విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌

విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్‌ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

Updated : 26 Apr 2024 06:23 IST

అమెరికాలో కొత్త నిబంధనలు

వాషింగ్టన్‌: విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్‌ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అనవసరపు రుసుముల భారం నుంచి వినియోగదారులను రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం..

  • ప్రయాణికులు ప్రత్యేకంగా అభ్యర్థించకపోయినా వారికి అందించాల్సిన రిఫండ్‌లను ఆటోమేటిక్‌గా చెల్లించాలి. క్రెడిట్‌ కార్డు ద్వారా సొమ్ము చెల్లించినవారికి ఏడు పనిదినాలు, ఇతర మార్గాల్లో చెల్లించిన వారికి 20 రోజుల్లో డబ్బును తిరిగిచ్చేయాలి. కొనుగోలు సమయంలో వారు ఏ మాధ్యమం ద్వారా చెల్లించారో అదే రూపంలో వారికి తిరిగివ్వాల్సి ఉంటుంది. వోచర్లు, ట్రావెల్‌ కార్డులు ఇతరత్రా రూపంలో పరిహారం ఇవ్వడానికి వీల్లేదు. ప్రయాణికుడు అభ్యర్థిస్తే మాత్రం వారు కోరుకున్న విధంగా ఇవ్వొచ్చు.
  • విమానయాన సంస్థలు, టికెట్‌ ఏజెంట్లు రిఫండ్లలో ఎలాంటి కోత పెట్టకూడదు. ఏమైనా సేవలు వినియోగించుకొని ఉంటే దాని వరకు మాత్రమే మినహాయించుకొని, మిగిలిన మొత్తాన్ని వాపస్‌ చేయాలి.
  • లగేజీ, రిజర్వేషన్‌ మార్పు లేదా రద్దుపై ఎంత తీసుకుంటారో ముందే తెలియజేయాలి. తద్వారా ఎలాంటి రుసుములు చెల్లిస్తున్నారో కస్టమర్లకు అవగాహన ఉంటుంది. పైగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఆయా ఫీజులను నేరుగా కనిపించేలా చూపించాలి. ప్రత్యేక హైపర్‌లింక్‌ల రూపంలో ఇవ్వకూడదు. * లగేజీ బరువు, పరిమాణం.. వీటిని బట్టి విధించే ఛార్జీని విధిగా పేర్కొనాలి. రిజర్వేషన్‌ మార్పు, రద్దుకు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా తెలియజేయాలి. కొన్ని సీట్ల కోసం మాత్రమే కేటాయింపు ఫీజు వసూలు చేస్తున్నప్పుడు.. అన్ని సీట్లకు దాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని ప్రయాణికులకు విధిగా అవగాహన కల్పించాలి. తద్వారా వారు అనవసరంగా ఆ రుసుమును చెల్లించకుండా ఉంటారు.

కత్తిరింపులు తగ్గించడానికే..

పలు సేవల పేరిట విమానయాన సంస్థలు అదనపు రుసుములు వసూలు చేస్తున్నాయి. పైగా వాటిని ప్రయాణికులకు తెలియజేయడం లేదు. తీరా చెల్లింపులు చేసేటప్పుడు వివిధ రకాల ఛార్జీలను చూసి వారు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అలాగే విమానాల రద్దు, మార్గం మళ్లింపు సమయంలో ప్రయాణం రద్దు చేసుకొని రిఫండ్‌ కోరితే.. వివిధ ఛార్జీల పేరిట కొంత మొత్తానికి కోత పెడుతున్నారు. వాటికి చెక్‌ పెట్టడానికి అమెరికా ఈ నిబంధనలు తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని