close

ప్రధానాంశాలు

తక్షణ సాయం రూ.1,500 కోట్లు

పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలకు ప్రధాని మోదీ చేయూత
అంపన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

కోల్‌కతా, భువనేశ్వర్‌: అంపన్‌ తుపాను కారణంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలకు అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. శుక్రవారం ఆయన ఆ రెండు రాష్ట్రాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్‌ ద్వారా పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. తక్షణ సాయం కింద పశ్చిమ బెంగాల్‌కు రూ.1000 కోట్లు, ఒడిశాకు రూ.500 కోట్లు చొప్పున మొత్తం రూ.1,500 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తొలుత ఆయన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌తో కలిసి విహంగ వీక్షణం జరిపారు. అనంతరం ఉత్తర 24 పరగణాల జిల్లా బసీర్‌హట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నష్టం తీవ్రతను, జరుగుతున్న సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగం చేస్తున్న సేవలను ప్రశంసించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల వంతున, గాయపడ్డవారికి రూ.50 వేల వంతున సహాయం అందించనున్నట్టు ప్రకటించారు. పునర్నిర్మాణ పనులు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని అన్నారు.

రూ.లక్ష కోట్ల నష్టం:మమత
తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్‌కు రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానికి వివరించారు. వివిధ పథకాల కింద రాష్ట్రానికి కేంద్రం రూ.53వేల కోట్లు ఇవ్వవలసి ఉందని ఆమె ప్రధానికి గుర్తు చేశానని చెప్పారు.

విద్యుత్తు సరఫరా పాక్షికంగా పునరుద్ధరణ
తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో 80 మంది మరణించారు. కోల్‌కతా నగరంతో పాటు, ఇతర పట్టణాల్లో విద్యుత్తు సరఫరా, సెల్‌ఫోన్‌ సేవలను పాక్షికంగా పునరుద్ధరించారు. పెద్ద సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు పడిపోవడం, చెట్లు కూలిపోవడంతో సాధారణ పరిస్థితులు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. నగరంలోని అలీపూర్‌ జంతు ప్రదర్శన శాలలో వృక్షాలు కూలిపోయినా జంతువులకు ఎలాంటి హాని జరగలేదు.

ఒడిశాలో...
పశ్చిమ బెంగాల్‌లో పర్యటన ముగించుకున్న తరువాత ప్రధాని ఒడిశా వెళ్లారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, గవర్నర్‌ గణేశీ లాల్‌తో కలిసి తుపానుకు గురయిన జగత్సింగ్‌పుర్‌, కేంద్రపార, భద్రక్‌, బాలాసోర్‌, జాజ్‌పూర్‌, మయూర్‌భంజ్‌ జిల్లాల్లో దాదాపు 90 నిమిషాలపాటు పర్యటించారు. భువనేశ్వర్‌లోని విమానాశ్రయంలో అధికారులతో సమీక్ష జరిపారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణ నష్టం లేకుండా చూడగలిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

బంగ్లాదేశ్‌లో 22కు చేరిన మృతుల సంఖ్య
ఢాకా: అంపన్‌ కారణంగా బంగ్లాదేశ్‌లో 22 మంది మరణించారు. మొత్తం 26 జిల్లాలు ప్రభావితమయ్యాయి. ఇది 2009లో వచ్చిన ‘అలియా’ తుపానుకన్నా తీవ్రమైనదని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

సీఎంలకు రాష్ట్రపతి ఫోన్‌
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం పశ్చిమ బెంగాల్‌, ఒడిశా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌లకు ఫోన్‌ చేశారు. తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని, చేపడుతున్న సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.