Doctor: రోగి కాలేయాలపై పేర్లు చెక్కిన వైనం.. వైద్యుడిపై జీవితకాల నిషేధం

అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఓ వైద్యుడు.. తన వృత్తికే తలవంపులు తెచ్చే పని చేశాడు. ఓ రోగికి రెండుసార్లు కాలేయ మార్పిడి చేసిన.......

Published : 12 Jan 2022 19:51 IST

లండన్‌: అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఓ వైద్యుడు.. తన వృత్తికే తలవంపులు తెచ్చే పని చేశాడు. ఓ రోగికి రెండుసార్లు కాలేయ మార్పిడి చేసిన యూకేకు చెందిన డాక్టర్‌​ సైమన్​ బ్రామ్​హాల్ తన పేరులోని మొదటి అక్షరాలతో కాలేయాలపై సంతకంలా చేశాడు. దీనిపై తాజాగా విచారణ జరపగా.. మెడికల్​ ప్రాక్టీషనర్స్​ ట్రైబ్యునల్​ సర్వీస్​ (ఎంపీటీఎస్).. నిందితుడి​ పేరును  మెడికల్​ రిజిస్టర్​ నుంచి తొలగించింది. వైద్య వృత్తి నుంచి అతడిని శాశ్వతంగా తప్పించింది.

2013లో కాలేయ మార్పిడి చేయించుకున్న బాధితుడు.. అనారోగ్యంతో కొద్దిరోజులకే మరోసారి ఆస్పత్రికి వెళ్లగా ఈ విషయం బయటపడింది. అతడి లివర్​పై 1.6 అంగుళాల సైజులో అక్షరాలు ఉన్నట్లు మరో వైద్యుడు గుర్తించాడు. సదరు బాధితుడికి మొదట చేసిన కాలేయ మార్పిడిలోనూ సైమన్‌ ఇలాగే చేసినట్లు అప్పుడే తెలిసింది. 2013 ఫిబ్రవరి, ఆగస్టులో.. ఇలా రెండుసార్లు కాలేయ మార్పిడి చేసిన సమయంలో వాటిపై తన ఇనీషియల్స్​ను రాసినట్లు సైమన్​ 2017లో తన నేరాన్ని అంగీకరించాడు. అక్షరాలు రాసేందుకు ఆర్గాన్​ బీమ్​ మెషీన్​ను ఉపయోగించినట్లు వివరించాడు.

విషయం బయటకు తెలిసిన అనంతరం.. సైమన్​ 2013లోనే కన్సల్టెంట్​ సర్జన్​ పోస్ట్​ నుంచి సస్పెండ్​ అయ్యాడు. 2014లో విచారణ సమయంలోనే అతడు  తన పదవికి రాజీనామా చేశాడు. కాగా ఈ రెండు కేసుల్లో నిందితుడు​ మొత్తం 13,619 డాలర్లు (రూ. 10 లక్షలకుపైనే) జరిమానా కట్టాలని, సమాజ సేవ చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది​​. 2020 డిసెంబర్​లో ఎంపీటీఎస్ మరోసారి కేసును సమీక్షించి.. మెడికల్​ ప్రాక్టీస్​ చేయకుండా ఐదు నెలలు సస్పెన్షన్​ విధించింది. అయితే సత్ప్రవర్తన కారణంగా అతడిపై ఉన్న సస్పెన్షన్​ను 2021 జూన్​లో ఎత్తివేసింది. కాగా ఆ సస్పెన్షన్​పై ట్రైబ్యునల్​ నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు జడ్జి.. నిందితుడిని వైద్య వృత్తి నుంచి తొలగించడమే సముచితమైనదని, అదే అతడికి శిక్ష అని స్పష్టం చేశారు.

సైమన్ ‘ఆటోగ్రాఫ్’​ వల్ల రోగికి ఎలాంటి శారీరక నష్టం జరగకపోయినా.. మానసికంగా ఎప్పటికీ వేధిస్తుందని తాజాగా జరిపిన విచారణలో మెడికల్​ ట్రైబ్యునల్​ కూడా పేర్కొంది. వైద్య వృత్తి నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు తీర్పులో వెల్లడించింది. అయితే 28 రోజుల్లోగా సైమన్​ బ్రామ్​హాల్​కు దీనిపై అప్పీల్​ చేసుకునే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని