Lata Mangeshkar: ఆమె పాటకు.. పాకిస్థాన్‌ నియంత కూడా అభిమానే!

నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన లతా మంగేష్కర్‌కు తానూ అభిమానినే అంటూ పాకిస్థాన్‌ నియంత జనరల్‌ ముహమ్మద్‌ జియా ఉల్‌హక్‌ గతంలో స్వయంగా ఒప్పుకోవడం విశేషం.

Published : 07 Feb 2022 01:35 IST

స్వయంగా ఒప్పుకున్న పాక్‌ మాజీ అధ్యక్షుడు జియా ఉల్‌హక్‌

ఇస్లామాబాద్‌: ఆయనో క్రూరమైన నియంత.  దేశంలో మహిళలు కళా ప్రదర్శనలు ఇవ్వడం నిషేధం అంటూ ఆంక్షలు విధించిన వ్యక్తి. అటువంటి కర్కశ భావాలున్న వ్యక్తి మాత్రం లతా మంగేష్కర్‌ స్వరం నుంచి జాలువారిన గేయాలకు కరిగిపోయేవాడు. నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన లతా మంగేష్కర్‌కు తానూ అభిమానినే అంటూ పాకిస్థాన్‌ నియంత జనరల్‌ ముహమ్మద్‌ జియా ఉల్‌హక్‌ గతంలో స్వయంగా ఒప్పుకోవడం విశేషం.

దివంగత పాత్రికేయుడు కుల్‌దీప్‌ నయ్యర్‌ 1982లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లతా మంగేష్కర్‌పై ఉన్న అభిమానాన్ని జియా ఉల్‌హక్‌ ఒప్పుకున్నాడు. పొరుగు దేశానికి ఏదైనా సాంస్కృతిక కళా బృందం వెళ్లి ప్రదర్శన ఇవ్వాలకుంటే అందుకు పాకిస్థాన్‌ స్వాగతించడం లేదని భారతీయులు అనుకుంటున్నారని కుల్దీప్‌ నాయర్‌ ప్రశ్నించారు. లతా మంగేష్కర్‌తో మరికొందరు మహిళా గాయకులతో కూడిన బృందం పాకిస్థాన్‌లో ప్రదర్శన ఇచ్చే అంశాన్ని ప్రస్తావించారు. దానికి జియా ఉల్‌హక్‌ సమాధానమిచ్చారు. ‘అందుకు నేనే బాధ్యుడిని. లతా మంగేష్కర్‌ అంటే నాకెంతో అభిమానం. కానీ, పాకిస్థాన్‌లో వారు సంగీత ప్రదర్శన ఇచ్చేందుకు రావాలనుకుంటే నేను ఇప్పుడు అంగీకరించను. ఎందుకంటే ప్రస్తుతం పాకిస్థాన్‌ స్ఫూర్తికి అది అనుకూలం కాదు’ అంటూ జవాబిచ్చారు.

ఇదిలాఉంటే, 1977లో పాకిస్థాన్‌లో జుల్ఫికర్‌ అలీ భుట్టో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన అక్కడి సైన్యం ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకుంది. అనంతరం 1978 నుంచి 1988 వరకూ పాకిస్థాన్‌ పాలన జనరల్‌ ముహమ్మద్‌ జియా ఉల్‌హక్‌ చేతిలోనే ఉండిపోయింది. అయితే, సైనిక చర్యకు ముందు దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన జ్వాలలను తగ్గించడంతోపాటు పాలనపై తన మార్కును సాధించుకునేందుకు జనరల్‌ జియా ఉల్‌హక్‌ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా మతం పేరుతో ఎన్నో కఠిన చర్యలు అమలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మహిళలు కళా ప్రదర్శనలు ఇవ్వడంపై నిషేధం విధించారు. అదే సమయంలో లతా మంగేష్కర్‌ బృందం సంగీత ప్రదర్శనపై స్పందించిన జియా.. స్వతహాగా ఆమె అంటే తనకు అభిమానమని అంగీకరించాడు. 1988లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో ముహమ్మద్‌ జియా ఉల్‌హక్‌ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని