Rishi Sunak: అక్షతకు సమయస్ఫూర్తి ఎక్కువ

బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి కోసం హోరాహోరీగా తలపడుతున్న రిషి సునాక్‌ తన సతీమణి అక్షతా మూర్తితో అనుబంధం గురించి తాజాగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సహధర్మచారిణితో పోలిస్తే తనకే క్రమశిక్షణ కాస్త ఎక్కువని

Updated : 08 Aug 2022 06:30 IST

నాదేమో క్రమశిక్షణలో ముందంజ
ఆమెతో తొలి పరిచయంలోనే ప్రత్యేక అనుభూతి కలిగింది
సతీమణి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న రిషి సునాక్‌

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి కోసం హోరాహోరీగా తలపడుతున్న రిషి సునాక్‌ తన సతీమణి అక్షతా మూర్తితో అనుబంధం గురించి తాజాగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సహధర్మచారిణితో పోలిస్తే తనకే క్రమశిక్షణ కాస్త ఎక్కువని పేర్కొన్నారు. నిజానికి తామిద్దరం చాలా భిన్నమైన వ్యక్తులమని.. బహుశా విజాతి ధ్రువాలే ఆకర్షించుకుంటాయన్న చందాన ఒక్కటై ఉండొచ్చని చమత్కరించారు. తమ దాంపత్య బంధం గురించి ఓ వార్తసంస్థతో ముఖాముఖిలో తాజాగా సునాక్‌ మాట్లాడుతూ.. ‘‘నేను వస్తువులన్నింటినీ చక్కగా సర్దుకుంటుంటాను. తను మాత్రం చిందరవందరగా పడేస్తుంటుంది. నాకు క్రమశిక్షణ చాలా ఎక్కువ. తనేమో చాలా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తుంటుంది. ఈ విషయాలన్నీ బయటకు చెప్పడం తనకు నచ్చదు. కానీ మీకు ఉన్నదున్నట్లు చెప్పేస్తున్నా. ఇంట్లో వస్తువులన్నింటినీ చక్కగా సర్దే తత్వం కాదు తనది. దుస్తులు, బూట్లు ఎక్కడివక్కడ వదిలేస్తుంటుంది’’ అని సరదాగా చెప్పుకొచ్చారు. సునాక్‌, అక్షత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో తొలిసారి కలుసుకొన్నారు. 2006లో బెంగళూరులో వారి వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు- కృష్ణ (11), అనౌష్క (9) ఉన్నారు. స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకునేటప్పుడు అక్షత పక్కన కూర్చునేందుకు తన తరగతుల షెడ్యూలును కావాలనే మార్చుకునేవాడినని సునాక్‌ తాజాగా వెల్లడించారు. నిజానికి ఆమెను తొలిసారి కలిసినప్పుడే ఏదో ప్రత్యేక అనుభూతి కలిగిందని తెలిపారు. అక్షత ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అనే సంగతి తెలిసిందే. సునాక్‌ తల్లిదండ్రులు భారత సంతతివారు. ఆయన సౌథాంప్టన్‌లో జన్మించారు.

ఒపీనియన్‌ పోల్స్‌పై అసంతృప్తి

ప్రధానమంత్రి పీఠం రేసులో తాను వెనకంజలో ఉన్నట్లు ఒపీనియన్‌ పోల్స్‌లో ఎక్కువగా వస్తుండటంపై సునాక్‌ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నేను బహుశా అండర్‌డాగ్‌ను కావొచ్చు. కానీ నా పరాజయం ఖాయమైనట్టు ఇప్పుడే చెప్పడం సరికాదు. నేను జనంలో బాగా తిరుగుతున్నా. వారితో మాట్లాడుతున్నా. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. కచ్చితంగా నేను మరింత కష్టపడాలి. అందుకు సిద్ధంగా ఉన్నాను. నా శాయశక్తులా కృషిచేస్తూనే ఉన్నాను’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని