బ్రిటన్‌లో హిందువులకు ఆరోగ్య భాగ్యం, సరస్వతీ కటాక్షం

బ్రిటన్‌లో నివసించే హిందువుల్లో అత్యధికులు మంచి ఆరోగ్యంతో జీవనం గడుపుతున్నారు. అంతేకాదు.. చక్కగా చదువుకొని ఉన్నత విద్యార్హతలు పొందుతున్నారు.

Published : 27 Mar 2023 04:28 IST

సిక్కుల్లో అత్యధికులకు సొంతిళ్లు
జన గణన ఆధారిత విశ్లేషణలో వెల్లడి

లండన్‌: బ్రిటన్‌లో నివసించే హిందువుల్లో అత్యధికులు మంచి ఆరోగ్యంతో జీవనం గడుపుతున్నారు. అంతేకాదు.. చక్కగా చదువుకొని ఉన్నత విద్యార్హతలు పొందుతున్నారు. మరోవైపు సిక్కులు సొంతింటి కల నెరవేర్చుకోవడంలో ముందున్నారు. ఇంగ్లాండ్‌, వేల్స్‌లకు సంబంధించి జాతీయ గణాంక కార్యాలయం(ఓఎన్‌ఎస్‌) గృహ సదుపాయం, ఆరోగ్యం, ఉపాధి, విద్య తదితర అంశాల్లో మతాల వారీగా చేపట్టిన విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2021 మార్చిలో ఆన్‌లైన్‌లో చేపట్టిన గణాంక సేకరణ ఆధారంగా ఈ విశ్లేషణను వెలువరించింది. దీని ప్రకారం.. తమను హిందువులుగా పేర్కొన్నవారిలో 87.8 శాతం మంది తాము ‘చాలా మంచి’, ‘మంచి’ ఆరోగ్యంతో జీవిస్తున్నట్లు తెలిపారు. ఇతర మతస్థులతో పోలిస్తే ఆరోగ్యం విషయంలో హిందువులే మెరుగ్గా ఉన్నారు. హిందువుల్లో వైకల్యంతో ఉన్నవారూ తక్కువేనని ఈ విశ్లేషణలో తేలింది. మరోవైపు మొత్తం జనాభాలో ఆరోగ్యంతో జీవిస్తున్నట్టు చెప్పినవారు 82 శాతం మంది ఉన్నారు. అలాగే హిందువులుగా పేర్కొన్నవారిలో 54.8శాతం మంది లెవెల్‌-4 లేదా అంతకన్నా ఎక్కువ(సర్టిఫికెట్‌ లెవెల్‌) విద్యార్హతలు పొందారు. దేశ జనాభాలో ఈ అర్హతలు పొందినవారు 33.8శాతం మంది ఉన్నారు. సిక్కులుగా పేర్కొన్నవారిలో 77.7శాతం మంది సొంతింటిలో నివసిస్తున్నారు. మరోవైపు ముస్లిములుగా పేర్కొన్నవారు మొత్తం జనాభాతో పోలిస్తే నాలుగు రెట్లు అధికంగా జనసాంద్రత ఎక్కువున్న ఇళ్లలో నివసిస్తున్నారు. ముస్లిముల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. ఈ మతస్థుల్లో 16 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్కుల్లో 51.4 శాతం మంది ఉద్యోగం చేస్తున్నారు. మొత్తం జనాభాలో అదే వయస్కుల్లో 70.9శాతం ఉద్యోగాలు చేస్తున్నారు. క్రైస్తవులుగా పేర్కొన్నవారిలో ఇతర మతస్థులతో పోలిస్తే ఆరోగ్య ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు