సంక్షిప్త వార్తలు(3)

ఉన్నత పాఠశాలల సీనియర్‌ విద్యార్థులకు అమెరికాలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక సైన్స్‌, మ్యాథ్స్‌ పోటీ (రీజెనిరాన్‌ సైన్స్‌ ట్యాలెంట్‌ సెర్చ్‌)లో పాల్గొనేందుకు ఎంపిక చేసిన తుది 40 మందిలో భారత సంతతికి చెందిన ఐదుగురు ఉన్నారు.

Updated : 26 Jan 2023 06:14 IST

ప్రతిష్ఠాత్మక పోటీలకు భారత సంతతి విద్యార్థుల ఎంపిక

వాషింగ్టన్‌: ఉన్నత పాఠశాలల సీనియర్‌ విద్యార్థులకు అమెరికాలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక సైన్స్‌, మ్యాథ్స్‌ పోటీ (రీజెనిరాన్‌ సైన్స్‌ ట్యాలెంట్‌ సెర్చ్‌)లో పాల్గొనేందుకు ఎంపిక చేసిన తుది 40 మందిలో భారత సంతతికి చెందిన ఐదుగురు ఉన్నారు. వీరు- సిద్దు పచ్చిపాల (టెక్సాస్‌), లావణ్య నటరాజన్‌, ఇషికానాగ్‌ (ఫ్లోరిడా); నీల్‌ మౌద్గల్‌ (మిషిగాన్‌), అంబికా గ్రోవర్‌ (కనెక్టికట్‌). ఈ పోటీలో విజేతలకు దాదాపు రూ.14.68 కోట్లు (18 లక్షల డాలర్లు) అవార్డుగా అందజేస్తారు.


కౌమార చింపాంజీల్లో రిస్కు సామర్థ్యం ఎక్కువే

వాషింగ్టన్‌: రిస్కు తీసుకునే సామర్థ్యం విషయంలో మానవ టీనేజర్లు, కౌమారప్రాయ చింపాంజీల మధ్య సారూప్యతలు ఉన్నాయని తాజా పరిశోధన తేల్చింది. అయితే పర్యవసానాల గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే వ్యవహారశైలి విషయంలో అవి మానవులతో పోలిస్తే వెనకబడ్డాయని వెల్లడైంది. చింపాంజీలు 50 ఏళ్ల వరకూ జీవించగలవు. 8 నుంచి 15 ఏళ్ల మధ్య అవి కౌమార ప్రాయంలో ఉంటాయి. ఆ సమయంలో వాటిలో హార్మోన్ల స్థాయి వేగంగా మారుతుంది. కొత్త బంధాలను ఏర్పర్చుకుంటాయి. దురుసు స్వభావం పెరుగుతుంది. గుర్తింపు కోసం పోటీ పడతాయి. రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో 40 చింపాంజీలపై పరిశోధన చేసిన అమెరికాలోని మిషిగన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ మేరకు తేల్చారు. పరిశోధనలో భాగంగా వీటికి రెండు రకాల డబ్బాల్లో ఒకదాన్ని ఎంచుకోవాలని నిర్దేశించారు. ఒక డబ్బాలో చింపాంజీలు ఒకింత ఇష్టపడే వేరుశనగ ఉన్నాయి. రెండో డబ్బాలో ఆ జీవులకు బాగా ఇష్టమైన అరటిపండు కానీ అవి విముఖత ప్రదర్శించే దోసకాయ ముక్కను కానీ పెట్టారు. రిస్కు వద్దనుకుంటే వేరుశనగలు ఉన్న డబ్బాను తీసుకునే అవకాశం వాటికి కల్పించారు. రిస్కు తీసుకుంటే అత్యంత ప్రీతిపాత్రమైన అరటి పండును పొందొచ్చు. అదృష్టం కలిసిరాకుంటే ఇష్టంలేని దోసకాయ తారసపడొచ్చు. డబ్బా తెరిచాక చింపాంజీల భావోద్వేగ స్పందనలను, అరుపులను శాస్త్రవేత్తలు నమోదు చేశారు. వాటి లాలాజలాన్ని సేకరించి, హార్మోన్ల స్థాయినీ పరిశీలించారు. కౌమార ప్రాయంలో ఉన్న చింపాంజీలు ఎక్కువగా రిస్కు తీసుకున్నాయని తేల్చారు.

 


యూవీ నెయిల్‌ పాలిష్‌ డ్రయర్లతో క్యాన్సర్‌ ముప్పు

లాస్‌ ఏంజిలెస్‌: సెలూన్లలో వాడే అతినీల లోహిత (యూవీ) నెయిల్‌ పాలిష్‌ డ్రయింగ్‌ సాధనాలతో మానవ కణాల్లో క్యాన్సర్‌ కారక ఉత్పరివర్తనలు తలెత్తవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. యూవీ కాంతిని వెదజల్లే సాధనాలను 20 నిమిషాలపాటు ప్రయోగిస్తే.. వాటి తాకిడికి గురైన కణాల్లో 20-30 శాతం చనిపోతున్నాయని పరిశోధకులు తెలిపారు. 60 నిమిషాలకు 65 నుంచి 70 శాతం కణాలు మృత్యువాత పడుతున్నాయని వివరించారు. మిగిలిన కణాల్లో డీఎన్‌ఏ దెబ్బతింటున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయని, చర్మ క్యాన్సర్‌లో కనిపించే పోకడలను వాటిలో గుర్తించినట్లు వివరించారు. కొంతకాలం తర్వాత కూడా ఆ మార్పులు సమసిపోవడంలేదని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని