Titan: ఆశతో వెళ్లాం.. శకలాలే దొరికాయి..! తీవ్ర భావోద్వేగానికి గురైన రెస్క్యూ టీం లీడర్‌

టైటానిక్‌ శిథిలాల సందర్శనకు వెళ్లిన ‘టైటాన్‌’ మినీ జలాంతర్గామి సముద్ర గర్భంలో విచ్ఛిన్నమయిన విషయం తెలిసిందే. దాని శకలాలను గుర్తించిన ‘పెలాజిక్‌ రీసెర్చి సర్వీసెస్‌’ సంస్థ సీఈవో.. రెస్క్యూ మిషన్‌ను వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

Published : 02 Jul 2023 13:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అట్లాంటిక్‌ మహాసముద్రంలో టైటానిక్‌ (Titanic) శిథిలాల సందర్శనకు వెళ్లిన ‘టైటాన్‌ (Titan)’ మినీ జలాంతర్గామి కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. యాత్ర నిర్వహించిన ‘ఓషన్‌గేట్‌’ (OceanGate) సీఈవో సహా ఐదుగురు మృతి చెందారు. టైటానిక్‌ శిథిలాల సమీపంలోనే టైటాన్‌ శకలాలు లభ్యమయ్యాయి. రెస్క్యూలో పాల్గొన్న ‘పెలాజిక్‌ రీసెర్చి సర్వీసెస్‌’ బృందం వాటిని గుర్తించింది. ఈ క్రమంలోనే ‘రెస్క్యూ మిషన్‌’ సాగిన తీరును మీడియాకు వివరిస్తూ.. పెలాజిక్‌ సీఈవో, బృందానికి నాయకత్వం వహించిన ఎడ్‌ కసానో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. టైటాన్‌ విషయంలో తాము మొదలుపెట్టిన రెస్క్యూ ఆపరేషన్‌.. చివరకు శకలాల రికవరీగా ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘సముద్ర గర్భంలోకి ప్రయాణం మొదలైన 1.45 గంటల తర్వాత నీటిపై ఉన్న నౌక ‘పోలార్‌ ప్రిన్స్‌’తో టైటాన్‌ సంబంధాలు కోల్పోయింది. రెస్క్యూ విషయంలో మా సంస్థను సంప్రదించగా.. ఆర్‌వోవీ ‘ఒడిసియస్‌ 6కే’ను రంగంలోకి దించాం. టైటాన్‌ను కనుగొన్న వెంటనే వీలైనంత త్వరగా పైకి తీసుకురావడమే మా ప్రణాళిక. కానీ, 90 నిమిషాలకు టైటానిక్ శిథిలాల ప్రదేశానికి చేరుకునేటప్పటికి.. రెస్క్యూపై ఆశలు కోల్పోయాం. సముద్రపు అడుగుకు చేరుకున్న కొద్దిసేపటికే టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలను కనుగొన్నాం. దీంతో మా రెస్క్యూ.. శకలాల రికవరీగా ముగిసింది’ అని దుఃఖాన్ని దిగమింగుతూ జరిగిందంతా వివరించారు. ఈ ఘటనపై తమ బృంద సభ్యులూ తీవ్రంగా కలత చెందుతున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని