Work from home: ఈ దేశంలో.. వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇక ఉద్యోగి హక్కు..!

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Remote Work) విధానాన్ని ఉద్యోగి హక్కుగా మార్చేందుకు నెదర్లాండ్‌ (Netherlands) సిద్ధమైంది.

Updated : 11 Jul 2022 18:16 IST

చట్టబద్ధతకు నెదర్లాండ్‌ పార్లమెంట్‌ ఆమోదం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ (Coronavirus) మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కార్యాలయాల్లో పని విధానమే మారిపోయింది. వైరస్‌ బయటపడి రెండున్నరేళ్లు పూర్తైనా చాలా సంస్థలు ఇంటి నుంచి పనిచేసే (Work From Home) వెసులుబాటును ఉద్యోగులకు కల్పిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు మాత్రం కచ్చితంగా కార్యాలయానికి రావాలని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Remote Work) విధానాన్ని ఉద్యోగి హక్కుగా మార్చేందుకు నెదర్లాండ్‌ (Netherlands) సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అక్కడి దిగువసభ ఇటీవలే ఆమోదం తెలిపింది. ఎగువసభ (Senate) కూడా ఆమోదం తెలిపితే మాత్రం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు చట్టబద్ధత కల్పించిన తొలిదేశంగా నెదర్లాండ్‌ నిలువనుంది.

ప్రస్తుతం నెదర్లాండ్‌లో ఎవరైనా ఉద్యోగి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కావాలని కోరితే ఎటువంటి కారణం చెప్పకుండానే అందుకు నిరాకరించే వెసులుబాటు సంస్థకు ఉంది. కానీ, ఈ కొత్త చట్టం ప్రకారం మాత్రం.. ఉద్యోగుల నుంచి వచ్చే అటువంటి విజ్ఞప్తులను తప్పనిసరిగా పరిగణలోనికి తీసుకోవాలి. ఒకవేళ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌నకు నిరాకరిస్తే అందుకు గల కారణాన్ని చెప్పాల్సి ఉంటుంది. అయితే, ప్రయాణ సమయం తగ్గించడంతోపాటు ఉద్యోగ జీవితాన్ని మరింత మెరుగైన పద్ధతిలో కొనసాగించేందుకు తాజా విధానం దోహదపడుతుందని గ్రొయెన్‌లింక్స్‌ పార్టీకి చెందిన సెన్నా మాటౌ పేర్కొన్నారు. ఈ బిల్లుకు రూపకల్పన చేసిన వారిలో మాటౌ ఒకరు.

ఉద్యోగికి పని వాతావరణాన్ని మరింత సరళతరం చేసేందుకుగానూ 2015లోనే ఫ్లెక్సిబుల్‌ వర్కింగ్‌ యాక్ట్‌ పేరుతో నూతన చట్టాన్ని నెదర్లాండ్‌ తీసుకువచ్చింది. దీని ద్వారా ఉద్యోగి పని వేళలు, ప్రదేశం వంటివి మార్పు చేసుకునేందుకు వీలుంటుంది. ఆ చట్టంలో రిమోట్‌ వర్క్‌కు సంబంధించి పలు మార్పులు చేస్తూ తాజాగా సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఇందుకు ఇప్పటికే దిగువసభ ఆమోదం తెలుపగా.. సెనెట్‌ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది.

ఇదిలాఉంటే, ఇంటినుంచి పనిచేసే విధానాన్ని ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టెస్లా ఉద్యోగులందరూ కార్యాలయానికి రావాల్సిందేనని.. అందుకు నిరాకరించేవారు తమ సంస్థను వీడి వెళ్లిపోవచ్చని బహిరంగంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. మరికొన్ని సంస్థలు మాత్రం శాశ్వతంగా ఇంటినుంచే పనిచేసే వీలును కల్పిస్తున్నాయి. ఇలా రిమోట్‌ వర్కింగ్‌పై ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ స్పందన నెలకొన్న సమయంలో డచ్‌ ఉద్యోగులకు మాత్రం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ హక్కుగా మారనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని