Israel-Hamas: ‘ఇజ్రాయెల్‌కు ఆ హక్కుంది’.. మారిన చైనా స్వరం!

Israel- Hamas | ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడిని ఖండించడానికి ఇప్పటి వరకు సంశయిస్తూ వచ్చిన చైనా తాజాగా స్వరం మార్చింది. చైనా విదేశాంగ మంత్రి అమెరికా పర్యటనకు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. 

Published : 24 Oct 2023 09:58 IST

Israel- Hamas | బీజింగ్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం (Israel Hamas Conflict) విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ బీజింగ్‌ నుంచి కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రతి దేశానికీ ఆత్మరక్షణ హక్కు ఉంటుందని చైనా (China) విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ సోమవారం వ్యాఖ్యానించారు. అయితే, అంతర్జాతీయ మావనతా చట్టాలకు అనుగుణంగా, సామాన్య పౌరులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు ఉండాలని సూచించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి ఇజ్రాయెల్‌ (Israel) విదేశాంగ మంత్రితో ఫోన్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో వాంగ్‌ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.

హమాస్‌ (Hamas)పై చర్యలు తీసుకునే హక్కు ఇజ్రాయెల్‌ (Israel)కు ఉందంటూ చైనా (China) పరోక్షంగానైనా అంగీకరించడం ఇదే తొలిసారి. గతవారం అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఇజ్రాయెల్‌- హమాస్‌ (Israel Hamas Conflict) మధ్య కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈజిప్ట్‌ సహా ఇతర అరబ్‌ దేశాలతో కలిసి పాలస్తీనా సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం కోసం సమన్వయం చేస్తామని వ్యాఖ్యానించారు. కానీ, ఈ సమయంలో ఎక్కడా హమాస్‌ దాడిపై ఖండన, ఇజ్రాయెల్‌కు మద్దతును ప్రస్తావించలేదు. ఈ విషయంలో ఇప్పటి వరకు అస్పష్ట వైఖరిని అనుసరించిన డ్రాగన్‌ తాజాగా స్వరం మార్చడం గమనార్హం.

‘యుద్ధాన్ని ఎగదోస్తే.. మీవరకూ వస్తుంది..!’ ఇరాన్‌కు హెచ్చరిక

ఇజ్రాయెల్‌-హమాస్‌ ఉద్రిక్తత (Israel Hamas Conflict)లు రోజురోజుకీ మరింత తీవ్రమవుతుండటంపై వాంగ్‌ యీ తాజాగా విచారం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున సామాన్య పౌరుల మరణాలకు దారితీస్తుండడం తమకు ఆందోళన కలిగిస్తోందన్నారు. సామాన్యులకు హాని కలిగించే అన్ని చర్యలను వెంటనే ఆపేయాలని కోరారు. ఈ విషయంలో చైనా (China)కు ఎలాంటి స్వార్థ ఆలోచనలు లేవని వివరణ ఇచ్చారు. ఇరు పక్షాల మధ్య ఘర్షణలు వీలైనంత త్వరగా సమసిపోవాలని ఆకాంక్షించారు. తద్వారా అన్ని దేశాల ఆందోళనలకు ఒక మార్గం లభిస్తుందని తెలిపారు. వాంగ్‌ యీ అక్టోబర్‌ 26 నుంచి 28 మధ్య అమెరికాలో పర్యటించనున్నారు. అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవన్‌తో సమావేశం కానున్నారు. ఈ తరుణంలో చైనా నుంచి ఇలాంటి సానుకూల వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని