Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
పదు‘గురు’ మెచ్చిన ఉద్యోగం
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఆదరణ
25 శాతం దంపతులే
వందల మంది గురువులతో ప్రత్యేకంగా నిలుస్తున్న గ్రామాలు
తరతరాలుగా అదే వృత్తిలో ఉన్న కుటుంబాలు
సమీప ప్రాంతాల్లో పనిచేసే అవకాశం, ఒత్తిళ్లు లేకపోవడంతో ఆసక్తి
ఈనాడు - హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు అధిక ఆదరణ ఉంది. పలు గ్రామాలు ఉపాధ్యాయులకు నిలయాలయ్యాయి. ఈ వృత్తితోనే కొన్ని కుటుంబాలు ప్రత్యేక గుర్తింపును పొందుతున్నాయి. మూణ్నాలుగు తరాలుగా ఇదే వృత్తిలో ఉన్న కుటుంబాలూ ఉన్నాయి. దంపతులు ఎక్కువగా ఉన్న ఉద్యోగాలూ ఇవే కావడం విశేషం. రాష్ట్రంలో సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఉండగా వారిలో 25 శాతం మంది వరకు భార్యాభర్తలు ఉన్నారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల 62 వేల మంది ఉపాధ్యాయులు బదిలీలు పొందగా అందులోనూ సుమారు 25 శాతం మంది దంపతుల(స్పౌజ్‌) కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వస్తున్నా ఉపాధ్యాయ ఉద్యోగానికి ఉన్న భద్రత.. ఆకర్షణీయ వేతనాల కారణంగా దీనికి గిరాకీ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఆర్ట్స్‌ గ్రూపుల్లో డిగ్రీ చదివిన వారు ఆ వెంటనే ఉపాధ్యాయ విద్యను పూర్తిచేసేసి డీఎస్సీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులూ పిల్లలను ఆ దిశగా సిద్ధం చేస్తున్నారు.

రాజకీయ ఒత్తిళ్లు లేకుండా సొంత జిల్లాలోనే, అదృష్టం ఉంటే సొంత వూరిలోనో, మండలంలోనో పనిచేసే అవకాశం ఉండడంతో ఈ ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మౌఖిక పరీక్షలు లేకుండా రాత పరీక్ష ద్వారా నియామకాలు జరుగుతుండడం వల్ల కూడా ఈ ఉద్యోగాల పట్ల ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. భార్యాభర్తలు ఉపాధ్యాయులైతే ఇద్దరికీ ఒకేసారి సెలవులు ఉండడం.. పాఠశాల పనివేళల్లో అనుకూలత, అన్ని గ్రామాల్లో బడులు ఉండడంతో బదిలీల్లోనూ వీలైనంత వరకు సమీప ప్రాంతాల్లోనే ఉద్యోగం చేసే అవకాశం ఉండడం వంటి కారణాలు చాలామందిని ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు.. బదిలీలోల దంపతుల కోటాలో 10 పాయింట్లు అదనంగా కేటాయిస్తుండడంతోపాటు ఇద్దరూ ఒకేచోట పనిచేసేందుకూ అవకాశముంటుంది. పిల్లల ఆలనాపాలనా చూసుకోవడానికి, వారి చదువులను పర్యవేక్షించడానికి కూడా ఇది అత్యంత అనుకూలమైన వృత్తన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. 1994 నుంచి దాదాపుగా ఏటా డీఎస్సీలో వేల సంఖ్యలో టీచర్ల నియామకాలు జరిగినందున రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ ఉపాధ్యాయులు కనిపిస్తారు.

ఉత్తరాంధ్రలో కలెక్టర్‌ ఉద్యోగంలా...!
ఉత్తరాంధ్ర జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు అమిత ప్రాధాన్యం ఉంది. ఈ ఉద్యోగాలను కలెక్టర్‌తో సమానంగా భావించే వారూ లేకపోలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని గ్రామాల్లో ఉన్న ఉద్యోగుల్లో ఉపాధ్యాయులే అధికం. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తోలాపి గ్రామ జనాభా సుమారు 5000. ఈ గ్రామం నుంచి సుమారు 350 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అదే జిల్లా ఆమదాలవలస మండలం కనుగులవలసలో 100మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పాతపట్నం మండలం పెద్దసీది జనాభా 800.. ఆ గ్రామంలోని ఉపాధ్యాయుల సంఖ్య 100కి పైనే. సంతకవిటి మండలం సిరిపురం.. పొందూరు మండలం కింతలి, కనిమెట్ట గ్రామాల్లోనూ సుమారు 50 మంది చొప్పున ఉన్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలో 1500 మంది జనాభా గల ముసిడిపల్లిలో 70 మంది.. విజయనగరం జిల్లా గురుగుబెల్లి మండలం రావివలస, చీపురుపల్లి మండలం మెట్టపల్లి, నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి గ్రామాల్లోనూ ఒక్కో వూరిలో 100 మందికిపైనే ఈ వృత్తి చేపట్టినవారు ఉన్నారు. ఇదే జిల్లా నక్కపల్లె ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోడి శ్రీనివాసరావు కుటుంబం నుంచి ఎనిమిది మంది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.


ఒత్తిడి ఉండదనే
ఉత్తరాంధ్రకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ ‘‘నా తండ్రి వెంకునాయుడు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. రాజకీయ, పని ఒత్తిళ్లు తక్కువగా ఉంటాయని చెప్పి ప్రోత్సహించడంతో నేను, మా అన్న సత్యనారాయణపాత్రుడు, అక్క లలితాంబ ఉపాధ్యాయులమయ్యాం’’ అని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక నుంచి 250 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే వారిలో 170 మంది ఉపాధ్యాయులేనని మాజీ ఎమ్మెల్సీ కె.జార్జ్‌విక్టర్‌ పేర్కొన్నారు. మండల కేంద్రమైన అనపర్తిలోనూ ఈ వృత్తిలో ఉన్నవారి సంఖ్య ఎక్కువని తెలిపారు.


వెనుకబడిన ప్రాంతాల నుంచి..
నెల్లూరు జిల్లా కలువాయి మండం కుల్లూరు, వెనుకబడిన ఉదయగిరి ప్రాంతంలోనూ ఉపాధ్యాయ ఉద్యోగాల్ని సాధించిన వారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పాఠశాలలు ఏర్పడ్డ ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులుగా ఎక్కువ మంది వచ్చారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. పశ్చిమగోదావరి, కృష్ణా, ఇతర జిల్లాల్లోనూ ఉపాధ్యాయుల కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.


వేతనాలూ బాగున్నాయి..
పీటీఎఫ్‌ నేత పాండురంగ వరప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఉపాధ్యాయుల వేతనాలు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయి. 32 ఏళ్ల అనుభవం ఉన్న నాకు నెలకు రూ.93 వేల వేతనం వస్తుండగా.. బ్యాంక్‌, ఎల్‌ఐసీ, ఏజీ ఆడిట్‌ కార్యాలయాల్లో నాతోపాటు చేరిన వారికి నాకంటే తక్కువ వేతనాలు వస్తున్నాయి. మా కంటే హోదా ఎక్కువగా ఉన్నా వారికి వేతనం మాత్రం తక్కువ ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

 

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

కొసరుతోనే రూ.కోట్లొచ్చాయి!

తెలుగు చిత్రసీమ ఇదివరకు ఓవర్సీస్‌ వసూళ్లని లెక్కలోకి తీసుకొనేదే కాదు. పంపిన ప్రింట్‌ డబ్బులు తిరిగొస్తే చాలు అనుకొనేవాళ్లు నిర్మాతలు. మరీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net