Hafiz Saeed: ముంబయి పేలుళ్ల సూత్రధారికి 31ఏళ్ల జైలుశిక్ష..!

ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే తొయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు పాకిస్థాన్‌ న్యాయస్థానం 31ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Published : 09 Apr 2022 01:50 IST

ఇస్లామాబాద్‌: ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే తొయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు పాకిస్థాన్‌ న్యాయస్థానం 31ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు కేసుల్లో అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. శిక్షతో పాటు రూ.3,40,000 జరిమానా విధించింది. అతడికి సంబంధించిన అన్ని ఆస్తులను సీజ్‌ చేయాలని ఆదేశించింది. వీటితోపాటు హఫీజ్‌ నిర్మించినట్లు భావిస్తున్న మసీదుతోపాటు మదర్సాలను కూడా స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది.

2008లో ముంబయిలో జరిపిన పేలుళ్లతో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. దానితో పాటు మరెన్నో ఉగ్రదాడుల్లో హఫీజ్‌ సయీద్‌ కీలక సూత్రధారిగా ఉన్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న హఫీజ్‌పై అమెరికా కోటి డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది. ఐరాస భద్రతా మండలి పేర్కొన్న మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలోనూ హఫీజ్‌ ఉన్నాడు. వీటితోపాటు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న ఆరోపణలతోపాటు మనీలాండరింగ్‌ కేసుల్లోనూ హఫీజ్‌పై ఎన్నో కేసులు ఉన్నాయి.

ఇటీవల రెండు కేసుల్లో (2020) హఫీజ్‌కు 15ఏళ్ల జైలు శిక్ష కూడా పడింది. అయినప్పటికీ హఫీజ్‌ సయీద్‌ పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్‌పై విషయం చిమ్మే ప్రసంగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై ఒత్తిడి వస్తున్నప్పటికీ చర్యలు మాత్రం అంతంత మాత్రమేననే ఆరోపణలున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని