2050 నాటికి ప్రపంచంలో 100 కోట్ల మందికి కీళ్లవ్యాధి

ప్రపంచంలో 2050 నాటికి రమారమి వంద కోట్ల మంది ప్రజలు కీళ్లవ్యాధితో జీవించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని ‘లాన్సెట్‌ రుమటాలజీ జర్నల్‌’లో ప్రచురితమైన పరిశోధన పత్రం చెబుతోంది.

Published : 23 Aug 2023 05:29 IST

లాన్సెట్‌ అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: ప్రపంచంలో 2050 నాటికి రమారమి వంద కోట్ల మంది ప్రజలు కీళ్లవ్యాధితో జీవించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని ‘లాన్సెట్‌ రుమటాలజీ జర్నల్‌’లో ప్రచురితమైన పరిశోధన పత్రం చెబుతోంది. 30 ఏళ్లు, అంతకుమించిన వయసువారిలో ప్రపంచంలో 15% మంది ప్రస్తుతం ఆ సమస్యతో సతమతం అవుతున్నారు. 1990-2020 మధ్య కాలానికి సంబంధించి 200 దేశాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించినమీదట అధ్యయన నివేదికను రూపొందించారు. 1990లో 25.60 కోట్లమంది దీనిబారిన పడితే 2020 నాటికి అది 59.50 కోట్లకు (132%) పెరిగింది. ‘ప్రపంచ వ్యాధుల భారం అధ్యయన నివేదిక 2021’లో భాగంగా వాషింగ్టన్‌లºని ‘ఆరోగ్య గణాంకాల మదింపు సంస్థ’ (ఐహెచ్‌ఎంఈ) దీనిని రూపొందించింది. ప్రధానంగా- వయోభారం, జనాభా పెరుగుదల, స్థూలకాయం అనే మూడు కారణాల వల్ల కీళ్ల సమస్యలు వేగంగా పెరిగిపోతున్నాయని అధ్యయనకర్తలు తేల్చారు. జనాభాలో స్థూలకాయాన్ని నియంత్రించగలిగితే ఈ సమస్యను 20% మేర తగ్గించవచ్చని వారు పేర్కొన్నారు. శారీరక శ్రమ చేస్తున్నకొద్దీ జీవితంలో త్వరగా గాయాలపాలయ్యే ప్రమాదాన్ని తప్పించుకోవడంతోపాటు కీళ్ల సమస్యల నుంచీ బయటపడవచ్చని ఐహెచ్‌ఎంఈ శాస్త్రవేత్త లియానే ఆంగ్‌ తెలిపారు. మోకాలు, తుంటిఎముకలో ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం పురుషుల (39%) కంటే మహిళల్లోనే ఎక్కువ (61%) అని అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతానికి ఆస్టియో ఆర్థరైటిస్‌ నిర్మూలనకు సమర్థమైన చికిత్స అందుబాటులో లేనందున.. అది రాకుండా చూసుకోవడమే మేలని సూచించింది. కీళ్ల మార్పిడి చికిత్సలను తక్కువ ఆదాయం ఉన్న దేశాలకూ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని