నారు. అలాగే యుద్ధంపై భారత్‌ తీసుకున్న వైఖరి, దానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని