Canada: కెనడాలో విదేశీయులు ఇళ్లు కొనడంపై రెండేళ్ల నిషేధం

కెనడాలో విదేశీయులు ఇళ్లను కొనుగోలు చేయడంపై బ్యాన్‌ విధించారు. రెండళ్ల పాటు ఇది అమల్లో ఉండనుంది.

Updated : 02 Jan 2023 12:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెనడాలో విదేశీయులు ఇళ్ల కొనుగోలుపై విధించిన రెండేళ్ల నిషేధం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇళ్ల కొరతను స్థానికులు అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకొంది. కొత్త చట్టంలో శరణార్థులు, పర్మినెంట్‌ రెసిడెంట్స్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ నిషేధం కేవలం నివాస గృహాలకు మాత్రమే వర్తిస్తుందని, రిక్రియేషన్‌ ఆస్తులకు మాత్రం వర్తించదని అక్కడి ప్రభుత్వం డిసెంబర్‌లోనే వివరణ ఇచ్చింది. 

2021 ఎన్నికల సమయంలో కెనడాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. చాలా మంది కెనడా వాసులు ఇళ్లు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రధాని రేసులో ఉన్న జస్టిన్‌ ట్రూడో రెండేళ్ల బ్యాన్‌ను ఎన్నికల హామీగా ఇచ్చారు. వ్యాపారులు, సంపన్న కార్పొరేట్లు, విదేశీ పెట్టుబడిదారులకు దేశంలో ఇళ్లు లాభసాటిగా మారాయని అప్పట్లో లిబరల్‌ పార్టీ పేర్కొంది. దీంతోపాటు ఈ పరిస్థితి కారణంగా ఖాళీ ఇళ్లు, స్పెక్యులేషన్‌, ధరలు భారీగా పెరిగాయని వివరణ ఇచ్చింది. ఎన్నికల్లో విజయం అనంతరం కెనడావాసులు కాని వారు ఇళ్లు కొనడంపై తాజాగా నిషేధం అమలు చేసింది. 

మరోవైపు వాంకోవర్‌, టొరెంటో వంటి నగరాల్లో ఖాళీగా ఉన్న ఇళ్లపై ప్రభుత్వం భారీగా పన్నులు విధించడం మొదలుపెట్టింది. ఈ చర్యలు ఫలితాన్నిచ్చి అక్కడి రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో ధరలపెంపు గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు 8 లక్షల కెనడా డాలర్లున్న ఇళ్లు ఇప్పుడు 6.30 లక్షల కెనడా డాలర్లకు పతనమైంది. కాకపోతే ద్రవ్యోల్బణం కట్టడికి కెనడా ప్రభుత్వం వడ్డీ రేట్లు పెంచడం మాత్రం ఇళ్ల కొనుగోళ్లకు ఇప్పటికీ ఒక అడ్డంకే. ప్రస్తుతం కెనడాలోని ఇళ్లల్లో కేవలం 5శాతం మాత్రమే విదేశీయుల చేతిలో ఉన్నట్లు గణాంకాలు చెబతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వవని నిపుణులు చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని