తొలి చర్చతో మార్మోగిన వివేక్‌ పేరు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ సంతతి వివేక్‌ రామస్వామి ప్రజాదరణలో అనూహ్యంగా దూసుకుపోతున్నారు.

Published : 26 Aug 2023 05:37 IST

గంటలో 4.5 లక్షల డాలర్ల విరాళాలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ సంతతి వివేక్‌ రామస్వామి ప్రజాదరణలో అనూహ్యంగా దూసుకుపోతున్నారు. గురువారం రిపబ్లికన్‌పార్టీ చర్చ ముగిసిన గంటలోనే ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా అమెరికన్లు 4.5లక్షల డాలర్ల విరాళాలు గుప్పించారు. దీన్నిబట్టి ఆయన వాగ్దాటి.. ఎంతగా మంత్రముగ్ధులను చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ఆయన ప్రస్తుతం అమెరికా ఒపీనియన్‌ పోల్స్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఫ్లోరిడా గవర్నర్‌ డిశాంటిస్‌ల తర్వాతి స్థానంలో ఉన్నారు. ‘ట్రంప్‌ గైర్హాజరీలో... రిపబ్లికన్‌పార్టీ చర్చల్లో రామస్వామి దూసుకుపోతున్నారు’ అని ఆక్సిక్‌ వార్తాసంస్థ కొనియాడగా... తొలి సమావేశంలో రామస్వామి అందరి దృష్టిని ఆకర్షించారు అని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ప్రకటించింది. రామస్వామి వాదనా పటిమముందు ఇతరులంతా తేలిపోయారని న్యూయార్క్‌టైమ్స్‌ పేర్కొంది. ఇది రిపబ్లిక్‌ పార్టీ షోలా కాకుండా వివేక్‌ రామస్వామి షోలా ఉందని ఎన్‌బీసీ వార్తాసంస్థ వ్యాఖ్యానించింది. చర్చ అనంతరం జరిగిన సర్వేలో 28 శాతం మంది రామస్వామి ప్రదర్శన అత్యుత్తమం అనగా... 27 శాతం మంది ఫ్లోరిడా గవర్నర్‌కు మద్దతుగా నిలిచారు. మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌కు 13 శాతం మంది, నిక్కీ హేలీకి 7 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. అభ్యర్థిత్వ రేసులో చివరకు ట్రంప్‌, తాను మాత్రమే మిగులుతామని రామస్వామి జోస్యం చెప్పారు. అలాగే చర్చావేదికపై కూడా ట్రంప్‌ను ఆయన కొనియాడారు. 21వ శతాబ్దంలో ఆయనే అత్యుత్తమ అధ్యక్షుడు అని ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు