Lottery: సరుకులు తేవాలంటూ భార్య మెసేజ్‌.. ఆ వ్యక్తిని వరించిన అదృష్టం

సరుకులు తీసుకురావాలంటూ భార్య నుంచి వచ్చిన ఓ మెసేజ్‌ ఓ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రే అతడిని మిలియనీర్‌ని చేసేసింది. ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం రండి. 

Published : 03 Oct 2022 01:23 IST

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని మిచిగాన్‌ వాసి ప్రెస్టోన్‌ మాకి ఆఫీస్‌ ముగిశాక ఎప్పటిలాగే ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఇంటి సరుకులు తీసుకురావాలని భార్య నుంచి అప్పుడే మెసేజ్‌ వచ్చింది. అప్పటికే పనిఒత్తిడిలో అలిసిపోయిన మాకి అయిష్టంగానే ఓ స్టోర్‌కి వెళ్లాడు. కానీ అక్కడ కొన్న లాటరీతో అతడి దశ తిరిగిపోయింది. తాను కొన్న టికెట్లకే జాక్‌పాట్‌ దక్కడంతో మిలియనీర్‌గా మారిపోయాడు. మిచిగాన్‌ లాటరీలో అతడికి 190,736 డాలర్లు  (దాదాపు రూ.1.5 కోట్లు) దక్కాయి.

ఈ జాక్‌పాట్ తనకు దక్కుతుందని కనీసం ఊహింలేదంటూ ప్రెస్టోన్‌ మాకి ఆనందం వ్యక్తం చేశాడు. భార్య మెసేజ్‌ చేయకుంటే స్టోర్‌కు వెళ్లేవాడినే కాదని, ఈ లాటరీ దక్కేది కాదన్నాడు. ‘ఆఫీస్‌లో పని ముగించుకుంటున్న సమయంలో.. దారిలో ఉన్న స్టోర్‌ నుంచి సరుకులు తీసుకురావాలంటూ నా భార్య నుంచి మెసేజ్‌ వచ్చింది. దీంతో స్టోర్‌కి వెళ్లి సరుకులు కొన్న తర్వాత ఐదు లాటరీ టికెట్లు కూడా కొనుగోలు చేశా’ అని తెలిపాడు. ఆ మరుసటి రోజే తనను జాక్‌పాట్‌ వరించిందని, అసలు నమ్మలేకపోతున్నానంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇందులో కొంత డబ్బును పెట్టుబడుల కోసం, మరికొంత కుటుంబం కోసం వెచ్చించనున్నట్లు ప్రెస్టోన్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని