Updated : 01 Mar 2022 13:10 IST

Satya Nadella: మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు మృతి

వాషింగ్టన్‌: మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు జైన్‌ నాదెళ్ల (26) కన్నుమూశారు. పుట్టుకతోనే కండరాలకు సంబంధించిన వ్యాధి(cerebral palsy)తో బాధపడుతున్న జైన్‌..  అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఆరోగ్యం విషమించి మృతిచెందారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ సంస్థ తన ఎగ్జిక్యూటివ్‌ సిబ్బందికి ఈ-మెయిల్‌ ద్వారా వెల్లడిస్తూ జైన్‌ మృతికి సంతాపం ప్రకటించింది.

సత్య నాదెళ్ల, అను దంపతుల పెద్ద కుమారుడు జైన్‌ 1996లో జన్మించాడు. అయితే జైన్‌ తీవ్రమైన సెరెబ్రల్‌ పాల్సీ లక్షణాలతో పుట్టినట్లు వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి అతడు వీల్‌ ఛెయిర్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. దీంతో సత్య నాదెళ్ల కుటుంబం ఎంతగానో కుంగిపోయింది. అయితే ఆ బాధను దిగమింగుకుని తన కొడుకు లాంటి వారికోసం వినూత్న పరికరాలపై నాదెళ్ల దృష్టిపెట్టారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంగవైకల్యం ఉన్నవారు కూడా సులువుగా ఉపయోగించుకునేలా మైక్రోసాఫ్ట్‌ ఉత్పత్తుల్లో అనేక కొత్త మార్పులను తీసుకొచ్చారు.

ఏంటీ సెరిబ్రల్‌ పాల్సీ

సెరిబ్రల్‌ పాల్సీ అనేది వ్యాధి కాదు. ఇది ఒక శారీరక, మానసిక రుగ్మత. చిన్నపిల్లల్లో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. తాజా గణాంకాల ప్రతి 1000 మంది పిల్లల్లో ఇద్దరు లేదా ముగ్గురిని ఈ వ్యాధి కబళిస్తోంది. చేతికి అందిరావాల్సిన చిన్నారులను వికలాంగులుగా మార్చేసి, వారి భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేస్తోంది. సెరిబ్రల్‌ పాల్సీకి గురైన వారిలో మెదడు శాశ్వతంగా దెబ్బతినడం, అసాధారణమైన ఎదుగుదలతో ఈ సమస్య వస్తోంది. గర్భం దాల్చిన సమయంలో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ప్రసవ సమయంలో శిశువు మెదడుకు గాయం కావటం, గర్భంలోనే పిండదశలో మెదడు ఎదుగుదలలో లోపం వంటి కారణాలతో ఈ వ్యాధి బారిన పడతారు. 28 వారాలకు ముందే పిల్లలు పుట్టడం వల్ల తక్కువ బరువుతో ఉంటారు. అలాగే జన్యుపరమైన కారణాలు కూడా సెరిబ్రల్‌పాల్సీ రావడానికి కారణం. సెరిబ్రల్‌ పాల్సీ లక్షణాలు చిన్నపిల్లల్లో మూడు సంవత్సరాల వయస్సులోనే కనిపిస్తాయి. శారీరక కదలికలు, కండరాలపై నియంత్రణ లోపిస్తుంది.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts