Zelensky: బెడిసికొట్టిన మస్క్ శాంతి ప్రణాళిక.. కుబేరుడిపై జెలెన్ స్కీ కౌంటర్ ఓటింగ్

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక బెడిసికొట్టింది. ట్విటర్‌ వేదికగా ఆయన చేసిన ప్రతిపాదనలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు సహా పలువురు ఉన్నతాధికారులు తిరస్కరించారు.

Published : 05 Oct 2022 07:45 IST

కీవ్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక బెడిసికొట్టింది. ట్విటర్‌ వేదికగా ఆయన చేసిన ప్రతిపాదనలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు సహా పలువురు ఉన్నతాధికారులు తిరస్కరించారు. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, జపోరిజియా, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌లను రెఫరెండం ద్వారా రష్యాలో విలీనం చేస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించిన క్రమంలో... యుద్ధానికి ముగింపు పలికేందుకు మస్క్‌ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

‘‘1) రష్యా విలీన ప్రాంతాల్లో ఐరాస పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఎన్నికలు జరగాలి. ఒకవేళ ప్రజలు తీర్పు ఉక్రెయిన్‌కు అనుకూలంగా ఉంటే.. రష్యా ఆ ప్రాంతాన్ని వీడాలి. 2) 1783 నుంచి క్రిమియా అధికారికంగా రష్యాలో భాగమే. దానికి నీటి సరఫరా హామీ ఉండాలి. 3) ఉక్రెయిన్‌ తటస్థంగా ఉండాలి’’ అని పేర్కొంటూ తన ప్రణాళికపై ఓటింగ్‌ పెట్టారు. దీనిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఘాటుగా స్పందించారు. ‘‘మీకు ఏ మస్క్‌ ఇష్టం? ఉక్రెయిన్‌ వైపు నిలిచేవారా? లేక రష్యాకు మద్దతు ఇచ్చే వ్యక్తా?’’ అంటూ కౌంటర్‌ ఓటింగ్‌ పెట్టారు. ఇందుకు మస్క్‌ స్పందించారు. తన ప్రతిపాదన ప్రజాదరణ పొందకపోయినా ఫర్వాలేదని, ప్రజల ప్రాణాలే ముఖ్యమని అన్నారు. ‘‘రష్యా పాక్షిక సైనిక సమీకరణ చేస్తోంది. క్రిమియా ప్రమాదంలో ఉంటే వారు పూర్తిస్థాయి యుద్ధానికి వెళ్తారు. దాంతో రెండువైపులా భారీ ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఉక్రెయిన్‌ కంటే రష్యా జనాభా మూడింతలు అధికం. మొత్తం యుద్ధంలో ఉక్రెయిన్‌ విజయం అసంభవం. మీరు ప్రజల బాగు కోరుకుంటే.. శాంతి పక్షాన ఉండండి’ అంటూ రాసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని