g20 summit 2023: మా దేశానికి వస్తే పుతిన్‌ను అరెస్టు చేయబోం: బ్రెజిల్‌

పుతిన్‌ వచ్చే ఏడాది జరగనున్న జీ20 సదస్సుకు నిర్భయం హాజరుకావచ్చని బ్రెజిల్‌ అధ్యక్షుడు భరోసా ఇచ్చారు. తాము ఆయన్ను అరెస్టు చేయమని తేల్చిచెప్పారు. 

Updated : 10 Sep 2023 11:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2024లో రియో జీ20 సదస్సుకు రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) హాజరైతే ఎవరూ అరెస్టు చేయబోరని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూల డ సల్వా శనివారం రాత్రి ప్రకటించారు. జీ20 సైడ్‌లైన్స్‌ సందర్భంగా ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది జీ20 (g20 summit 2023)కి తాను ఆయన్ను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. అంతేకాదు.. రష్యాలో జరిగే బ్రిక్స్‌ సమావేశానికి తాను హాజరయ్యేందకు ప్లాన్‌ చేసుకొంటానని తెలిపారు.

‘‘పుతిన్ బ్రెజిల్‌కు చాలా తేలిగ్గా రాగలరు. అప్పటికి నేనే అధ్యక్షుడిగా ఉంటే మాత్రం ఆయన్ను అరెస్టు చేసే అవకాశమేలేదని చెప్పగలను’’ అని వివరించారు. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు ఏర్పాటు కోసం జరిగిన రోమ్‌ ఒప్పందంలో బ్రెజిల్‌ కూడా సంతకం చేసింది. అయినా.. దిల్లీ జీ20 వేదికగానే పుతిన్‌కు బ్రెజిల్‌ అధ్యక్షుడు ఆహ్వానం పలకడం విశేషం. తాజాగా జరుగుతున్న న్యూదిల్లీ జీ20లో కూడా పుతిన్‌ పాల్గొనకుండా.. ఆయన ప్రతినిధిగా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ను పంపించారు.   

ఏఐ, క్రిప్టోపై పరస్పర సహకారం

అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు పుతిన్‌పై ఈ ఏడాది మార్చిలో అరెస్టు వారెంటు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌ నుంచి బలవంతంగా పిల్లలను అపహరించిన నేరానికి ఈ వారెంటు జారీ చేసినట్లు అప్పట్లో తెలిపారు. నాటి నుంచి పుతిన్‌ అంతర్జాతీయ సదస్సులకు హాజరయ్యేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదనే వాదన ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని