Ukraine Crisis: ఎవరెన్ని చెప్పినా.. బ్యాలెన్స్‌గానే భారత్‌

రష్యా దాడిని ఖండిస్తూ ఉక్రెయిన్(Ukraine) ప్రవేశపెట్టిన తీర్మానానికి మరోసారి భారత్‌ దూరం జరిగింది. ప్రస్తుత ఓటింగ్‌లో 32 దేశాలు ఇదే వైఖరిని పాటించాయి.

Updated : 24 Feb 2023 10:27 IST

న్యూయార్క్‌: తమ దేశంలో శాంతిని నెలకొల్పే ముసాయిదా తీర్మానం విషయంలో సహకారం అందించాలని ఉక్రెయిన్‌(Ukraine) చేసిన విజ్ఞప్తికి భారత్‌ నుంచి సానుకూలత లభించలేదు. ఐరాస(UN)లో ఉక్రెయిన్‌(Ukraine) ప్రవేశపెట్టిన శాంతి ప్రణాళిక ముసాయిదాపై జరిగిన ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగించడంలో, శాంతి నెలకొల్పడంలో భారత్‌ కీలక పాత్ర పోషించాలని ఇదివరకు ఫ్రాన్స్‌ కోరింది. ఈ మేరకు ఫ్రాన్స్‌ దౌత్య బృందం గట్టిగానే ప్రయత్నించింది. కానీ భారత్‌ మాత్రం మొదటినుంచి స్వతంత్ర వైఖరినే ప్రదర్శిస్తోంది. 

యూఎన్‌ ఛార్టర్‌లోని సూత్రాలకు అనుగుణంగా శాశ్వత శాంతి స్థాపన నిమిత్తం శాంతి ప్రణాళికను ఉక్రెయిన్‌ సిద్ధం చేసింది. ఆ దేశంపై రష్యా దాడి ప్రారంభించి ఏడాది గడిచిన నేపథ్యంలో దానిని గురువారం 193 సభ్యుల జనరల్‌ అసెంబ్లీ(UN General Assembly)లో ప్రవేశపెట్టింది. ఈ ముసాయిదా తీర్మానానికి 141 మంది అనుకూలంగా ఓటు వేయగా.. 7 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. 32 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అందులో భారత్ ఒకటి. ఈ శాంతి ప్రణాళికను ప్రవేశపెట్టడానికి ముందు ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు ఫోన్ వచ్చింది. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ డోభాల్‌తో ఉక్రెయిన్‌(Ukraine) అధ్యక్ష కార్యాలయ అధిపతి యాండ్రీ యెర్మాక్‌ బుధవారం ఫోన్లో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పోరాటం కొనసాగుతున్న తీరును వివరించారు. తీర్మానం విషయంలో అనుకూలంగా ఓటు వేయాలని కోరారు. 

తమదెప్పుడూ శాంతి పక్షమే అని చెప్తున్న భారత్‌.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రష్యా(Russia) దాడి ఖండన తీర్మానాలకు దూరంగా ఉంటోంది. అలాగే యూఎన్ ఛార్టర్, అంతర్జాతీయ చట్టాలు, దేశాల  సార్వభౌమత్వాన్ని గౌరవించాల్సి ఉందని స్పష్టం చేస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని