Viral news: గర్భవతి అని తెలియదు.. విమానం ఎక్కిన మహిళకు వింత అనుభవం

విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు తాను గర్భవతినన్న సంగతి తెలియదు. కానీ, నొప్పులు మొదలై విమానంలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెతోపాటు విమానంలో వాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

Updated : 16 Jan 2023 13:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గర్భవతినన్న(Pregnant) విషయం ఆ మహిళకు తెలియదు. అందరిలాగే విమానం (Aeroplane) ఎక్కింది. తీరా మార్గమధ్యంలో ఆమెకు కడుపునొప్పి (Stomach ache)గా అనిపించి.. టాయ్‌లెట్‌లోకి వెళ్లింది. అంతలోనే నొప్పులు మొదలై ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో విమానంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన ఈక్విడార్ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు వెళ్తున్న కేఎల్‌ఎమ్‌ రాయల్‌ డచ్‌ విమానంలో గత వారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమారా అనే మహిళ ఈక్విడార్‌ నుంచి స్పెయిన్‌కు వెళ్లాలి. మధ్యలో నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లోని స్కిపోల్‌ విమానాశ్రయంలో విమానం మారాల్సి ఉంది. విమానం మరో కొద్ది గంటల్లో ల్యాండ్‌ అవుతుందనగా.. ఆమె కడుపులో కాస్త నొప్పిగా అనిపించి రెస్ట్‌రూమ్‌కి వెళ్లింది. ఈలోగా నొప్పులు ఎక్కువయ్యాయి. విషయం తెలుసుకున్న విమాన సిబ్బంది.. ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులు ఉన్నారేమోనని వాకబు చేశారు. ఆస్ట్రియా నుంచి ఇద్దరు వైద్యులు, ఒక నర్సు ఉన్నారని తెలుసుకొని వాళ్లకి విషయం చెప్పారు. వాళ్లే దగ్గరుండి తమారాకు సహజ ప్రసవం చేయించారు. ముందస్తు సమాచారంతో స్కిపోల్‌ విమానాశ్రయంలో వైద్యసిబ్బంది సిద్ధంగా ఉన్నారు. విమానం ల్యాండ్‌ అవ్వగానే అంబులెన్స్‌లో స్పార్నే గస్తూయిజ్‌ ఆస్పత్రికి తరలించారు.

విమానంలో జరిగిన సంఘటనను వివరిస్తూ.. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు కేఎల్‌ఎమ్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడిచింది. శిశువుకు వాళ్ల తల్లిదండ్రులు మాక్సిమిలియానో అని పేరు పెట్టినట్లు తెలిపింది. క్లిష్ట సమయంలో సాయం అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. తమారా ఆరోగ్య పరిస్థితిపై తాజాగా స్పార్నే గస్తూయిజ్‌ ఆస్పత్రి కూడా బులిటెన్‌ విడుదల చేసింది.  వైద్యుల పర్యవేక్షణలో తల్లీబిడ్డలు ఆరోగ్యంనే ఉన్నారని తెలిపింది. వీలైనంత త్వరగా వాళ్లిద్దరూ స్పెయిన్‌లోని మాడ్రిడ్‌కు పయనమవుతారని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని