Mossad: ఇరాన్‌ క్షిపణి స్థావరంపై మొస్సాద్‌ సీక్రెట్ ఆపరేషన్‌..!

ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ మరోసారి తన రహస్య ఆపరేషన్‌ను విజయవంతంగా ముగించింది. ఈ సారిలో ఇరాన్‌లోని క్షిపణి కేంద్రం దాని లక్ష్యమైంది.

Updated : 02 Feb 2023 17:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఇరాన్‌(Iran)లో ఇస్ఫహాన్‌ నగరంలో అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్న ఓ ఆయుధ కర్మాగార భవనంపై గతవారం ఓ భారీ పేలుడు చోటు చేసుకొంది. అదే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే అజర్షహర్‌లోని చమురు కేంద్రంలో భారీ మంటలు చెలరేగాయి. ఈ దాడులు ఎలా జరిగాయి..? ఎవరు చేశారు..? అక్కడేం ఉందనే విషయాలు వెంటనే ఇరాన్‌(Iran) బాహ్య ప్రపంచానికి  వెల్లడించలేదు. ఇస్ఫహాన్‌లో దాడికి మూడు డ్రోన్లు వస్తే.. రెండింటిని కూల్చివేశామని మాత్రమే వెల్లడించింది. అమెరికాలోని పత్రికలు మాత్రం ఇజ్రాయెల్‌( Israel) నిఘా సంస్థ మొస్సాద్‌ సైలెంట్‌గా ఈ దాడిని నిర్వహించిందని కథనాలు వెలువరించాయి. మొస్సాద్‌ మాత్రం ఎప్పటిలానే మౌనం వహించింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇజ్రాయెలే( Israel) ఈ దాడికి పాల్పడిందంటూ ఇరాన్‌ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. ఆ దేశ అధికారిక వార్తా సంస్థ  ఐఎస్‌ఎన్‌ఏ ఈ మేరకు ప్రకటించింది. తమ ప్రాథమిక దర్యాప్తులో ఈ దాడి ఇజ్రాయెల్‌ పనే అని తేలిందని ఇరాన్‌ ఐరాస దూత అమిర్‌ సయీద్‌ ఇర్వానీ పేర్కొంటూ.. ఐరాస చీఫ్‌కు లేఖ రాశారు. దేశభద్రతను కాపాడుకొనే హక్కు తమకు ఉందని.. ఇజ్రాయెల్‌ చేసే తప్పులకు అవసరమైన చోట తగినట్లు ప్రతిస్పందిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనలతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది.

ఆయుధ కేంద్రాలతో కిక్కిరిసిన ఇస్ఫహాన్‌ నగరం..!

ఇస్ఫహాన్‌లో రెండు క్షిపణి అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. వీటితోపాటు మరో రెండు క్షిపణి సాంకేతికతకు సంబంధించిన సంస్థలు కూడా ఇక్కడి నుంచి పనిచేస్తున్నాయని లండన్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ పేర్కొంది. ఈ నగరంలో మరో నాలుగు అణు ప్రయోగశాలలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా దాడి జరిగిన ప్రదేశం ఇరాన్‌ (Iran) హైపర్‌సోనిక్‌ క్షిపణి అభివృద్ధి కేంద్రం కావొచ్చని మొస్సాద్‌ మాజీ చీఫ్‌ డానీ యాటమ్‌ ఇజ్రాయెల్‌ ( Israel)ఆర్మీ రేడియోలో సోమవారం పేర్కొన్నారు. ఇరాన్‌ వద్ద దాదాపు 3,000 బాలిస్టిక్‌ క్షిపణులు ఉన్నాయని.. వీటిల్లో కొన్ని టెల్‌ అవీవ్‌ను కూడా చేరుకోగలవని ఆయన తెలిపారు.

క్షిపణి కేంద్రం ఎందుకు లక్ష్యంగా మారింది..

ఇరాన్‌ అణ్వాయుధాలు ప్రయోగించకుండా అడ్డుకోవడమే ఇజ్రాయెల్‌( Israel) తొలి ప్రాధాన్యం. ఇజ్రాయెల్‌ రెండు పనులు చేయాలి. ఇరాన్‌(Iran) అణ్వాయుధాల తయారీని ఆపడం.. వాటిని ప్రయోగించే వ్యవస్థలు ఆ దేశానికి దక్కకుండా చేయడమని ఇంటర్నేషనల్‌ క్రైసిస్‌ గ్రూప్‌లోని డైరెక్టర్‌ అలీవేజ్‌ వివరించారు. దీనికి తోడు ఇరాన్‌ అభివృద్ధి చేసిన పలు రకాల ఆయుధాలను సిరియా, లెబనాన్‌, పాలస్తీనాకు సరఫరా చేయడం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఇస్ఫహాన్‌లోని క్షిపణి కేంద్రాన్ని ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ లక్ష్యంగా చేసుకొని ఉండొచ్చనే విశ్లేషణలు ఉన్నాయి.

చిన్న డ్రోన్లతో.. పెద్ద లక్ష్యాలపై దాడులు..!

ఇస్ఫహాన్‌లోని ఆయుధ కేంద్రంపై దాడికి మూడు డ్రోన్లు రాగా వీటిల్లో రెండింటిని కూల్చివేశామని ఇరాన్‌ అధికారులు పేర్కొన్నారు. క్వాడ్‌ కాప్టర్లకు బాంబులెట్స్‌ను అమర్చి దాడి చేసినట్లు పేర్కొన్నారు. వీటిని రిమోట్‌ సాయంతో స్వల్పదూరం నుంచి మాత్రమే ఆపరేట్‌ చేయవచ్చు. కొన్ని వాణిజ్య శ్రేణి క్వాడ్‌కాప్టర్‌ శకలాలను కూడా ఇరాన్‌(Iran) టీవీలో ప్రసారం చేసింది. 2021లో ఇరాన్‌ సెంట్రిఫ్యూజ్‌ తయారీ కేంద్రంపై, 2022లో మిలిటరీ డ్రోన్‌ తయారీ కేంద్రంపై ఇటువంటి డ్రోన్లే దాడి చేసినట్లు టైమ్స్‌ ఇజ్రాయెల్‌ కథనంలో పేర్కొంది. కానీ, ఆ ఆయుధ స్థావరంపై మూడు నుంచి నాలుగు పేలుళ్లు చోటు చేసుకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని లండన్‌లోని ఇరాన్‌ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. అంటే భారీ నష్టమే జరిగే అవకాశం ఉంది.

రష్యా-ఉక్రెయిన్‌ కోణం ఉందా..?

ఈ దాడి వెనుక రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ కోణం కూడా ఉందని పశ్చిమ దేశాల పత్రికలు కథనాలు వెలువరించాయి. ఇరాన్‌ నుంచి అందిన చౌకబారు షహీన్‌ డ్రోన్లతో మాస్కో దళాలు ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నాయి. తాజాగా ఇరాన్‌ నుంచి చౌకబారు క్షిపణులు కూడా కొనుగోలు చేయాలని రష్యా యత్నిస్తున్నట్లు అమెరికా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ సాయంతో క్షిపణి కేంద్రంపై అమెరికానే దాడి చేయించిందనే ప్రచారం ఉంది. ఈ దాడి సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఇజ్రాయెల్‌ పర్యటనలోనే ఉండటం గమనార్హం. 

అంతేకాదు.. ఇరాన్‌ అణు ఒప్పందంపై ఆశలు కూడా మెల్లగా ఆవిరైపోతున్నాయి. ఈ సమయంలో జరిగే ఈ దాడులకు ఇరాన్‌ స్పందించి.. పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చడమో లేదా అమెరికా-ఐరోపా దేశాలతో అణుఒప్పందం చర్చలను కొనసాగించడమో తేల్చుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్‌ సైనిక ఇంటెలిజెన్స్‌ మాజీ అధికారి గ్రిన్‌ బెర్గ్‌.. రేడియో ఫ్రీ యూరప్‌ రేడియో లిబర్టీ పత్రికకు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని