Ukraine Crisis: మేరియుపొల్‌కు విముక్తి కల్పించాం

ఉక్రెయిన్‌లో వ్యూహాత్మక ఓడరేవు నగరమైన మేరియుపొల్‌కు ‘విముక్తి’ కల్పించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గురువారం ప్రకటించారు. అక్కడి చిట్టచివరి ప్రాంతాన్ని మాత్రం చుట్టుముట్టవద్దని తన బలగాలను ఆదేశించారు.

Updated : 22 Apr 2022 05:51 IST

ముఖ్య కేంద్రంపై విజయం సాధించాం: పుతిన్‌

కీవ్‌: ఉక్రెయిన్‌లో వ్యూహాత్మక ఓడరేవు నగరమైన మేరియుపొల్‌కు ‘విముక్తి’ కల్పించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గురువారం ప్రకటించారు. అక్కడి చిట్టచివరి ప్రాంతాన్ని మాత్రం చుట్టుముట్టవద్దని తన బలగాలను ఆదేశించారు. ఉక్రెయిన్‌ తరఫున తీవ్రంగా ప్రతిఘటిస్తున్నవారు అక్కడి అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారంలో ఆశ్రయం పొందడం, లొంగిపోవాల్సిందిగా పుతిన్‌ సేనలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే. ఈ నగరంపై తమ సేనలు విజయం సాధించాయని పుతిన్‌ ప్రకటిస్తూ.. దక్షిణ ప్రాంతంలోని ముఖ్యమైన కేంద్రాన్ని దక్కించుకోవడం ఒక గెలుపు అని చెప్పారు. ఉక్కు కర్మాగారంలో ఉన్న బంకర్లు, సొరంగాల్లోకి తమ సైనికుల్ని పంపించే సాహసాన్ని ప్రస్తుతానికి చేయదలచుకోలేదనీ, అయితే వాటి నుంచి ఒక్క ఈగనైనా బయటకు రానివ్వకుండా చూస్తామని ప్రకటించారు. తద్వారా ఆ కర్మాగారంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారు. ఆహారం, ఆయుధ నిల్వలు తరిగిపోతే ఆ సొరంగాల లోపల ఉన్నవారు వారంతట వారే బయటకు వస్తారనేది రష్యా యోచనగా చెబుతున్నారు. అది జరకపోతే అప్పుడు బాంబులు వేసే అవకాశం లేకపోలేదు. ఆ కర్మాగారాన్నీ స్వాధీనం చేసుకుంటే తప్ప మేరియుపొల్‌ పూర్తిగా దక్కినట్లు ప్రకటించలేని పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 2,000 మంది వరకు సైనికులు అక్కడ ఉన్నారని అంచనా. వెయ్యి మంది సాధారణ పౌరులు కూడా అక్కడ ఉన్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. అజోవ్‌స్తల్‌ కర్మాగారాన్ని దిగ్బంధించామనీ, కొద్దిరోజుల్లోనే అది తమ వశమవుతుందని రష్యా రక్షణ మంత్రి సెర్గెయి షొయిగు చెప్పారు.

తదుపరి అడుగులు డాన్‌బాస్‌ వైపు

తూర్పు ఉక్రెయిన్‌లో పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్‌ను చేజిక్కించుకోవడంపై రష్యా సైనికులు ఇప్పుడు దృష్టి సారించారు. యుద్ధంలో తమ తదుపరి ప్రధాన లక్ష్యం అదేనని ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయానికి చిహ్నంగా ఏటా మే 9న నిర్వహించే విజయోత్సవానికి ముందు ఉక్రెయిన్‌లో ఒక విజయాన్ని రష్యా ప్రకటించుకోదలచిందని బ్రిటన్‌ రక్షణ శాఖ భావిస్తోంది. కష్టమైన లక్ష్యాలను ఛేదించడంపై కాకుండా ఇతరత్రా విజయాలపై రష్యా దృష్టి నిలిపిందని బ్రిటన్‌ చెబుతోంది. లుహాన్స్క్‌లో 80% ప్రాంతం రష్యా దళాల నియంత్రణలోకి వెళ్లిందని అక్కడి గవర్నర్‌ ప్రకటించారు.


ఉక్రెయిన్‌కు కొత్తగా అమెరికా సైనిక, ఆర్థిక సాయం

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌కు మరో 80 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని అందించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఇప్పటికే అందించిన 600 కోట్ల డాలర్ల సాయం దాదాపు ఖర్చయిపోయిందన్నారు. భారీస్థాయి ఆయుధాలు, 1.44 లక్షల తూటాలు, డ్రోన్లు, హొవిట్జర్లు వంటివి ఈ ప్యాకేజిలో ఉన్నట్లు తెలిపారు. రష్యాకు అనుబంధంగా ఉన్న నౌకల్ని అమెరికా రేవుల్లోకి రానిచ్చేది లేదని చెప్పారు. జీతాలు వంటి ఖర్చుల కోసం ఉక్రెయిన్‌కు మరో 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి.  


కమలా హారిస్‌, జుకెర్‌బర్గ్‌లపై రష్యా నిషేధం

మాస్కో: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, ఫేస్‌బుక్‌ అధిపతి మార్క్‌ జుకెర్‌బర్గ్‌, మరికొందరు అమెరికా ప్రముఖులపై ప్రయాణపరమైన నిషేధాన్ని విధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. అమెరికాకు చెందిన 29 మంది, కెనడాకు చెందిన 61 మందిపై ఈ నిషేధం నిరవధికంగా కొనసాగుతుందని తెలిపింది.

* 19 మంది ఉక్రెయిన్‌ ఖైదీలను రష్యా విడుదల చేసింది. వీరిలో 10 మంది సైనికులు ఉన్నారు.


జెలెన్‌స్కీకి ప్రజాస్వామ్య పరిరక్షణ పురస్కారం

బోస్టన్‌: ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తున్నవారికి ఇచ్చే ‘జాన్‌ ఎఫ్‌ కెన్నడీ’ పురస్కారానికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎంపికయ్యారు. ఆయనతో సహా మొత్తం ఐదుగురిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు సంబంధిత ఫౌండేషన్‌ ప్రకటించింది. చావో రేవో అన్నట్లుగా దేశం కోసం ఆయన పోరాడుతున్నారని కొనియాడింది. మిగిలిన నలుగురు.. అమెరికాలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి దోహదపడ్డారని తెలిపింది. మే 22న వీటిని బోస్టన్‌లో ప్రదానం చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని