close
బలముంది.. గళమెత్తండి

  లోక్‌సభలో నాలుగో అతి పెద్ద పార్టీ మనది
  ప్రత్యేక హోదాయే లక్ష్యంగా పోరాడండి
  బృందాలుగా ఏర్పడి విభాగాల వారీగా నిధులు రాబట్టాలి
  నెలకోసారి సమావేశమై చర్చిద్దాం
  వైకాపా ఎంపీలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం
ఈనాడు - దిల్లీ

రాష్ట్ర సమస్యలపై మన గళం బలంగా వినిపించాలని వైకాపా ఎంపీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. లోక్‌సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా వైకాపా ఉన్నందున ప్రత్యేక హోదాయే లక్ష్యంగా ఉభయసభల్లోనూ ఎప్పటికప్పుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వైకాపా ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఏపీభవన్‌లోని సీఎం అతిథిగృహంలో శనివారం ఉదయం వైకాపా ఎంపీలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. తొలుత జగన్‌ను నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు శాలువాతో సత్కరించగా.. మహిళా ఎంపీలు చింతా అనూరాధ, వంగా గీత, డాక్టర్‌ సత్యవతి, మాధవి ఆయనకు జ్ఞాపిక బహూకరించారు. మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, బాలశౌరి, మాగుంట శ్రీనివాసులరెడ్డి మినహా మిగతా వారంతా తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైన నేపథ్యంలో ఎంపీలంతా పరస్పర పరిచయం చేసుకున్నారు. అనంతరం ఎంపీలను ఉద్దేశించి జగన్‌ మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు కాబట్టి వారి ఆకాంక్షలు నెరవేర్చేలా పార్లమెంటులో వ్యవహరించాలని తెలిపారు. తొలి వారమంతా సభ్యుల ప్రమాణస్వీకారం, సభాపతి ఎన్నిక ఉన్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి అన్ని విషయాలపై అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. పార్టీ లక్ష్యం ప్రత్యేక హోదాయే అని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై పోరాటానికి ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలన్నారు. కేంద్రంతో మిత్రత్వం, శతృత్వం అనేది పక్కన పెట్టి రాష్ట్ర సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తులు చేస్తుండాలని తెలిపారు. విభజన అనంతరం రాష్ట్రం లోటు బడ్జెట్తో ఉన్న కారణంగా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి 24 మంది ఎంపీలు ఐక్యంగా సమస్యలపై పోరాడాలని తెలిపారు. పార్లమెంటు స్థాయీ సంఘాల్లో కొంతమంది సభ్యులకు అవకాశం వస్తుందని, వారికి తోడుగా మరో ఇద్దరు ముగ్గురు ఎంపీలు బృందంగా ఏర్పడి శాఖల వారీగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలనూ విస్మరించొద్దని, నిత్యం వాటిని ఉభయసభల్లో ప్రస్తావించాలని స్పష్టం చేశారు. పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి సూచనలు, సలహాల మేరకు ముందుకెళ్లాలని సూచించారు. ప్రతి నెలా పార్లమెంటరీ పార్టీ సమావేశమై ఆయా అంశాలపై చర్చిద్దామని ఎంపీలకు జగన్‌ తెలిపారు. అంతకుముందు అతిథిగృహం వద్ద పలువురు నేతలు, స్థానికులు జగన్‌కు అభినందనలు తెలిపారు. బీసీ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు, తెలంగాణ వైకాపా నేత రెహమాన్‌ తదితరులతో ఆయా ప్రాంతాల ప్రజాభిప్రాయాలు జగన్‌ ఆరా తీశారు. అనంతరం నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఎంపీల సమావేశానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, లోక్‌సభ సభ్యులు మాధవి (అరకు), బెల్లాన చంద్రశేఖర్‌ (విజయనగరం), ఎంవీవీ సత్యనారాయణ (విశాఖపట్నం), వెంకట సత్యవతి (అనకాపల్లి), వంగా గీత (కాకినాడ), చింతా అనూరాధ (అమలాపురం), మార్గాని భరత్‌రామ్‌ (రాజమండ్రి), రఘురామకృష్ణంరాజు (నరసాపురం), కోటగిరి శ్రీధర్‌ (ఏలూరు), వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట), నందిగం సురేశ్‌ (బాపట్ల), మాగుంట శ్రీనివాసులరెడ్డి (ఒంగోలు), బ్రహ్మానందరెడ్డి (నంద్యాల), సింగిరి సంజీవకుమార్‌ (కర్నూలు), తలారి రంగయ్య (అనంతపురం), గోరంట్ల మాధవ్‌ (హిందూపురం), వైఎస్‌ అవినాశ్‌రెడ్డి (కడప), ఆదాల ప్రభాకర్‌రెడ్డి (నెల్లూరు), బల్లి దుర్గాప్రసాదరావు (తిరుపతి), పీవీ మిథున్‌రెడ్డి (రాజంపేట), ఎన్‌.రెడ్డప్ప (చిత్తూరు)లు హాజరయ్యారు. శనివారం రాత్రి అధికారిక నివాసంలోనే బస చేసిన ముఖ్యమంత్రి జగన్‌ ఆదివారం ఉదయం బయల్దేరి విజయవాడ చేరుకోనున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.