ప్రయాణికులకు సారీ చెప్పేందుకు.. తైవాన్‌ నుంచి జపాన్‌కు ఎయిర్‌లైన్స్‌ అధిపతి

ప్రయాణికులు తమ సంస్థ కారణంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న ఓ ఎయిర్‌లైన్స్‌ ఛైర్మన్‌ చేసిన పని అంతర్జాతీయంగా వైరల్‌గా మారింది.

Published : 17 May 2023 04:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రయాణికులు తమ సంస్థ కారణంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న ఓ ఎయిర్‌లైన్స్‌ ఛైర్మన్‌ చేసిన పని అంతర్జాతీయంగా వైరల్‌గా మారింది. దేశం దాటి వెళ్లి మరీ ఆయన అందరినీ క్షమాపణలు కోరారు. తైవాన్‌కు చెందిన స్టార్‌లక్స్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రయాణికులు ఇటీవల రాత్రంతా జపాన్‌ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన వైనమిది. జపాన్‌ రాజధాని టోక్యో శివారులోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయంలో మే 6వ తేదీన స్టార్‌లక్స్‌ విమానం తైవాన్‌ రాజధాని తైపీ బయల్దేరాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలస్యమైంది. దీంతో అందులోని ప్రయాణికులను తైపీ వెళ్లే మరో విమానంలోకి ఎక్కించారు. అప్పటికే ఆ విమానంలో కొంతమంది ప్రయాణికులున్నారు. సిబ్బంది పనివేళలు ముగియడంతో రెండో విమానం కూడా ఆలస్యమైంది. అర్ధరాత్రి వరకు ప్రయాణికులను విమానంలోనే ఉంచిన ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది.. చివరకు విమానం రద్దయిందని తాపీగా చెప్పారు. దీంతో 300 మందికి పైగా ప్రయాణికులు రాత్రంతా అక్కడే గడపాల్సి వచ్చింది. మరుసటిరోజు వీరిని మరో విమానంలో పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్టార్‌లక్స్‌ ఎయిర్‌లైన్స్‌ ఛైర్మన్‌ చాంగ్‌ కు వీ హుటాహుటిన తైవాన్‌ నుంచి జపాన్‌కు బయలుదేరారు. మే 7వ తేదీ ఉదయం నరిటా ఎయిర్‌పోర్టులో దిగి అక్కడ చిక్కుకున్న ప్రయాణికులను స్వయంగా కలిసి క్షమాపణలు తెలియజేశారు. ప్రయాణికులకు పూర్తి రీఫండ్‌ ఇస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని