Independence Day: భారత్‌కు ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షల వెల్లువ

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేళ భారత్‌కు ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు  వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  

Updated : 15 Aug 2022 14:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేళ భారత్‌కు ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు  వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  ఆయన ఆదివారం రాత్రి భారత్‌-అమెరికన్‌ కమ్యూనిటీ.. తమ దేశాన్ని మరింత సృజనాత్మకంగా, సమ్మిళితంగా, బలంగా నిలుపుతోందన్నారు. ‘‘అమెరికాలోని నాలుగు మిలియన్ల ఇండో-అమెరికన్లు సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్నారు. గాంధీజీ మార్గదర్శకత్వంలోని అహింస, నిజాయతీ ఆధారంగా సాగుతున్న వారి ప్రజాస్వామ్య ప్రయాణాన్ని గౌరవించేందుకు అమెరికా కూడా వారితో కలుస్తుంది. ఇరు దేశాల ప్రజల మధ్య బంధంతో మా భాగస్వామ్యం భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుంది. అమెరికా తరఫున భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ  శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ కూడా భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల భాగస్వామ్యం 75 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆయన గుర్తు చేశారు. ‘‘ప్రపంచ భద్రత, క్షేమం కోసం భవిష్యత్తులో మా రెండు ప్రజాస్వామ్య దేశాలు మరింత కృషి చేస్తాయి. ఈ విషయంలో నాకు నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా ప్రధాని అల్బాన్సెస్‌ లౌడ్స్‌ సోమవారం ఉదయం భారత్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించిన స్వతంత్ర భారత్‌ సాధించిన విజయాలు అపూర్వమైనవి. ఇరు దేశాల సంబంధాలను పరస్పర గౌరవం, స్నేహం, సహకారంతో మరింత బలోపేతం చేసుకొంటాం. నా తొలి పర్యటన నిమిత్తం క్వాడ్‌ భేటీ కోసం టోక్యో వెళ్లినప్పుడు ప్రధాని మోదీని కలిశాను. జపాన్‌ ప్రధాని, అమెరికా అధ్యక్షుడితో కలిసి ఇండో-పసిఫిక్‌లో మా ప్రణాళికను బలోపేతం చేసుకొన్నాం. భారత్‌-ఆస్ట్రేలియాలు సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వాములు’’ అని పేర్కొన్నారు.

నేపాల్‌ విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్‌ నారాయణ్‌ ఖడక్‌ భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు నేపాల్‌ విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

* భారత్‌లోని జపాన్‌ రాయబార కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  భారత జాతీయ గీతం పాడటంతోపాటు పలు సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

* భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇజ్రాయెల్‌ అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌ ఓ పోస్టు చేసింది. 

* ‘75 ఏళ్లలో మీరు సాధించిన అద్భుత విజయాలకు అభినందనలు‌. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఫ్రాన్స్‌ మీ పక్షాన ఉంటుంది’ - ఇమ్మానియేలు మాక్రోన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని