SCO summit: పలకరించుకోని మోదీ, జిన్‌పింగ్‌.. వేదికపై ఎడముఖం పెడముఖం.!

ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న షాంఘై సహకార సంస్థ సదస్సు (SCO summit) కొనసాగుతోంది......

Updated : 16 Sep 2022 19:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న షాంఘై సహకార సంస్థ సదస్సు (SCO summit) కొనసాగుతోంది. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో (Samarkand) జరుగుతున్న ఈ సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్‌, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రులు హాజరయ్యారు. అయితే, ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పొరుగు దేశం చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ మాత్రం పలకరించుకోకపోవడం గమనార్హం. ఒకే వేదికపై ఉన్న వీరు కరచాలనం చేసుకోలేదని, కనీసం మాట్లాడుకోలేదని జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. దూరంగా, ఎడముఖం పెడముఖంగానే ఉన్నట్లు తెలిపాయి.

2020లో జరిగిన గల్వాన్‌ ఘటన తర్వాత మొదటిసారి ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఒకే వేదికను పంచుకున్నారు. కానీ వారు ఏమాత్రం మాట్లాడుకోలేదు. గురువారం సాయంత్రం జరిగిన డిన్నర్ మీటింగ్‌కు ప్రధాని మోదీ దూరమయ్యారని, వార్షిక శిఖరాగ్ర సమావేశం మొదలయ్యే శుక్రవారం సమయానికి అక్కడకు చేరుకున్నట్లు సమాచారం. కాగా ఫొటోలో మోదీ, జిన్‌పింగ్ ఒకే దగ్గర ఉన్నప్పటికీ.. వారు పలకరించుకోలేదని, కరచాలనం కూడా చేసుకోలేదని మీడియా వర్గాలు తెలిపాయి.

జూన్‌ 2019 తర్వాత షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌కు (SCO summit) దేశాధినేతలు నేరుగా హాజరవుతున్నారు. సదస్సుకు దాదాపు 15 దేశాధినేతలు హాజరయ్యారు. మోదీ‌, జిన్‌పింగ్‌తోపాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ వంటి కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యా, చైనా అధ్యక్షుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నట్లు ఆయా దేశాలు ఇదివరకే వెల్లడించాయి. మోదీతో భేటీపై మాత్రం చైనా స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని