Israel - Hamas: మాయమైన మానవత్వం!

మాయా ఆల్పర్‌.. ఇజ్రాయెలీల మ్యూజిక్‌ పార్టీలో బార్‌ వెనుక పర్యావరణ వాలంటీర్లతో కలిసి విధులు నిర్వహిస్తున్నారు.. వారి పని పార్టీలో చెత్తను ఏరివేయడంతోపాటు అక్కడికొచ్చిన వారికి వోడ్కా అందించడం.. ఉదయం ఆరు గంటలవుతోంది.. స్టేజీ మీద డీజే ప్రదర్శన సాగుతోంది.

Updated : 10 Oct 2023 09:31 IST

సంగీత సంబరంలో మాటలకందని విషాదం
పొదల్లో దాక్కున్నా వెతికి మరీ చంపారు

జెరూసలెం: మాయా ఆల్పర్‌.. ఇజ్రాయెలీల మ్యూజిక్‌ పార్టీలో బార్‌ వెనుక పర్యావరణ వాలంటీర్లతో కలిసి విధులు నిర్వహిస్తున్నారు.. వారి పని పార్టీలో చెత్తను ఏరివేయడంతోపాటు అక్కడికొచ్చిన వారికి వోడ్కా అందించడం.. ఉదయం ఆరు గంటలవుతోంది.. స్టేజీ మీద డీజే ప్రదర్శన సాగుతోంది. సరిగ్గా అప్పుడు సంగీతాన్ని చీల్చుకుంటూ హెచ్చరిక సైరన్‌ వచ్చింది. రాకెట్లు పడుతున్నాయి. దీంతో వెంటనే 25 ఏళ్ల ఆల్పర్‌ తన కారులోకి దూకేసి.. మెయిన్‌ రోడ్డుపైకి దూసుకొచ్చారు. కానీ అప్పటికే చాలామంది రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. భయకంపితులైన యువతీయువకులు కార్లను వదిలి రోడ్లపై పరుగెడుతూ రక్తసిక్తమై ఆల్పర్‌ ఎదుటే కుప్పకూలిపోయారు. అలా.. 260 మంది ఒక్కచోటే ప్రాణాలొదిలారు. ఇదీ.. ఇజ్రాయెల్‌లో నోవా సంగీత సంబరంలో చోటుచేసుకున్న మాటలకందని విషాదం. హమాస్‌ మిలిటెంట్లు విచ్చలవిడిగా చేసిన దాడికి సాక్షీభూతం.

గాజా సరిహద్దులోని కిబ్బుజ్‌ రీమ్‌వద్ద జరిగిన ఈ సంగీత సంబరానికి సుమారు 3,000 మంది హాజరయ్యారు. శనివారం ఉదయం కొన్ని నిమిషాల్లోనే పలు వ్యాన్లలో 50 మంది సాయుధ ముష్కరులు అక్కడికి వచ్చారు. వీక్షకులపై తూటాల వర్షం కురిపించారు. దీంతో సంగీత సంబరానికి వచ్చిన వారంతా నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఈ దారుణం జరుగుతున్నప్పుడు రోడ్డుపై నిస్సహాయంగా ఉన్న కొంత మందిని ఆల్పర్‌ తన కారులో ఎక్కించుకున్నారు. వ్యతిరేక దిశగా కారును వేగంగా పోనిచ్చి ప్రాణాలను కాపాడుకున్నారు. కారులో ఎక్కిన వారిలో ఒక వ్యక్తి సీట్లో కూర్చుని కారు వెనుక అద్దంలో చూస్తూ.. ‘మనం చనిపోబోతున్నాం’ అని గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. ఆల్పర్‌ కారు నడుపుతుండగా.. సమీపంలోకి ఒక వ్యక్తి వచ్చి ‘దేవుడు గొప్పవాడు’ అని అరవడం ప్రారంభించాడు.

దీంతో భయపడిన వారంతా కారు దిగి సమీపంలోని పొదల్లోకి పరుగెత్తారు. ఒక బుల్లెట్‌ ఆల్పర్‌ చెవి పక్క నుంచి వెళ్లింది. దీంతో ఆమె ఒక్కసారిగా పొదల్లోకి దూకారు. కారులో వచ్చిన ఓ యువతీ కుప్పకూలిపోయింది. ఆమె మృతదేహం పక్కనే సాయుధుడు నిల్చుని ఉన్నాడు. 6 గంటలపాటు ఆల్పర్‌తోపాటు వేల మంది పార్టీకి వచ్చిన వారు ఇజ్రాయెల్‌ సైన్యం సాయం కోసం ఎదురుచూశారు. పొదల్లోకి దూకడంతో ఆమె చేతులన్నీ దెబ్బతిన్నాయి. ఆ పొదలే తమను కాపాడాయని ఆల్పర్‌ తెలిపారు. ఇజ్రాయెలీ ట్యాంకరు వచ్చాక ఆ శబ్దాలు విన్నాకే తాను క్షేమమని అనుకున్నానని ఆమె వివరించారు. ఆల్పర్‌ గట్టిగా అరవడంతో సైనికులు వచ్చి ఆమెను పొదల నుంచి రక్షించారు.

అత్యవసర ద్వారాలవద్ద కాచుకు కూర్చుని..

కాల్పులు మొదలయ్యాక ప్రజలు అత్యవసర ద్వారాల వద్దకు చేరుకుంటారని మిలిటెంట్లు ముందే అంచనా వేశారు. ఈ క్రమంలో చాలామంది సాయుధులు అక్కడ వేచి ఉన్నారు. ఈ ద్వారాల నుంచి బయటకు వచ్చేవారిని కాల్చి చంపారు. తన జీవితంలో ఇలాంటి నరమేధం చూడలేదని యనీవ్‌ అనే వ్యక్తి పేర్కొన్నారు.

విదేశీయుల హత్య, అపహరణ

ఈ పార్టీలో ఉన్న విదేశీయులను హమాస్‌ ముష్కరులు దారుణంగా హత్య చేశారు. జర్మనీకి చెందిన ఓ యువతి ఈ పార్టీలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె జాడలేదు. బ్రిటన్‌కు చెందిన జాక్‌ మార్లోవ్‌ ఈ పార్టీలో గార్డుగా పని చేస్తున్నారు. ఇప్పుడు ఆయన జాడా లేదు. ఈ పార్టీలో పాల్గొన్న ఇజ్రాయెలీ అమెరికన్‌ హెర్ష్‌ గోల్బెర్గ్‌ పోలిన్‌ ఆచూకీ లభించడం లేదు. అతడి పుట్టిన రోజు చేసుకున్న కొద్ది సేపటికే హమాస్‌ దాడి జరిగింది.

చనిపోయినట్లు నటించి ప్రాణాలు కాపాడుకుని..

పార్టీకి హాజరైన వారిలో ఏస్తర్‌ బ్రోచోవ్‌ అనే మహిళ ఉన్నారు. కాల్పులు మొదలు కాగానే కారులో పారిపోయేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె వాహనం మరో దానిని ఢీకొనడంతో ఆగిపోయింది. సమీపంలో కారు నడుపుతున్న ఓ యువకుడు ఆమెను రక్షించేందుకు తన వాహనంలో ఎక్కించుకున్నారు. కొద్దిసేపటికే ఆ యువకుడిని పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో హమాస్‌ ముష్కరులు కాల్చి చంపారు. దీంతో ఏస్తర్‌ చనిపోయినట్లు నటిస్తూ ఏమాత్రం కదలకుండా అక్కడే పడిపోయారు. ముష్కరులు అక్కడి నుంచి వెళ్లిపోయాక.. ఇజ్రాయెల్‌ సైనికులు వచ్చి ఆమెను రక్షించే వరకూ అలాగే ఉన్నారు. మరికొందరు చెట్లు, పొదల చాటున దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. మిలిటెంట్లు ప్రతి చెట్టు వద్దకూ వెళ్లి వెతికి కనిపించిన వారిని విచక్షణా రహితంగా కాల్చి చంపారు.

ఇళ్లల్లోకి చొరబడి.. పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చేసి..

ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగిన హమాస్‌ ఉగ్రవాదులు అక్కడి పౌరులపై జరిపిన దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముష్కరులు ఇళ్లల్లోకి చొరబడి పాయింట్‌ బ్లాంక్‌లో కాల్పులు జరిపి అమాయక పౌరులను పొట్టనబెట్టుకుంటున్నారని ఐరాసలో ఇజ్రాయెల్‌ శాశ్వత ప్రతినిధి గిలాడ్‌ ఎర్డాన్‌ ఆవేదన చెందారు. ‘క్రూరమైన ఈ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌ పౌరులను వీధుల్లో పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతున్నారు. పురుగుల్ని నలిపినట్లుగా.. ఇళ్లల్లోకి చొరబడి ప్రజలను పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను బలవంతంగా లాక్కొని వారిని బంధిస్తున్నారు. గత రెండు రోజులుగా మా దేశం హమాస్‌ దాడిలో వందలాది మంది పౌరులను పోగొట్టుకుంది. ఇవన్నీ యుద్ధ నేరాలే’ అని ఎర్డాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

* నేపాల్‌కు చెందిన కొంత మంది విద్యార్థులు బంకర్లలో తలదాచుకుంటున్నారు. తమను కాపాడాలంటూ వారు వీడియో సందేశాన్ని నేపాల్‌కు పంపించారు. బంకర్‌లోనే సురక్షితంగా లేమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని