viral video: ముందు పోలీసులు వెనుక అల్లరి మూకలు.. రణరంగం మధ్యలో కూర్చొని శాండ్‌విచ్‌ ఆరగింపు..!

ముందువైపు పోలీసులు.. వెనకవైపు అల్లరి మూకలు.. మధ్యలో ఉండాలంటే ఎవరైనా బెంబేలెత్తిపోతారు. కానీ, పారిస్‌లో ఓ  వ్యక్తి మాత్రం తాపీగా మధ్యలో కూర్చొని శాండ్‌విచ్‌ ఆరగించాడు. 

Published : 30 Jun 2023 11:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పోలీసుల కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మరణం ఫ్రాన్స్‌ మొత్తాన్ని కల్లోలం చేస్తోంది. దాదాపు రెండు రోజులుగా దేశం మొత్తం ఆందోళనలు మిన్నంటాయి. పారిస్‌ శివార్లలోని డిఫెన్స్‌ డిస్ట్రిక్ట్‌ వద్ద నాంటెర్రే అనే ప్రదేశంలో నిన్న నిరసనకారులు.. పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఈ సమయంలో ఆందోళనకారులు అక్కడే ఉన్న సామగ్రికి నిప్పు పెట్టి.. భద్రతా దళాలపైకి గాజుసీసాలు, రాళ్ల వంటివి విసిరారు. అదే సమయంలో భద్రతా దళాలు కూడా ఓ భవనం వద్దకు చేరి ఆందోళనకారులను అదుపు చేసే యత్నాలు చేశాయి. ఈ గొడవ జరుగుతున్న ప్రదేశం మధ్యలో రోడ్డుపై ఉన్న ఓ గట్టుపై కూర్చొని ఓ వ్యక్తి తాపీగా శాండ్‌విచ్‌ ఆరగిస్తున్నాడు. ఘర్షణలో గాయపడతాననే భయం అతడిలో ఏమాత్రం లేదు. అతడికి కొన్ని అడుగుల దూరంలోనే ఆందోళన కారులు నిప్పుపెట్టారు. ఈ తతంగం మొత్తాన్ని సమీప భవనంపై నుంచి ఓ వ్యక్తి చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

పోలీసు కాల్పుల్లో నహేల్‌ అనే అల్జీరియా యువకుడి మరణం తర్వాత తలెత్తిన అల్లర్లు కొనసాగుతున్నాయి. ఘటన జరిగిన మంగళవారం నాటి రాత్రి పారిస్‌ శివారు ప్రాంతాల్లోనే చోటుచేసుకున్న ఈ అల్లర్లు గురువారం దేశమంతా పాకాయి. పలు భవనాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆందోళనల్లో పాల్గొన్న వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. దీంతో పారిస్‌ శివారులోని క్లామర్ట్‌ పట్టణంలో గురువారం రాత్రి కర్ఫ్యూ విధించారు. మరోవైపు యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారి ప్రాసిక్యూషన్‌ ప్రారంభమైంది. అతడిపై హత్యాభియోగాలు నమోదయ్యాయి. ఆందోళనకారులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పాఠశాలలకు, పోలీస్‌ స్టేషన్లకు, టౌన్‌ హాల్స్‌కు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు బుధవారం రాత్రి నిప్పు పెట్టారు. దాదాపు 100 ప్రభుత్వ భవనాలకు నష్టం వాటిల్లింది. ఒక్క పారిస్‌ ప్రాంతంలోనే 40వేల మంది పోలీసులను మోహరించారు.

క్షమాపణలు చెప్పిన పోలీస్‌ అధికారి..

నహేల్‌ను కాల్చి చంపిన అధికారి.. మృతుడి కుటుంబీకులకు క్షమాపణలు తెలిపాడు. సదరు అధికారి తరపున లాయర్‌ మాట్లాడుతూ.. మనుషులను చంపడం అతడి ఉద్దేశం కాదని పేర్కొన్నాడు. పొరబాటున జరిగిందని వివరించాడు. ఇప్పటి వరకు అల్లర్లను అదుపు చేయడానికి 400 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు నహేల్‌ తల్లి మాట్లాడుతూ.. ఒక్క అధికారి చేసిన పొరబాటుకు మొత్తం పోలీసుశాఖను తాను నిందించనని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని