పెళ్లికి ముందే.. ముద్దూముచ్చట్లేంటి?

ఒకబ్బాయితో నా పెళ్లి నిశ్చయమైంది. తనో ఇంటీరియర్‌ డిజైనర్‌. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. ఓసారి సరదాగా డిన్నర్‌ చేద్దాం రమ్మంటే వెళ్లాను.

Updated : 18 May 2024 03:31 IST

ఒకబ్బాయితో నా పెళ్లి నిశ్చయమైంది. తనో ఇంటీరియర్‌ డిజైనర్‌. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. ఓసారి సరదాగా డిన్నర్‌ చేద్దాం రమ్మంటే వెళ్లాను. ఇద్దరం ఓ మూలన కూర్చున్నాం. నేను వద్దన్నా వినకుండా అక్కడ తను నన్ను హగ్‌ చేసుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడు. చాలా అసౌకర్యంగా అనిపించింది. తను చూడటానికి బుద్ధిమంతుడిలాగే ఉంటాడు. ఆ సంఘటన జరిగాక.. అతడి మీద చెడు అభిప్రాయం మొదలైంది. ఇంకొద్దిరోజుల్లోనే పెళ్లి. క్యాన్సిల్‌ చేసుకొమ్మంటారా?
- ఆర్‌.ఎస్‌.ఎం., ఈమెయిల్‌

అర్థం చేసుకునే, ప్రేమించిన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి అందమైన అనుబంధంగా మారుతుంది. అదే సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు, గొడవలు ముదిరినప్పుడు అది ప్రత్యక్ష నరకం అవుతుంది. అందుకే ఒక వ్యక్తిని పెళ్లాడేటప్పుడు అటు ఏడుతరాలు, ఇటు ఏడుతరాలు చూడాలంటారు. ఇక ఆ అబ్బాయి విషయాని కొద్దాం. అతడు ఇంటీరియర్‌ డిజైనర్‌ అంటున్నారు. తను వృత్తిపరంగా అందరితో బాగా కలిసిపోయేలా, ఎక్కువ సంబంధ బాంధవ్యాలు నెరపాల్సిన విధంగా ఉంటుందేమో! అతడు పుట్టి పెరిగిన వాతావరణం, స్నేహితులను బట్టి కూడా ఆ రకమైన ప్రవర్తన ఉండే అవకాశం ఉంటుంది. రెస్టరెంట్‌లో మిమ్మల్ని కౌగిలించుకొని, ముద్దు పెట్టుకోవడం ఆమోదించే విషయం కాకపోయినా.. ఆ ఒక్క సంఘటన ఆధారంగా అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేం. తను అలా ఎందుకు చేశాడో నేరుగానే అడగండి. 

ముందు మీకు ఎలాంటి వ్యక్తి కావాలో స్పష్టంగా ఒక నిర్ణయానికి రండి. తమవాళ్లపై ఉన్న ప్రేమను అందరిముందు ప్రదర్శించడాన్ని కొందరు గొప్ప విషయంగా భావిస్తుంటారు. తనూ అలాగే చేశాడా? అయితే పెళ్లికి ముందే ఇలా చేయడం మీకు నచ్చకపోయి ఉండకపోవచ్చు. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పండి. అతిగా సోషలైజింగ్‌ మీకు నచ్చకపోతే మీ అభిప్రాయాలు, ఫీలింగ్స్, ఇష్టాలు ఏంటో అతడికి అర్థమయ్యేలా వివరించండి. అప్పుడు తన వివరణ తెలుస్తుంది. చదువుకున్న వ్యక్తి కాబట్టి తప్పకుండా అర్థం చేసుకుంటాడు. అయినా అతడి ధోరణి అతడిదే, తన ప్రవర్తన మారదు.. అనిపిస్తే మీ అభిప్రాయాన్ని అమ్మా నాన్నలకు చెప్పండి. సరైన నిర్ణయం వాళ్లే తీసుకుంటారు. మీ నైతిక విలువలు, పద్ధతులకు భిన్నంగా ఉన్న వ్యక్తిని పెళ్లాడి, సర్దుకు పోయి జీవితాంతం బాధ పడాల్సిన అవసరం లేదనిపిస్తోంది. 
ఆల్‌ ది బెస్ట్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు