close

ప్రధానాంశాలు

శాసనమండలి రద్దుకు సహకరించండి

న్యాయశాఖకు ఆదేశాలివ్వండి
పోలవరం, రాజధాని నిధులు విడుదల చేయండి
దిశ చట్టాన్ని ఆమోదించండి
ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించండి
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సీఎం జగన్‌ వినతి
ఈనాడు - దిల్లీ

శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి పక్షపాతంతో వ్యవహరిస్తోంది. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకొనేందుకు  ప్రయత్నించి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఈ నేపథ్యంలోనే మండలిని రద్దు చేయాలని అసెంబ్లీ మూడింట రెండొంతుల మెజారిటీతో సిఫార్సు చేసింది. - అమిత్‌షాతో జగన్‌

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై 15వ ఆర్థిక సంఘం స్పందిస్తూ ‘‘కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకహోదాను కోరుతున్నాయి. హోదా ఇవ్వడానికి ఆర్థిక సంఘం సిఫార్సులు అవసరం లేదు. కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవచ్చు’’ అని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలి. - ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి రద్దు చేస్తూ శాసనసభ పంపిన తీర్మానంపై తదనంతర చర్యలకు న్యాయశాఖకు ఆదేశాలివ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకొనేందుకు మండలి ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే శాసనమండలిని రద్దు చేయాలని శాసనసభ సిఫార్సు చేసిందన్నారు. శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటలకు దిల్లీ చేరుకున్న సీఎం జగన్‌ రాత్రి 9.45 గంటలకు అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సమారు 40 నిమిషాలపాటు ఆయనతో చర్చించారు. పోలవరం, రాజధాని నిధులు, మూడు రాజధానులు, కర్నూలుకు హైకోర్టు ప్రధాన బెంచ్‌ తరలింపు, దిశ చట్టం ఆమోదం, పోలీసు వ్యవస్థ మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి పలు అంశాలపై కేంద్ర సాయాన్ని కోరారు. పలు అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. హోం మంత్రికి తిరుమల ప్రసాదం, శ్రీవారి ప్రతిమ అందజేశారు. పర్యటనలో సీఎంతోపాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, బాలశౌరి, నందిగం సురేశ్‌లు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.838 కోట్లు ఆదా చేశామని అమిత్‌షాకు జగన్‌ తెలిపారు. ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంతో సాగుతోంది. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకెళుతున్నాం. ముంపు ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రాజెక్టు సవరించిన అంచనా రూ.55,549 కోట్లను కేంద్ర జలశక్తి శాఖ సాంకేతిక కమిటీ గత ఫిబ్రవరిలోనే ఆమోదించింది. పాలనాపరమైన అనుమతులు వచ్చేలా జోక్యం చేసుకోవాలి. పోలవరానికి సంబంధించిన అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.3,320 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. వెంటనే విడుదల చేసేలా చూడాలి.

కేంద్ర సాయం పెంచాలి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, గ్రాంట్ల రూపేణా రాష్ట్రానికి కేవలం రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఒక ఏడాది విడుదల చేసిన రూ.22 వేల కోట్లలో ఇది సగం మాత్రమే. పెండింగ్‌లో ఉన్న గ్రాంట్లు వెంటనే విడుదల చేసేలా సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలివ్వండి. వెనకబడిన జిల్లాలకు సంబంధించి రాష్ట్రానికి రూ.1,050 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మూడేళ్లుగా దీనికి ఎలాంటి నిధులు విడుదల చేయడం లేదు. ప్రత్యేక ఆర్థిక సహాయం పొందుతున్న కలహండి, బుందేల్‌ఖండ్‌ ప్రాంతాల్లో తలసరి సగటున రూ.4వేలు ఇస్తుంటే ఏపీలో వెనకబడిన జిల్లాలకు మాత్రం రూ.400 చొప్పున ఇస్తున్నారు. ఏపీలో వెనకబడిన జిల్లాలకు కూడా బుందేల్‌ఖండ్‌, కలహండి తరహాలో ఇవ్వాలి.

రెవెన్యూ లోటు భర్తీ చేయండి
ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. 2014-15 నాటికి రెవెన్యూలోటు రూ.22,949 కోట్లుగా కాగ్‌ నిర్ధారించింది. దీనిలో ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉంది. ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయించండి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించండి’ అని జగన్‌ విజ్ఞప్తి చేశారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే
రాజధాని కార్యకలాపాలు, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్‌ చెప్పారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతిగా ప్రణాళిక వేసుకున్నామన్నారు. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఏపీ వికేంద్రీకరణ, అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం-2020కు అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని వివరించారు.హైకోర్టును కర్నూలుకు తరలించడానికి కేంద్ర న్యాయశాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టు ను ఏర్పాటు చేస్తామంటూ భాజపా 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని గుర్తు చేశారు.

‘దిశ’తో మహిళలకు రక్షణ
మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించడానికి చరిత్రాత్మక చర్యలను తీసుకున్నామని జగన్‌ తెలిపారు. నిర్దేశిత సమయంలో విచారణ పూర్తి చేసి శిక్షలు విధించడానికి తగిన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రత్యేక పోలీస్‌స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు నియామకం, వన్‌ స్టాప్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. దిశ చట్టానికి ఆమోదం తెలపాలని అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు.

పోలీసు వ్యవస్థకు మౌలిక వసతుల్లేవు
పోలీసు వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాలన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయని, దీని వల్ల ఏపీ పోలీసు విభాగం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోందని సీఎం.. అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. నిధుల లేమి, సిబ్బంది కొరత వల్ల ఆశించిన లక్ష్యాలు చేరుకోలేకపోతున్నామని, పోలీసు విభాగం సమర్థతను పెంచేలా సాయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రాజెక్టును హోం శాఖ 2017లో ఆమోదించిందని, రూ.152 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉందన్నారు. స్టేట్‌ ఆపరేషనల్‌ కమాండ్‌, కంట్రోల్‌ సెంటర్‌, సెంట్రలైజ్డ్‌ డాటా సెంటర్‌, ఏపీ పోలీసు అకాడమీల ఏర్పాటుకు తగిన సాయం చేయాలని కోరారు. శాంతిభద్రతలు కాపాడడానికి వీలుగా ప్రస్తుత క్యాడర్‌ 79 సీనియర్‌ డ్యూటీ పోస్టులను 96కు పెంచాలని అమిత్‌షాకు ఏపీ సీఎం విజ్ఞప్తి చేశారు.


అవసరమైతే ఎన్డీయేలో చేరతాం: బొత్స

ఈనాడు, విశాఖపట్నం: రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్డీయేలో కూడా చేరతామని.. ఎవరినైనా గడ్డం పట్టుకుని బతిమిలాడే స్థాయికైనా దిగుతామని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. భాజపాతో తాము అంటిపెట్టుకుని ఉండటం లేదని.. అలాగని వారికి దూరంగా కూడా లేమని అన్నారు. విశాఖలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడిన ఆయన.. ఈ విషయమై మీడియా ప్రశ్నలకు స్పందించారు. కేంద్ర ప్రభుత్వంతో అనవసరంగా ఎందుకు ఘర్షణ పడాలని అడిగారు. రాష్ట్ర పురపాలకశాఖ కార్యాలయాన్ని విశాఖపట్నం బీచ్‌ రోడ్డులోని పురపాలకశాఖ అతిథిగృహం ప్రాంగణంలో నిర్మిస్తామని వెల్లడించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.