America: అమెరికాలో బియ్యం వ్యాపారులకు కాసుల వర్షం

బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించడంతో అమెరికాలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి.

Updated : 28 Jul 2023 09:44 IST

న్యూయార్క్‌: బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించడంతో అమెరికాలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. ఆకస్మాత్తుగా పెరిగిన డిమాండు బియ్యం వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. మరోవైపు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంపట్ల ఐఎంఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలో బియ్యం కోసం జనం ఎగబడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారంతో పెద్ద బియ్యం కంపెనీలన్నీ ధరలను పెంచేశాయి. భారత్‌ నిషేధం విధించిన తర్వాత అమెరికాలో ధరలు దాదాపు రెట్టింపు అయినట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బియ్యం నిషేధాన్ని ఇతర రకాలకూ విస్తరించే అవకాశం లేకపోలేదని భావిస్తున్న రెస్టారెంట్ల యాజమాన్యాలు ఇప్పటి నుంచే బాస్మతి బియ్యం కొనుగోళ్లను పెంచినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాల కొరత తీవ్రం కాగా.. తాజాగా బియ్యం ఎగుమతులపై భారత్‌ విధించిన నిషేధంతో పరిస్థితులు మరింత జటిలంగా మారే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది. బియ్యం ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించటం పట్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ద్రవ్యోల్బణంపై ఇది ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున ఆంక్షలను ఎత్తి వేయాలని కోరుతున్నట్లు ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థిక వేత్త పియర్‌ ఒలివర్‌ గౌరించస్‌ తెలిపారు. భారత్‌ తీసుకున్న నిర్ణయం.. ప్రపంచ వ్యాప్తంగా ఆహారధరలపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా ప్రతీకార చర్యలకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని