లియొనెల్ మెస్సీ
మారడోనా లాంటి దిగ్గజం వచ్చిన అర్జెంటీనా నుంచి అతడిని మరిపించే మరో ఆటగాడు వస్తాడని ఎవ్వరూ అనుకుని ఉండరు! ఐతే తన మాయాజాలంతో డీగోను మరిపించేశాడు లియొనెల్ మెస్సి. ఈ తరంలోనే కాదు.. మొత్తం ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాళ్లలో మెస్సి ఒకడనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడి ఆటలో సొగసు చూస్తే ఆహా అనాల్సిందే. ఆ వేగం.. బంతిపై ఆ నియంత్రణ.. గోల్స్ కొట్టడంలో నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. యూట్యూబ్‌ల మెస్సి గోల్స్ అని కొడితే చాలు.. అతడి అద్భుత ఆటతీరుకు నిదర్శనంగా నిలిచే ఉదాహరణలు కోకొల్లలు. 2014 ప్రపంచకప్‌లో మెస్సి ఒక్క గోల్ కూడా కొట్టలేదు. అయినా అతడి ఆట అద్భుతమంటూ కొనియాడారు విశ్లేషకులు. మెస్సి నైపుణ్యం అలాంటిది. ఇప్పటికే మూడు ప్రపంచకప్‌లు ఆడాడీ స్ట్రైకర్. గత టోర్నీలో అర్జెంటీనాను ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. రెండేళ్ల కిందట కోపా అమెరికా టోర్నీ ఫైనల్లో చిలీ చేతిలో అర్జెంటీనా ఓడిపోగానే మెస్సి అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ అర్జెంటీనా అంతా గొల్లుమనడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. అతను నిర్ణయాన్ని మార్చుకోకుంటే అర్జెంటీనా ప్రపంచకప్పే ఆడేది కాదేమో. ఘన చరిత్ర ఉన్న ఈ జట్టు క్వాలిఫయర్స్‌లోనే నిష్క్రమించే ప్రమాదంలో పడింది. చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో మూడు గోల్స్ కొట్టి తన జట్టుకు రష్యా బెర్తు సాధించి పెట్టిన ఘనత మెస్సిదే. టోర్నీ ముంగిట లియొనెల్ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. 30 ఏళ్ల మెస్సికి ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చు. మరి ఈసారైనా కప్పు కల నెరవేర్చుకుంటాడేమో చూడాలి.

|
రొనాల్డో
క్రిస్టియానో రొనాల్డో.. ఈ పేరు చెబితే చాలు ఫుట్‌బాల్ ప్రేమికులు వెర్రెత్తిపోతారు. అతడి అద్భుత విన్యాసాలకు మైమరిచిపోతారు. ఏమా వేగం.. ఏమా నియంత్రణ.. ఏమా నైపుణ్యం.. ఫుట్‌బాల్ అంటే ఆసక్తి లేనివాళ్లు సైతం అతనాడుతుంటే.. ఏమిటీ మాయాజాలం అన్నట్లుగా అలా చూస్తుండిపోవాల్సిందే. క్లబ్ ఫుట్‌బాల్‌లో రొనాల్డో సాధించిన ఘనతలు మరెవరికీ సాధ్యం కానివి. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత విలువైన, ఖరీదైన ఆటగాళ్లలో అతనొకడు. అతడి నైపుణ్యం ఎలాంటిదో చెప్పడానికి ఇటీవలే ఛాంపియన్స్ లీగ్‌లో బైసికల్ కిక్‌తో కొట్టిన గోల్ ఒకటి చాలు. 33 ఏళ్ల వయసున్న ఆటగాడు పల్టీ కొడుతూ ఒడుపుగా గోల్ సాధించడమంటే మాటలా? పుష్కర కాలంగా ఇలా మరెన్నో విన్యాసాలతో అభిమానుల్ని అలరిస్తూ వస్తున్నాడు ఈ పోర్చుగల్ స్ట్రైకర్. కాకపోతే అతడి స్థాయికి, పోర్చుగల్ జట్టు ప్రమాణాలకు అంతరం చాలా ఎక్కువ. సహచరులు అతడి వేగాన్ని అందుకోలేరు. అందుకే ప్రపంచకప్‌లో పోర్చుగల్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. గత టోర్నీలో అయితే గ్రూప్ దశ కూడా దాటలేదా జట్టు. ఐతే రెండేళ్లుగా పోర్చుగల్ నిలకడగా ఆడుతోంది. 2016లో రొనాల్డో గొప్ప ప్రదర్శన చేయడంతో యూరో ఛాంపియన్ కాగలిగింది. అతను ఇదే మాయను ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఛాంపియన్స్ లీగ్ సహా గత ఏడాది కాలంలో రొనాల్డో ప్రదర్శన బాగుంది. వయసు ప్రభావంతో కొంచెం వేగం తగ్గినా ఇప్పటికీ ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో అతనొకడు. రొనాల్డో కూడా ప్రపంచకప్‌లో కనిపించడం ఇదే చివరిసారి. వెళ్తూ వెళ్తూ ఈ టోర్నీపై తనదైన ముద్ర వేస్తాడని, ప్రపంచకప్‌లో పేలవంగా ఉన్న తన ప్రదర్శనను కూడా మారుస్తాడని అభిమానుల ఆశ.

|
నెయ్మార్
ఒక పీలే.. ఒక జికో.. ఒక రివాల్డో.. ఒక రొనాల్డో.. ప్రపంచ ఫుట్‌బాల్‌పై తమదైన ముద్ర వేసిన బ్రెజిల్ సూపర్ స్టార్లు. వీళ్ల తర్వాత బ్రెజిల్ నుంచి వచ్చి గొప్ప ప్రతిభావంతుడు నెయ్మార్ జూనియర్. టీనేజీలోనే తన అసాధారణ నైపుణ్యాల్ని చాటుకున్నాడీ కుర్రాడు. మైదానంలో మెరుపులా కదిలే నెయ్మార్.. చుట్టూ ఐదారుగురు ప్రత్యర్థులున్నా ఎవ్వరికీ చిక్కకుండా బంతిని తన నియంత్రణలోనే పెట్టుకుని కళ్లు చెదిరే రీతిలో గోల్స్ కొట్టేస్తాడు. అతనెలా మ్యాచ్‌లను తారుమారు చేస్తాడో.. ఎంత అద్భుతంగా గోల్స్ సాధిస్తాడో చెప్పడానికి ఒక ఉదాహరణ.. 2016లో విల్లా రియల్ క్లబ్‌పై సాధించిన గోల్. ఆ ఏడాది అత్యుత్తమ గోల్‌గా అది అనేక అవార్డులకూ ఎంపికైంది. ఇలాంటి మెరుపు గోల్స్ మరెన్నో సాధించాడతను. 26 ఏళ్ల ఈ స్ట్రైకర్.. 2014లో తమ సొంతగడ్డపైనే జరిగిన టోర్నీలో ప్రపంచకప్ అరంగేట్రం చేశాడు. అప్పటికి బలహీనంగా ఉన్న బ్రెజిల్.. నెయ్మార్ మీద అతిగా ఆధారపడింది. అప్పటికీ నెయ్మార్ తన మెరుపులతో ఆకట్టుకున్నాడు. జట్టును క్వార్టర్స్ చేర్చాడు. కానీ కొలంబియాతో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడి మైదానం వీడాడు. అతను లేక డీలా పడిపోయిన బ్రెజిల్ సెమీస్‌లో జర్మనీ చేతిలో ఏకంగా 1-7తో చిత్తయింది. ఈసారి బ్రెజిల్ జట్టు మెరుగైంది. చాలా మ్యాచ్‌ల్లో నెయ్మార్ లేకుండానే క్వాలిఫయింగ్ టోర్నీలో అదరగొట్టింది. జట్టులో చాలామంది ప్రతిభావంతులుండటంతో నెయ్మార్ స్వేచ్ఛగా ఆడేందుకు వీలు చిక్కనుంది. సహచరుల మద్దతుతో అతను మెరుపులు మెరిపిస్తాడని ఆశిస్తున్నారు అభిమానులు. నెయ్మార్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి, అతడికి సహచరుల నుంచి సహకారం అందితే ఈసారి బ్రెజిల్ కచ్చితంగా కప్పు గెలుస్తుందని భావిస్తున్నారు విశ్లేషకులు.

|
మో సలా
ప్రతి ప్రపంచకప్‌లోనూ ఒక కొత్త హీరో అవతరిస్తుంటాడు. కానీ ఈసారి ఆ టోర్నీ కంటే ముందు ఒక ఆటగాడు సూపర్ స్టార్ అయిపోయాడు. అతనే.. మహ్మద్ సలా. కొన్నేళ్ల కిందటే ప్రతిభ చాటుకున్నప్పటికీ గత ఏడాది కాలంలో ఈ ఈజిప్ట్ స్ట్రైకర్ ఎదిగిన తీరు అసాధారణం. రొనాల్డో, మెస్సిలకు దీటైన ఆటతో ఛాంపియన్స్ లీగ్‌లో సూపర్ హీరోగా నిలిచాడతను. ఏకంగా 32 గోల్స్ కొట్టి ఫుట్‌బాల్ అభిమానుల్ని ఉర్రూతలూగించాడు. ఒకప్పుడు క్లబ్ ఫుట్‌బాల్ ఆడటం కోసం సలా ఎంత కష్టపడ్డాడో! కానీ అవకాశం వచ్చాక మాత్రం అద్భుత ప్రదర్శనతో విలువైన ఆటగాడిగా ఎదిగాడు. లివర్‌పూల్ లాంటి పెద్ద క్లబ్ రికార్డు స్థాయిలో రూ.290 కోట్ల బదిలీ ఫీజుతో అతడిని తమ సొంతం చేసుకోవడం విశేషం. సలా కోసం మరీ అంత రేటా అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ అద్వితీయమైన ఆటతో తనకు కట్టిన రేటు తక్కువే అని రుజువు చేశాడు సలా. ఈజిప్ట్ 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడుతోందంటే సలా పుణ్యమే. క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శనతో తన జట్టుకు రష్యా టికెట్ తెప్పించింది సలానే. చావో రేవో అనదగ్గ చివరి మ్యాచ్‌లో అతడి గోలే ఈజిప్ట్‌ను గెలిపించింది. మైదానంలో సలా విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడి వేగం, బంతిపై నియంత్రణ అసాధారణం. ఐతే సూపర్ ఫామ్‌తో రష్యా మెగా ఈవెంట్‌కు రెడీ అవుతున్న సమయంలో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ సందర్భంగా భుజానికి గాయం కావడం.. సలా ప్రపంచకప్ ఆశల్ని కొంచెం ప్రశ్నార్థకం చేసింది. ఐతే టోర్నీ సమయానికి అతను ఫిట్నెస్ సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

అతను ప్రత్యేకం
ఒంటిచేత్తో ఈజిప్ట్‌కు ప్రపంచకప్ బెర్తు సాధించిన సలా..ఆటతోనే కాక తన వ్యక్తిత్వంతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఈజిప్ట్‌కు ప్రపంచకప్ బెర్తు సాధించి పెట్టినందుకు సలాకు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నజరానాగా ఒక భవంతిని ఇస్తే.. దాన్ని తాను పుట్టి పెరిగిన గ్రామాభివృద్ధికి ఇచ్చేశాడు. అభిమానులకు చాలా విలువ ఇచ్చే సలా, ఒక మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్‌లో ఉన్న ఓ చిన్నారి ‘సలా నీ టీషర్ట్ ఇవ్వవా’ అన్న సందేశంతో ప్లకార్డు పట్టుకుని ఉండటం చూసి.. మ్యాచ్ అయ్యాక తన జెర్సీ విప్పి తనకివ్వడం విశేషం. ఇలాంటి ఘటనలెన్నో సలాను కోట్లాదిమందికి ఇష్టుడిగా మార్చింది.
|
కెవిన్ డిబ్రుయిన్
కెవిన్ డిబ్రుయిన్.. గత రెండు మూడేళ్లలో శరవేగంగా ఎదిగి ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న బెల్జియం ఆటగాడు. ఫుట్‌బాల్ విశ్లేషకులు అతడిని సంపూర్ణ ఆటగాడిగా పేర్కొంటారు. గత ఏడాది ‘గార్డియన్’ ప్రపంచ అత్యుత్తమ ఫుట్బాలర్లంటూ ఇచ్చిన జాబితాలో అతడికి నాలుగో స్థానం దక్కింది. గత ప్రపంచకప్‌లో అతి కష్టం మీద క్వార్టర్స్ చేరి.. అంతకుముందు రెండు పర్యాయాలు టోర్నీ అర్హతే సాధించని బెల్జియం ఈసారి ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోందంటే అందుకు డిబ్రుయిన్ కూడా ఒక కారణం. క్లబ్ ఫుట్‌బాల్‌లో మాంచెస్టర్ సిటీ తరఫున కెవిన్ అదరగొట్టాడు. ఈ మిడ్‌ఫీల్డర్ గోల్స్ కొట్టడం కంటే అందుకు అనుకూల వాతావరణం కల్పించడంలో సిద్ధహస్తుడు. అవసరానికి తగ్గట్లు వింగర్‌గా, స్ట్రైకర్‌గా మారుతాడు. చాలా దూరం నుంచి గోల్స్ కొట్టడంలో అతను నిపుణుడు. మైదానం నలుమూలలా ప్రభావం చూపగల ఆటగాడిగా డిబ్రుయిన్కు ప్రపంచ అత్యుత్తమ కోచ్‌ల్లో ఒకడైన గార్డియాలో కితాబిచ్చాడంటే డిబ్రుయిన్ ప్రతిభేంటో అర్థం చేసుకోవచ్చు. అతను గత ప్రపంచకప్‌లోనూ ఆడాడు. అప్పటికి అంత పేరున్న ఆటగాడేమీ కాదు. ఆ టోర్నీలో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రిక్వార్టర్స్‌లో కీలకమైన గోల్ సాధించాడు. ఐతే గత రెండేళ్లలో అతను ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆధునిక ఫుట్‌బాల్‌కు ప్రతినిధిగా అతడిని అభివర్ణిస్తారు విశ్లేషకులు. ఈసారి మాత్రం మంచి అంచనాలతో ప్రపంచకప్‌కు వస్తున్నాడు. టోర్నీలో బెల్జియం ఎక్కడిదాకా వెళ్తుందనేది నిర్దేశించే ఆటగాళ్లలో కెవిన్ ఒకడని అంచనా వేస్తున్నారు.

|