Stormy Daniels: ట్రంప్‌నకు రూ.కోటి చెల్లించండి.. శృంగార తారకు కోర్టు ఆదేశం

ట్రంప్‌పై (Donald Trump) వేసిన పరువునష్టం కేసులో డేనియల్స్‌కు (Stormy Daniels) మరోసారి చుక్కెదురయ్యింది. కోర్టు ఫీజు భాగంగా ట్రంప్‌ తరఫు న్యాయవాదులకు లక్షా 20వేల డాలర్లు (సుమారు రూ.కోటి) చెల్లించాలని కాలిఫోర్నియా న్యాయస్థానం ఆదేశించింది.

Published : 05 Apr 2023 15:33 IST

కాలిఫోర్నియా: శృంగార తార స్టార్మీ డేనియల్స్‌ (Stormy Daniels) అనైతిక ఆర్థిక ఒప్పందం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టై (Trump Arrest), విడుదలైన విషయం తెలిసిందే. అనైతిక ఆర్థిక ఒప్పందం కేసులో ఆయనపై నమోదైన అభియోగాలపై న్యూయార్క్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో ట్రంప్‌పై వేసిన పరువునష్టం కేసులో మాత్రం డేనియల్స్‌కు మరోసారి చుక్కెదురయ్యింది. కాలిఫోర్నియాలోని 9వ యూఎస్‌ సర్క్యూట్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌.. డేనియల్స్‌ వాదనను తోసిపుచ్చింది. దీంతో కోర్టు ఫీజులో భాగంగా ట్రంప్‌ తరఫు న్యాయవాదులకు లక్షా 20వేల డాలర్లు (సుమారు రూ.కోటి) చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. మన్‌హటన్‌ న్యాయస్థానంలో ట్రంప్‌ హాజరైన రోజే మరో కోర్టులో ఆయనకు అనుకూలంగా ఈ తీర్పు రావడం గమనార్హం.

ట్రంప్‌ అరెస్టుకు, ఈ సివిల్‌ కేసుకు సంబంధం లేనప్పటికీ రెండు కూడా స్టార్మీ డేనియల్స్‌కు సంబంధించినవే. అయితే, గతంలో ట్రంప్‌పై ఆమె చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. కేవలం డబ్బు కోసమే ఇలాంటి బెదిరింపు ఆరోపణలు చేస్తుందని మాజీ అధ్యక్షుడు దుయ్యబట్టారు. ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై డేనియల్స్‌ 2018లో కోర్టును ఆశ్రయించారు. ఈ పరువునష్టం కేసులో స్టార్మీ డేనియల్స్‌ (Stormy Daniels) ఓడిపోవడంతోపాటు లీగల్‌ ఫీజు కింద ఆమె 2.93లక్షల డాలర్లు చెల్లించాలని స్థానిక కోర్టు ఆదేశించింది. అనంతరం పై కోర్టులో అప్పీలు చేసుకోగా.. అక్కడ కూడా మరో 2.45లక్షలు ఫైన్‌ పడింది. తాజా అప్పీలులోనూ స్టార్మీ డేనియల్స్‌కు చుక్కెదురయ్యింది. దీంతో మొత్తంగా ఆమె దాదాపు 6లక్షల డాలర్లకుపైగా ట్రంప్‌ తరఫు అటార్నీలకు చెల్లించాల్సి ఉంటుంది.

ఇదిలాఉంటే, డేనియల్స్‌తో సంబంధం బయటపడకుండా ఉండేందుకు అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్న ట్రంప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని న్యూయార్క్‌ మన్‌హటన్‌లోని కోర్టు ఎదుట హాజరుపరిచారు. మొత్తం 34 అభియోగాలను ఆయనపై మోపారు. వాటన్నింటిలో తాను దోషిని కాదని న్యాయమూర్తికి ట్రంప్‌ విన్నవించారు. విచారణ అనంతరం కోర్టు నుంచి వెళ్లిపోయిన ట్రంప్‌.. కొన్నిశక్తులు తనను అణచివేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు