Germany : ఒకే వ్యక్తి 90సార్లు టీకా వేసుకున్నాడు.. ఎందుకో తెలిస్తే షాక్‌..!

జర్మనీలో ఒక వ్యక్తి (60) నకిలీ కొవిడ్‌ టీకాల ధ్రువపత్రాలు విక్రయించడం కోసం 90సార్లు టీకా వేయించుకున్నాడు. 

Published : 07 Apr 2022 13:26 IST

జర్మనీ: సాధారణంగా కరోనా నివారణకు ఎవరైనా రెండు డోసుల టీకా తీసుకుంటారు. కొన్ని దేశాల్లో బూస్టర్‌ డోసుల కింద మూడు, నాలుగు సార్లు కూడా ఇస్తున్నారు. కానీ, జర్మనీకి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 90 సార్లు టీకా వేయించుకున్నాడు. టీకాల ధ్రువపత్రాల కోసం అతడు ఈ పని చేశాడు. వివరాల్లోకి వెళితే.. 

తూర్పు జర్మనీలోని మగ్దేబర్గ్‌ ప్రాంతానికి చెందిన ఓ 60 ఏళ్ల వ్యక్తి గత కొన్ని నెలలుగా అనేక సార్లు టీకాలు వేయించుకున్నాడట. ఆదివారం వరుసగా రెండో రోజు కొవిడ్-19 టీకా కోసం సాక్సోనీలోని ఐలెన్‌బర్గ్‌లోని వ్యాక్సిన్‌ సెంటర్‌కు  వచ్చాడు. అక్కడ నేర విభాగానికి చెందిన పోలీసులు అతనిని గుర్తించారు. ఆరా తీయగా.. ఫోర్జరీ టీకా సర్టిఫికేట్లను విక్రయించడం కోసమే ఈ పని చేసినట్లు తెలిసి పోలీసులు అవాక్కయ్యారు.  అతని నుంచి అనేక ఖాళీ టీకా కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ధ్రువపత్రాలు విక్రయించాడా లేదా అని అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. వివిధ రకాల కంపెనీలకు చెందిన టీకాలను వేసుకోవడంతో అవి అతని ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇంకా తెలియలేదు. 

కొవిడ్‌ విజృంబిస్తున్నా జర్మనీలో టీకా తీసుకోవడానికి చాలా మంది నిరాకరిస్తున్నారు. అయితే, రెస్టారెంట్‌లు, థియేటర్‌లు, స్విమ్మింగ్ పూల్స్ వంటి వాటికి వెళ్లాలంటే టీకా వేయించుకున్నట్లు పాస్‌లు చూపించాలి. దీంతో కొందరు నకిలీ ధ్రువపత్రాల  కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదే అదనుగా తీసుకున్న ఆ వ్యక్తి తానే 90 సార్లు టీకా వేయించుకుని నకిలీ పత్రాలు సృష్టిస్తున్నట్లు తెలిసింది. 

మరోవైపు జర్మనీ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత ఆదివారం అక్కడ ఒక్కరోజే 74,053 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఇప్పటి వరకు మహమ్మారి కారణంగా 1,30,029 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్‌ బిఏ.2 సబ్‌ వేరియంటే కారణంగా వైద్య నిపుణులు భావిస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని