సింగపూర్‌లో ధర్మలింగంకు ఉరిశిక్ష అమలు

మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో భారత సంతతి మలేసియన్‌ నాగేంద్రన్‌ ధర్మలింగం (34)కి సింగపూర్‌లో బుధవారం ఉరిశిక్షను అమలు చేశారు. మానసిక పరిపక్వత సరిగాలేని అతనికి 11 ఏళ్ల క్రితమే మరణశిక్ష పడింది. అనంతరం శిక్షను తగ్గించుకోవడానికి న్యాయపరంగా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ధర్మలింగం మృతదేహానికి మలేసియాలో అంత్యక్రియలు జరపనున్నట్లు అతని సోదరుడు నవీన్‌ కుమార్‌ తెలిపారు....

Published : 28 Apr 2022 05:12 IST

హెరాయిన్‌తో పట్టుబడిన భారత సంతతి మలేసియన్‌
11 ఏళ్లు కొనసాగిన న్యాయపోరాటం

సింగపూర్‌: మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో భారత సంతతి మలేసియన్‌ నాగేంద్రన్‌ ధర్మలింగం (34)కి సింగపూర్‌లో బుధవారం ఉరిశిక్షను అమలు చేశారు. మానసిక పరిపక్వత సరిగాలేని అతనికి 11 ఏళ్ల క్రితమే మరణశిక్ష పడింది. అనంతరం శిక్షను తగ్గించుకోవడానికి న్యాయపరంగా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ధర్మలింగం మృతదేహానికి మలేసియాలో అంత్యక్రియలు జరపనున్నట్లు అతని సోదరుడు నవీన్‌ కుమార్‌ తెలిపారు.

2009 నాటి కేసు..

2009లో ధర్మలింగం 42.72 గ్రాముల హెరాయిన్‌తో మలేసియా కాజ్‌వే నుంచి సింగపూర్‌లోకి ప్రవేశిస్తుండగా అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల విషయంలో ప్రపంచంలోనే అత్యంత కఠిన చట్టాలను అమలుచేస్తున్న సింగపూర్‌లో అతనికి తర్వాతి సంవత్సరమే మరణశిక్ష పడింది. అప్పటి నుంచి జైలులో ఉంటూనే అతను న్యాయపోరాటం కొనసాగించాడు. సింగపూర్‌ చట్టాల ప్రకారం 15 గ్రాములకు మించి హెరాయిన్‌తో పట్టుబడితే మరణశిక్ష విధిస్తారు. కాగా గతంలో ధర్మలింగంను పరీక్షించిన ఓ వైద్య నిపుణుడు అతని మానసిక పరిపక్వత సరిగా లేదని తేల్చడంతో ఈ కేసు వివాదాస్పదమైంది. ఈ విషయమై అతని తరఫున ఎన్నోసార్లు చేసిన సవాళ్లను పలు సింగపూర్‌ న్యాయస్థానాలు కొట్టివేశాయి. గత ఏడాది సింగపూర్‌ అధ్యక్షుడికి పెట్టుకున్న క్షమాభిక్ష విజ్ఞప్తి కూడా తిరస్కరణకు గురైంది. అతనికి మరణశిక్ష విధించడంపై అంతర్జాతీయంగా విమర్శలొచ్చాయి. ఐరాస, ఈయూలు కూడా ఖండించాయి. ఉరిశిక్షను రద్దు చేయాలంటూ అంతర్జాతీయంగా అనేక విజ్ఞాపనలు కూడా వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. ధర్మలింగానికి 2021 నవంబరు 10నే ఉరి తీయాల్సి ఉండగా అతను కొవిడ్‌ బారిన పడటంతో శిక్ష ఆలస్యమైంది. అనంతరం అతను ఉన్నత కోర్టులను ఆశ్రయించడం, దానిపై విచారణలు జరగడం వల్ల శిక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఆఖరి నిమిషంలో తన కుమారుడిని కాపాడుకోవడానికి మలేసియా నుంచి వచ్చిన ధర్మలింగం తల్లి రెండు రోజుల క్రితం సింగపూర్‌ కోర్ట్‌ ఆఫ్‌ అపీల్‌లో విజ్ఞాపన దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని