Kim Jong Un: రష్యా ‘పోరుకు’ కిమ్‌ బేషరతు మద్దతు.. పుతిన్‌తో 5గంటలపాటు భేటీ

తన భద్రతా ప్రయోజనాల కోసం రష్యా చేస్తున్న పోరాటానికి (ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఉద్దేశిస్తూ) పూర్తి, బేషరతు మద్దతు ఇస్తున్నానని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పేర్కొన్నారు.

Published : 13 Sep 2023 16:17 IST

సియోల్‌: ఉక్రెయిన్‌పై గడిచిన ఏడాదిన్నరగా రష్యా భీకర యుద్ధాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. దీనిని ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un).. ‘పవిత్ర పోరాటం’గా అభివర్ణించినట్లు సమాచారం. తన భద్రతా ప్రయోజనాల కోసం రష్యా చేస్తున్న ఈ పోరాటానికి (ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఉద్దేశిస్తూ) పూర్తి, బేషరతు మద్దతు ఇస్తున్నానని పేర్కొన్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తుల అంశంలో ప్యాంగ్యాంగ్‌ ఎల్లప్పుడూ మాస్కోకు మద్దతుగా నిలబడుతుందన్నారు. రష్యాలో పర్యటనలో భాగంగా పుతిన్‌తో (Vladimir Putin) భేటీ అయిన కిమ్‌.. ఐదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించినట్లు రష్యా అధికారిక మీడియా వెల్లడించింది.

పాశ్చాత్య దేశాలతో ఘర్షణ పడుతున్న రష్యా, ఉత్తర కొరియా అధినేతలు సైబీరియాలోని కీలక అంతరిక్ష ప్రయోగ కేంద్రం సమీపంలో భేటీ అయ్యారు. నాలుగైదు గంటలపాటు పుతిన్‌-కిమ్‌ మధ్య చర్చలు జరిగినట్లు రష్యా వెల్లడించింది. ఈ సందర్భంగా రాకెట్లకు సంబంధించిన ప్రశ్నలను రష్యా అంతరిక్ష పరిశోధకులను కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

ఇక్కడకు వచ్చింది అందుకే : పుతిన్‌

ఉత్తరకొరియా ఉపగ్రహాల తయారీకి సంబంధించి రష్యా సహాయం చేస్తుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన అధ్యక్షుడు పుతిన్‌.. అందుకే ఇక్కడకు వచ్చింది అని పేర్కొన్నారు. ‘మేం ఇక్కడకు వచ్చింది అందుకే. రాకెట్‌ సాంకేతికతపై ఉత్తర కొరియా అధినేత (Kim Jong Un) ఆసక్తి కనబరుస్తున్నారు. అంతరిక్ష ప్రయోగ సాంకేతికత కోసం వారు ప్రయత్నిస్తున్నారు’ అని పుతిన్‌ వెల్లడించారు. ఇక సైనిక సహకారంపై అడిగిన ప్రశ్నకు ‘అటువంటి అంశాలపై మేం మాట్లాడేందుకు తొందరేం లేదు. చాలా సమయం ఉంది’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చెప్పినట్లు అక్కడి మీడియా తెలిపింది.

నాలుగేళ్ల తర్వాత చేస్తున్న ఈ పర్యటన మాస్కోతో మా వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలియజేస్తుందని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పేర్కొన్నట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. ఈ పర్యటన వేళ ఆర్థిక సహాయంతోపాటు సైనిక సాంకేతికతను అందించాలని రష్యాను కోరినట్లు సమాచారం. మరోవైపు సముద్రంలో ఉత్తర కొరియా రెండు ఖండాంతర క్షిపణుల పరీక్షలు జరిపిన కొన్ని గంటల్లోనే పుతిన్‌, కిమ్‌ల భేటీ జరగడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని