ఏ దేశమేగినా భారత్‌ జయహో

ప్రపంచ యవనికపై భారత కీర్తిప్రతిష్ఠలు దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఉపాధి కోసం పరాయి గడ్డపై పాదాలు మోపిన భారతీయులు అక్కడి వారితో మమేకమై జీవించడమే కాకుండా సంక్షోభ సమయాల్లో ఆయా దేశాలకు దిశానిర్దేశం చేసే పాలకులుగానూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు.

Updated : 26 Oct 2022 05:42 IST

కీలక పదవుల్లో మన మూలాలున్న నేతలు
వలస నేపథ్యాల నుంచి సారథ్యం స్థాయికి..

ప్రపంచ యవనికపై భారత కీర్తిప్రతిష్ఠలు దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఉపాధి కోసం పరాయి గడ్డపై పాదాలు మోపిన భారతీయులు అక్కడి వారితో మమేకమై జీవించడమే కాకుండా సంక్షోభ సమయాల్లో ఆయా దేశాలకు దిశానిర్దేశం చేసే పాలకులుగానూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. బ్రిటన్‌ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రిషి సునాక్‌ తాజా సంచలనం. భారతీయ మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టిన దేశాల జాబితాలో యూకే చేరింది. ఇంకా ఏయే దేశాల్లో మన వాళ్లు సారథ్య బాధ్యతలు, కీలక పదవులు చేపట్టారో తెలుసుకుందాం.


కమలా హారిస్‌, అమెరికా ఉపాధ్యక్షురాలు: భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె మాతృమూర్తి, పూర్వీకులు తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తులసేంద్రిపురానికి చెందినవారు.


భారత్‌ జగ్దేవ్‌, గయానా మాజీ అధ్యక్షుడు: పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడిగా ‘టైమ్‌ మ్యాగజీన్‌’ గుర్తించిన భారత్‌ జగ్దేవ్‌ 1999 ఆగస్టు 11 నుంచి 2011 వరకు గయానా అధ్యక్షుడిగా పని చేశారు. ఈ పదవికి రెండు సార్లు ఎన్నికయ్యారు. 2020 నుంచి ఆ దేశ ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. ఆయన తాత రామ్‌జీ యూపీలోని అవథ్‌ నుంచి గయానాకు వలస వెళ్లారు.


మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ, గయానా అధ్యక్షుడు: ఇండో-గయానా ముస్లిం కుటుంబంలో జన్మించిన మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ.. 2020లో గయానా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.


బస్దీయో పాండే, ట్రినిడాడ్‌-టొబాగో మాజీ ప్రధాని: భారత్‌ నుంచి ట్రినిడాడ్‌-టొబాగోకు వలస వెళ్లిన కుటుంబంలో జన్మించిన బస్దీయో పాండే విద్యాభ్యాసం లండన్‌లో కొనసాగింది. పలు సినిమాల్లోనూ నటించారు. 1995 నవంబరులో ట్రినిడాడ్‌-టొబాగో ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు. 2001 వరకు ఆ పదవిలో ఉన్నారు.


మహేంద్ర పాల్‌ చౌధరి, ఫిజీ మాజీ ప్రధాని: హరియాణాలోని బహు జమల్‌పుర్‌ నుంచి 1902లో మహేంద్ర పాల్‌ చౌధరి తాత ఫిజీకి వలస వచ్చారు. మహేంద్ర పాల్‌ 1999లో ఆ దేశ ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టారు. 2000 వరకు ఆ పదవిలో ఉన్నారు.


అనిరుధ్‌ జగన్నాథ్‌, మారిషస్‌ మాజీ ప్రధాని, అధ్యక్షుడు: అనిరుధ్‌ తాత 1850లో మారిషస్‌కు వలసవెళ్లారు. బ్రిటన్‌లో న్యాయ విద్యను చదివిన అనిరుధ్‌ జగన్నాథ్‌ 1982లో ఆ దేశ ప్రధానిగా తొలుత అధికారాన్ని చేపట్టి 1995 వరకు కొనసాగారు. ఆ తర్వాత 2000-03, 2014-17 మధ్య కాలంలో ఆ పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. 2003-08, 2008-12లలో రెండు దఫాలు దేశ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అనిరుధ్‌ మరణానంతరం ఆయన కుమారుడు ప్రవింద్‌ మారిషస్‌ ప్రధానిగా 2017లో బాధ్యతలు చేపట్టారు.


రామ్‌సేవక్‌ శంకర్‌, సురినామ్‌ మాజీ అధ్యక్షుడు: దక్షిణ అమెరికా దేశమైన సురినామ్‌కు 1988 నుంచి 1990 వరకు రామ్‌సేవక్‌ శంకర్‌ అధ్యక్షుడిగా కొనసాగారు. సైన్యం తిరుగుబాటుతో అధికారం కోల్పోయారు.


పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌, మారిషస్‌ అధ్యక్షుడు: మారిషస్‌ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌ కుటుంబం భారత ఆర్యసమాజ్‌ హిందూ కుటుంబానికి చెందినది. పలుమార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైన ఆయన.. 2019 నుంచి మారిషస్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.


కమలా ప్రసాద్‌, ట్రినిడాడ్‌-టొబాగో మాజీ ప్రధాని: భారత్‌లోని భేల్‌పుర్‌లో వంశీకుల మూలాలున్న కమలా ప్రసాద్‌ 2006లో ట్రినిడాడ్‌-టొబాగో విపక్ష నేతగా నియమితులయ్యారు. 2010లో ఆ దేశ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. 2015 వరకు అధికారంలో కొనసాగారు.


చంద్రికా ప్రసాద్‌ సంతోఖి, సురినామ్‌ అధ్యక్షుడు: సురినామ్‌ దేశాధ్యక్షుడిగా చంద్రికా ప్రసాద్‌ సంతోఖి 2020 నుంచి కొనసాగుతున్నారు. ఆయన కుటుంబం కూడా భారత మూలాలున్నదే.


సి.వి.దేవన్‌ నాయర్‌, సింగపూర్‌ మాజీ అధ్యక్షుడు: కేరళలోని థలస్సెరీకి చెందిన కూలీ కుమారుడైన సి.వి.దేవన్‌ నాయర్‌ తన పదేళ్ల వయసులో కుటుంబంతోకలిసి సింగపూర్‌ వలసవెళ్లారు. 1979లో అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ దేశ మూడవ అధ్యక్షుడిగా 1981 అక్టోబరు 23 నుంచి 1985 మార్చి 27 వరకు కొనసాగారు.


ఎస్‌.ఆర్‌.నాథన్‌, సింగపూర్‌ మాజీ అధ్యక్షుడు: సింగపూర్‌ అధ్యక్షుడిగా అత్యధిక కాలం ఆ పదవిలో  కొనసాగిన వ్యక్తి ఎస్‌.ఆర్‌.నాథన్‌. 1999 నుంచి 2011 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. మూడో దఫా బరిలో నిలిచేందుకు విముఖత చూపారు.


మహతిర్‌ మహమ్మద్‌, మలేసియా మాజీ ప్రధాని: బ్రిటిష్‌ ఈస్టిండియా హయాంలో మహతిర్‌ మహమ్మద్‌ తాత ఆంగ్ల ఉపాధ్యాయుడిగా కేరళ నుంచి మలేసియా వెళ్లారు. వైద్యుడైన మహతిర్‌ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1981 నుంచి 2003 వరకు దీర్ఘ కాలం ఆ పదవిలో ఉన్న వ్యక్తిగా పేరు గడించారు.


ఆంటోనియో కోస్టా, పోర్చుగల్‌ ప్రధాని: గోవా మూలాలున్న ఆంటోనియో కోస్టా.. పోర్చుగల్‌ ప్రధానిగా 2015 అక్టోబరు 26 నుంచి కొనసాగుతున్నారు. ఆంటోనియో తండ్రి ఆర్నాల్డో డా కోస్టా..పోర్చుగీసు రచయిత, పాత్రికేయుడు. గోవా, పోర్చుగీస్‌ వంశీకుల నేపథ్యం ఉన్న వ్యక్తి. ఆంటోనియా లిస్బన్‌లో జన్మించారు. వీరి పూర్వీకులు గోవాలోని మార్గోవాలో ఇప్పటికీ ఉన్నారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని