Maldives: మాల్దీవుల అధ్యక్షుడికి షాక్‌.. మాలె మేయర్‌ ఎన్నికల్లో భారత అనుకూల పార్టీ గెలుపు!

Maldives: మాల్దీవుల రాజధాని మాలె మేయర్‌ ఎన్నికల్లో అధ్యక్షుడు ముయిజ్జుకు చెందిన ‘పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (PNC)’ ఘోర ఓటమి చవిచూసింది.

Updated : 14 Jan 2024 09:52 IST

మాలె: అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు (Maldives President Mohamed Muizzu) ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ ‘పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (PNC)’ ఘోర ఓటమి చవిచూసింది. భారత అనుకూల పార్టీ అయిన ‘మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP)’ శనివారం ఘనవిజయం సాధించింది. భారత్‌తో దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

మాలె మేయర్‌గా ఎండీపీకి చెందిన ఆదమ్ అజీమ్ ఎన్నికయ్యారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగేంత వరకు ఆ పదవిలో ముయిజ్జు (Mohamed Muizzu) కొనసాగారు. అజీమ్‌ గెలుపును మాల్దీవుల మీడియా ‘అఖండ విజయం’గా అభివర్ణించింది. ఎండీపీకి ప్రస్తుతం భారత అనుకూల విధానాలను అనుసరించే మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ సొలిహ్‌ నాయకత్వం వహిస్తున్నారు. చైనా అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్న ముయిజ్జు చేతిలో అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. మేయర్‌ గెలుపు ఎండీపీకి రాజకీయంగా కలిసొస్తుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మాది చిన్న దేశమే.. బెదిరించడం తగదు: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

భారత ప్రధాని మోదీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు నోరుపారేసుకున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో పర్యాటక ఆధారిత దేశమైన మాల్దీవులకు ఎవరూ వెళ్లొద్దని సామాజిక మాధ్యమాల్లో భారత్‌లోని వివిధ వర్గాల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పిలుపునకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచీ మద్దతు లభించింది. మాల్దీవులకు (Maldives) బదులు మన లక్షద్వీప్‌నకు వెళ్లాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని