గురువారం, జనవరి 19, 2017

జనరల్

సత్తాచాటిన ఆంధ్రా ఛాలెంజర్స్‌
రెండు విభాగాల్లోనూ శుభారంభమే...
ఉత్కంఠగా సాగిన రాష్ట్ర స్థాయి ఈసీసీ కప్‌ క్రికెట్‌ టోర్నీ
విజయవాడ క్రీడలు: ‘ఈనాడు’ ఛాంపియన్‌ క్రికెట్‌ కప్‌ మూడో దశ రాష్ట్ర స్థాయి పోటీలు బుధవారం కృష్ణా జిల్లా కానూరులోని వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో పగలు, రాత్రి వేళల్లో ఫ్లడ్‌ లైట్ల కాంతుల్లో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం జరిగిన జూనియర్స్‌ విభాగం మ్యాచ్‌లో సెంట్రల్‌ ఆంధ్రా ఛాలెంజర్స్‌ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన మంగళగిరి వీజే జూనియర్‌ కళాశాల జట్టు 125 పరుగుల భారీ స్కోర్‌ ఆధిక్యంతో విజయం సాధించింది. తెలంగాణ టైగర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మహబూబ్‌నగర్‌లోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల జట్టుపై విజయం సాధించి శుభారంభం చేసింది.

జూనియర్స్‌ విభాగం మ్యాచ్‌ను ఆంధ్రా క్రికెట్‌ సంఘం కార్యదర్శి చుక్కపల్లి అరుణ్‌కుమార్‌ ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్‌ వేసి ప్రారంభించగా.. సీనియర్స్‌ విభాగం మ్యాచ్‌ను అవినీతి నిరోధకశాఖ ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌ పీఠాకూర్‌ ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్‌ వేసి ప్రారంభించారు.

సీనియర్స్‌లోనూ అదే హవా.. ఈసీసీ కప్‌ సీనియర్స్‌ విభాగంలో జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్‌ ఆంధ్రా ఛాలెంజర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సత్తెనపల్లిలోని ఎస్వీఆర్‌ డిగ్రీ కళాశాల జట్టు 9 వికెట్ల తేడాతో... తెలంగాణ టైగర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్‌లోని కేర్‌ డిగ్రీ కళాశాల జట్టుపై విజయం సాధించి శుభారంభం చేసింది. ఎస్వీఆర్‌ డిగ్రీ కళాశాల బౌలర్ల ధాటికి కేర్‌ బ్యాట్స్‌మెన్లు క్రీజ్‌లో నిలవలేకపోయారు. టాస్‌ గెలిచిన కేర్‌ డిగ్రీ కళాశాల (నిజామాబాద్‌) జట్టు బ్యాటింగ్‌ ఎంచుకొని 16.4 ఓవర్లలో 56 పరుగులకే పెవిలియన్‌కు క్యూ కట్టింది. జట్టులో డి.అఖిల్‌ 15 పరుగులు చేయగా.. ప్రత్యర్థి బౌలర్లు జి.శ్రీను 3 పరుగులు ఇచ్చి నాలుగు, ఎస్‌.అఖిల్‌ నాలుగు పరుగులు ఇచ్చి మూడు, సాయివర్థన్‌ తొమ్మిది పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చారు. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన ఎస్వీఆర్‌ డిగ్రీ కళాశాల (సత్తెనపల్లి) జట్టు 5.6 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసి విజయకేతనం ఎగురవేసింది. జట్టులో ఓపెనర్‌ ఎం.సురేంద్రబాబు 21 బంతుల్లో 6 బౌండరీలు, 2 సిక్సర్లతో 43 పరుగులతో క్రీజ్‌లో నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్‌ సద్ధాం 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ కూల్చాడు. ఈ మ్యాచ్‌లో ఎస్వీఆర్‌ డిగ్రీ కళాశాలకు చెందిన జి.శ్రీను మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు.

పరుగుల జోరు.. టాస్‌ గెలిచిన వీజే జూనియర్‌ కళాశాల (మంగళగిరి) జట్టు బ్యాటింగ్‌ ఎంచుకొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. జట్టులో బి.సాత్విక్‌ 15 బంతుల్లో 2 బౌండరీలు, 1 సిక్సర్‌తో 26 పరుగులు, ఎం.డూండీ రామ్‌ప్రసాద్‌ 14 బంతుల్లో 19 పరుగులతో క్రీజ్‌లో నిలవగా.. ప్రియం ఆశిష్‌ 34 బంతుల్లో 38 పరుగులు, జహీర్‌ అబ్బాస్‌ 13 బంతుల్లో 22 పరుగులు, జట్టు సారధి టి.వంశీకృష్ణ 17 బంతుల్లో 25 పరుగులతో స్కోర్‌ బోర్డును పరుగులు తీయించారు. ప్రత్యర్థి బౌలర్లు ధ్యాన్‌చంద్‌ రెండు వికెట్లు కూల్చగా.. గణేష్‌, రాజు, షోయబ్‌లు ఒక్కో వికెట్‌ చొప్పున పడగొట్టారు. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల (మహబూబ్‌నగర్‌) జట్టు 12.1 ఓవర్లలో 51 పరుగులకే కుప్పకూలింది. జట్టులో గణేష్‌ మాత్రమే 17 పరుగులు స్కోర్‌ చేయగా..ప్రత్యర్థి బౌలర్లు బి.సాత్విక్‌ 5 పరుగులు ఇచ్చి 7, సాంబ 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు కూల్చారు. ఈ మ్యాచ్‌లో వీజే జూనియర్‌ కళాశాలకు చెందిన బి.సాత్విక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు.

అలరించిన ‘మీ ఆట- మీ పాట’.. ఈసీసీ కప్‌లో భాగంగా మైదానంలో ఏర్పాటు చేసిన ‘మీ ఆట- మీ పాట’ కార్యక్రమంలో మొగల్రాజపురంలోని వీపీ సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థిని జి.ఖ్యాతి చందన ‘శ్రీ గణనాయకా..’ అంటూ కాలి అందెలతో కూచిపూడి నృత్యంతో అలరించగా.. వన్‌టౌన్‌లోని అట్కిన్‌సన్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థిని ఎం.నేహాచౌదరి, జి.ఖ్యాతి చందనలు చేసిన స్వాగత నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వీటితో పాటు కోయిల గానంతో శుభశ్రీ, సుష్మితల గాత్రంతో ఆలపించిన పాట కచేరి ప్రేక్షకులకు శ్రవణానందాన్ని కలుగుజేశాయి. మేమేమీ తక్కువ కాదంటూ టోర్నీలో తలపడేందుకు హాజరైన క్రీడాకారులు వేదికపై సినీ గీతాలకు అదిరే స్టెప్పులతో కుర్రకారును ఉత్సాహపరిచారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.