Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu


నీటి బొట్లు... పుణ్యానికి మెట్లు
నీరు నారాయణ స్వరూపం. దాన్ని ఎంతో జాగ్రత్తగా వాడుతూ పవిత్రంగా భావిస్తూ ఉండాలని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని చెవినపెట్టక పోవటం వల్లే రోజురోజుకూ నీటి కొరత ఏర్పడుతూ, నీటి బొట్టుకోసం యుద్ధాలు సంభవించే దుస్థితి దాపురిస్తోంది. మనదేశంలో ప్రవహించే నదీనదాలు, జలాశయాలు, అనేక తీర్థాలు, సముద్రాలు అన్నీ ఎంతో పుణ్యప్రదమైనవని ఏ పురాణాన్ని పరిశీలించినా ఎక్కడో ఓ చోట ప్రస్తావితమై కనిపిస్తుంది. నీటికి అంతటి విలువ ఉంది మరి. మానవాళి నీటి కరవుకు గురికాకుండా హాయిగా ఉండాలన్న ఓ సామాజిక లక్ష్యం నెరవేరేందుకు మన పూర్వ రుషులు కొన్ని పద్ధతుల్ని సూచించారు. అలాంటి వాటిలో జలాశయ నిర్మాణాలూ ఉన్నాయి. ఇహలోకంలో ఎన్ని పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చేసినా గుక్కెడు నీళ్ళు దానం ఇచ్చినప్పుడే స్వర్గలోకంలో హాయిగా ఉండగలరని చెప్పే పురాణ గాథలు ఎన్నెన్నో. జలాశయ నిర్మాణం వల్ల ఎంతో పుణ్యాన్ని సులభంగా సంపాదించుకోవచ్చు. పూజలు, మంత్రాలు ఇవేవీ తెలియవు, యజ్ఞాలు, యాగాలు చేసేంతటి శక్తి లేదు. గొప్ప గొప్ప పుణ్యం ఎలా వస్తుంది ... అని బాధపడే వారి కోసం విష్ణుధర్మోత్తర మహాపురాణం తృతీయ ఖండం రెండు వందల తొంభై ఆరో అధ్యాయం చక్కటి సూచనల్ని చేస్తోంది. వీటిని పాటించిన వ్యక్తికి పుణ్యంతోపాటు సమాజానికి నీటి కరవన్నదే ఉండదు.

యజ్ఞాలు రెండు రకాలు. అగ్నివేదికను ఏర్పాటు చేసి యజ్ఞాన్ని నిర్వహించటం లాంటి వాటిని ఇష్టములు అని అంటారు. యజ్ఞాల్లో ఇదొక పద్ధతి. అగ్నివేదిక లేకుండా ఆచరించే కార్యాల్ని పూర్తములు అని అంటారు. ఇవి కూడా అగ్నివేదిక ఏర్పాటు చేసి నిర్వహించిన యజ్ఞాలతో సమానమైన పుణ్యఫలాల్నే ఇస్తాయి. ఇటువంటి పూర్తముల వరుసలో జలాశయ నిర్మాణమనేది ప్రముఖ స్థానాన్ని వహిస్తోంది. పుత్రుడు పున్నామ నరకాన్ని పోగొట్టినట్టే సప్త సంతానాల్లో ఒకటైన బావి నిర్మాణమూ సంతానం వల్ల సమకూరే పుణ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. సకల చరాచరజగత్తు అంతా నీటి పరిణామం మీద ఆధారపడి ఉండటమే దీనివెనుక ఉన్న ప్రధాన కారణం. నీరు లేనిదే ప్రాణులకు జీవనం సాగదు. క్రిమికీటకాలకు, పశుపక్ష్యాదులకు జలమే ముఖ్య ఆశ్రయం. ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ సర్వదేవతలూ నివసిస్తుంటారు. అక్కడే మహావ్రతులైన రుషులూ ఉంటారు. ప్రాణులకు ఇహపరలోకాలు రెండింటిలోనూ ఆనందాన్ని చేకూర్చేది నీరు. అందుకే పుణ్యాన్ని సంపాదించుకోవడానికి జలాశయ నిర్మాణం మంచి సాధనంలా కనిపిస్తుంది. బావిని తవ్వించటం వల్ల అగ్నిష్ఠోమయాగం చేసినంతటి పుణ్యం పొందవచ్చు. సరస్సు నిర్మిస్తే అశ్వమేథయాగ ఫలం లభిస్తుంది. ఎంతటి పాపాత్ముడైనా ఒక్క బావిని తవ్వించి, అందులో మంచినీరు ఉండేలా చేయగలిగితే అతడు చేసిన పాపంలో సగం నశిస్తుంది. కూపాల్ని ఒకటికి రెండు నిర్మించిన వారు స్వర్గంలో దేవభోగాల్ని అనుభవిస్తారు. అలాగే ఒక ‘వాపి’ (దిగుడుబావి)ని నిర్మిస్తే పది మామూలు బావులు తవ్విన పుణ్యం లభిస్తుంది. ఇక నల్వ మాత్రపు తటాకాన్ని నిర్మించిన వారు వరుణలోకంలో ఉండే అర్హతను పొందుతారు. నల్వ అంటే పదహారు వందల చదరపు మూలలు. అంటే రెండు వందల చదరపు గజాలకు సమానం. ఇంతటి వైశాల్యంలో ఉన్న చెరువును నిర్మించినవారు పదివేల సంవత్సరాల పాటు వరుణలోకంలో సుఖిస్తారు. ఆవులు ఉండే బీడు వద్ద తటాకాన్ని నిర్మించే వారు గోలోక, ఇంద్రలోక అర్హతను పొందుతారు. ఎడారి ప్రదేశాల్లో తటాకాన్ని నిర్మించి దానిలో పరిశుభ్రంగా నీరు నిలువ ఉండేలా చేసిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఎవరు నిర్మించిన తటాకంలో వర్షాకాలం వరకూ నీరు బాగా నిల్వ ఉంటుందో అటువంటి వారికి అగ్నోష్ఠమయాగ ఫలం లభిస్తుంది. అదే తటాకంలో శరత్కాలం వరకూ నీరు నిలిచి ఉంటే ద్వాదశాహం అనే యజ్ఞఫలం, హేమంత రుతువు వరకూ నీరు ఉంటే గోసన యాగఫలం, శిశిర రుతువు వరకూ ఉంటే పౌండరీక యాగఫలం, వసంత రుతువు వరకూ ఉంటే వాజపేయ యాగఫలం, గ్రీష్మ రుతువు వరకూ నీరు నిలిచి ఉంటే ఆ తటాక నిర్మాతకు అశ్వమేథయాగ ఫలం లభిస్తాయి. పైరు పంటల్ని తడపేందుకు కాలువల్ని నిర్మించిన వారు అన్నదాత, ప్రాణదాతల్లాగే పుణ్యఫలాల్ని పొందుతారు. భగీరథుడు పొందిన పుణ్యలోకాల్ని చేరగలుగుతాడు. చాలా చోట్ల సహజంగా ఏర్పడ్డ తటాకాలు ఉంటాయి. వాటిని దేవనిర్మిత తటాకాలు అని అంటుంటారు. ఇటువంటి వాటిలో పూడికను తీయించటం, నీరు పరిశుభ్రంగా ఉండేలా చూడటం లాంటి పనులు చేస్తే దశ గోదాన ఫలం లభిస్తుంది. పాత జలాశయాల గోడలు విరిగి కిందపడి పాడైపోకుండా కొండరాళ్ళు, చెక్కలాంటి వాటితో తగిన రక్షణ అమరికలు, గట్లను ఏర్పాటు చేసి అందరూ హాయిగా ఆ నీటిని ఉపయోగించుకొనేలా చేసిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. చెరువు నుంచి పంటపొలాలకు అనువుగా ఉండే కాలువలు, రాతి గొట్టాల్ని ఏర్పాటు చేయటం, ఆ చెరువులో నీరు ఎప్పుడూ నిండుగా, పరిశుభ్రంగా ఉండేలా చేస్తే అసమాన పుణ్యఫలం దక్కుతుంది. చెరువు నిర్మాణంలో స్వయంగా శ్రమ చేయటం వల్ల రాజసూయ, అశ్వమేథ యాగాల పుణ్యఫలం దొరుకుతుంది. జలాశయాల్ని నిర్మించే శక్తి లేనివారు ఏర్పాటు చేసే వారికి తమ సహాయ, సహకారాల్ని అందించినా తగినంత పుణ్యఫలాన్ని పొందవచ్చు. చిన్నపాటి జలాశయాన్నైనా స్వయంగా నిర్మిచగలిగిన వాడు వరుణలోకంలో తృప్తిని పొందుతాడు. ప్రాణులకు అనువుగా, బాటసారులకు వీలుగా, మార్గాలకు పక్కన జలాశయాల నిర్మించడం, నీటిని పరిశుభ్రంగా ఉంచటం, పొదుపుగా అందరూ ఆ నీటిని వాడుకొన్ననాడు ఆ నీటిబొట్లే పుణ్యసంపాదనకు సులభమైన మెట్లు అని విష్ణుధర్మోత్తర మహాపురాణం వివరిస్తోంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net