Donald Trump: మరిన్ని చిక్కుల్లో ట్రంప్.. రహస్య పత్రాల కేసులో నేరాభియోగాలు
రహస్య పత్రాల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై నేరాభియోగాలు నమోదయ్యాయి. అమెరికా చరిత్రలో ఇలా ఫెడరల్ అభియోగాలు నమోదైన తొలి మాజీ అధ్యక్షుడు ఈయనే కావడం గమనార్హం.
మియామీ: వచ్చే ఏడాది జరగబోయే అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కేసుల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే ఓ శృంగార తారకు డబ్బుల చెల్లింపు కేసులో ఆయనపై నేరాభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా రహస్య పత్రాల (classified documents) కేసులోనూ ఆయనపై ఫెడరల్ అభియోగాలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. వచ్చే మంగళవారం (జూన్ 13) మియామిలోని ఫెడరల్ కోర్టు హౌస్‌లో హాజరు కావాలని ఆయనకు సమన్లు ఇచ్చినట్లు తెలిపారు.
2021 జనవరిలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్ (Donald Trump).. ప్రభుత్వానికి చెందిన వందలాది కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో ఎస్టేట్‌కు తరలించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, శ్వేతసౌధాన్ని ఖాళీ చేసేందుకు తక్కువ సయమంలో ఇవ్వడంతో ఆ హడావుడిలో పత్రాలు వచ్చి ఉంటాయని అప్పట్లో ట్రంప్ కార్యాలయం ప్రకటించింది. అయితే, ఆ పత్రాలను తిరిగి తీసుకునేందుకు నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నించగా.. వాటిని ట్రంప్ అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే గతేడాది జనవరిలో ఎఫ్‌బీఐ (FBI) అధికారులు ట్రంప్ ఎస్టేట్‌లో సోదాలు చేపట్టగా.. 15 బాక్సుల్లో 184 పత్రాలు లభించాయి. ఇందులో 67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు లభించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ పత్రాలను ట్రంప్ తన ఇంట్లో ఇతర పత్రాలతో కలిపి ఉంచినట్లు తెలిసింది. ఒక్కో బాక్సుల్లో రహస్య పత్రాలతో పాటు వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, ఫొటోలు, వివిధ రకాల ప్రింట్‌అవుట్‌లు, వ్యక్తిగత పత్రాలు కలిపి ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఆగస్టులోనూ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఎఫ్‌బీఐ మరోసారి ఆ ఎస్టేట్‌పై దాడి చేసి 20 పెట్టెల నిండా పత్రాలను తరలించింది.
తొలి అధ్యక్షుడు ఈయనే..
ఈ కేసులోనే తనపై ఫెడరల్ విచారణ (Federal Prosecution)కు అభియోగాలు మోపినట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ విషయాన్ని న్యాయ శాఖ ఇంకా ధ్రువీకరించలేదు. అయితే, ఏడు క్రిమినల్ కౌంట్స్‌తో ట్రంప్‌పై ఈ అభియోగాలు నమోదైనట్లు న్యాయశాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అమెరికా చరిత్రలోనే ఓ సిట్టింగ్ లేదా మాజీ అధ్యక్షుడిపై ఇలా ఫెడరల్ అభియోగాలు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఇందులో ట్రంప్ దోషిగా తేలితే సుదీర్ఘ కాలం జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వ పోటీలో ముందంజలో ఉన్న ట్రంప్.. ఈ కేసు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే, ఇది ఎన్నికలపై ఏమేర ప్రభావం చూపుతుందన్నది ఇంకా తెలియరాలేదు.
నేను అమాయకుడిని..: ట్రంప్
ఈ అభియోగాల గురించి ట్రంప్ స్వయంగా తన ట్రూత్ సోషల్‌మీడియా ఖాతాలో వెల్లడించారు. తాను అమాయకుడినని, కుట్రపూరితంగానే తనపై ఈ అభియోగాలు మోపినట్లు ఆరోపించారు. ఎన్నికల్లో తనను అడ్డుకునేందుకు డెమోక్రాట్లు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.