Pakistan: పాకిస్థాన్‌లో భారీ వర్షాలు.. 27 మంది మృతి!

పాకిస్థాన్‌(Pakistan) లో ఈదురుగాలులతో కూడి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి 27 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించి సహాయక చర్యలు చేపట్టారు. 

Published : 11 Jun 2023 17:13 IST

ఇస్లామాబాద్‌: ఇప్పటికే ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో సతమతమవుతోన్న పాకిస్థాన్‌ (pakistan)ను ఈదురు గాలులు, భారీ వర్షాలు (Heavy Rains) కుదిపేస్తున్నాయి. శనివారం రాత్రి పాక్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షాల ధాటికి 27 మంది మృతి చెందారని, వారిలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

ఖైబర్‌ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. 140కిపైగా పౌరులు గాయపడ్డారని, 200కుపైగా మూగజీవాలు మృతి చెందాయని అధికారులు తెలిపారు. బన్ను జిల్లాలో 15 మంది మృతి చెందారు. వారిలో 2 -  5 ఏళ్ల వయసున్న ఒకే కుటుంబానికి చెందిన పిల్లలున్నారు. పలు చోట్ల ఇంటి పైకప్పు, గోడలు కూలిపోవడంతో శిథిలాల్లో చిక్కుకొని 12 మంది మృతి చెందారు.ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో ఎమర్జెన్సీ ప్రకటించి.. సహాయక చర్యలు ముమ్మరం చేసింది. 

మరోవైపు ఓ తుపాను పాకిస్థాన్‌, భారత్‌కు చేరువగా వస్తోందని పాక్‌ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ వారంలో గంటకు 100 కి.మీ వేగంతో ఈదురు గాలులు, భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని