ఈ ఎస్ఐ మేడమ్‌ది ఎంత మంచి మనసో! - meet mumbai police mother teresa rehana sheikh
close
Updated : 12/06/2021 17:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ఎస్ఐ మేడమ్‌ది ఎంత మంచి మనసో!

Image for Representation

రెహానా షేక్‌.. ముంబయిలో ఓ సాధారణ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. ఒకసారి తన కూతురు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మిఠాయిలు పంచడానికి ఓ పాఠశాలకు వెళ్లారు. అక్కడ కాళ్లకు చెప్పుల్లేని ఎందరో పేద విద్యార్థులు ఆమె కంటపడ్డారు. వారి దీనస్థితి చూసి చలించిపోయిన ఆ పోలీసమ్మ వెంటనే తన ముద్దుల తనయ పుట్టినరోజు వేడుకలు, ఈద్‌ షాపింగ్‌ను రద్దు చేసుకున్నారు. ఆ డబ్బునంతా విద్యార్థుల సంక్షేమానికి విరాళంగా అందించారు. అప్పటికప్పుడు 50 మంది పేద విద్యార్థుల బాధ్యతలు తన భుజాలకెత్తుకున్నారు. వారి పదో తరగతి పూర్తయ్యే వరకు విద్య, వసతి.. ఇతర సదుపాయాలన్నీ సమకూర్చేందుకు ముందుకొచ్చారు.
వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేస్తూ..!
సాధారణంగా పోలీస్‌ శాఖలో పనిచేసే మహిళలకు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. వేళాపాళా లేని విధులు, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలంటే వారికి కత్తి మీద సామే. ఈ క్రమంలో ఇటు గృహిణిగా ఇంటి బాధ్యతలు, అటు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ప్రజా రక్షణ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే పలు సహాయక కార్యక్రమాల్లో సైతం భాగమవుతున్నారు 40 ఏళ్ల రెహానా. 2000లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరిన ఆమె మంచి వాలీబాల్‌ ప్లేయర్‌ కూడా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొన్ని పతకాలు కూడా సాధించారు.


వారి దీనస్థితికి చలించి!
రెహానా తండ్రి ముంబయిలోనే ఎస్‌ఐగా పనిచేసి  ఉద్యోగ విరమణ పొందారు. ఆమె భర్త కూడా పోలీస్‌ శాఖలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో గతేడాది రాయ్‌గఢ్‌ జిల్లా వాజే తాలూకాలోని ఓ పాఠశాలను సందర్శించారు రెహానా. తన కూతురు పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేద్దామని అక్కడికి వెళ్లిన ఆమె... కాళ్లకు చెప్పులు కూడా లేని విద్యార్థుల దీనస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే పుట్టినరోజు వేడుకల్ని రద్దు చేసి ఆ ఖర్చునంతా విద్యార్థుల సంక్షేమానికి విరాళంగా అందించారు. అదేవిధంగా ఈద్‌ షాపింగ్‌ కోసం దాచిన సొమ్మును కూడా ప్రిన్సిపాల్‌కి అందజేసి విద్యార్థుల సంక్షేమానికి ఖర్చు చేయమని కోరారు.


50 మంది విద్యార్థుల బాగోగులు!
అదే సమయంలో ఆ పాఠశాలలో చదువుకుంటున్న 50 మంది పేద విద్యార్థుల బాధ్యతలను భుజాలకెత్తుకున్నారామె. పదోతరగతి పూర్తయ్యే దాకా వారికి విద్య, వసతి, భోజన సదుపాయాలన్నీ సమకూర్చేందుకు ముందుకొచ్చారు. ఇక కరోనా సమయంలోనూ తన ఉదారతను చాటుకుంటున్నారు రెహానా. తన సహోద్యోగులు, ఇతరులతో కలిసి ఓ వాట్సప్‌ గ్రూపును ఏర్పాటుచేసి అవసరమైన వారికి పడకలు, మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ప్లాస్మా, రక్తం.. అందజేస్తున్నారు. ఒక్క ముంబయిలోనే కాదు.. పుణే, సతారా, నాసిక్‌, నాగ్‌పూర్‌ నగరాల్లోనూ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోన్న రెహానా... ఇప్పటివరకు 54 మంది కరోనా బాధితులకు ఆపన్నహస్తం అందించారు.
సేవకు సత్కారం!
రెహానా, ఆమె సేవా గుణంపై స్థానిక మీడియాలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఇటీవల ముంబయి పోలీస్‌ కమిషనర్ ఆమెను ఘనంగా సత్కరించారు. తన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రశంసా పత్రం అందించారు. అంతకుముందు డిప్యూటీ కమిషనర్‌ కూడా ఓ ప్రత్యేక సభను ఏర్పాటుచేసి రెహానా సేవలను గుర్తు చేశారు. ఇక ఆమె భర్త, సహోద్యోగులైతే ఆమెను ‘మదర్ థెరిసా’ అని ప్రేమగా పిలుచుకోవడం గమనార్హం.


మరిన్ని

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని