close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు కాలపరిమితివిధించండి

సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన కేంద్రం
జిల్లాకో ప్రత్యేక కోర్టు ఉండాలన్న అమికస్‌ క్యూరీ
సత్వర విచారణపై హైకోర్టుల కార్యాచరణను కోరతామన్న ధర్మాసనం
సీబీఐ, ఈడీల దర్యాప్తు వేగంగా పూర్తయ్యేలా చూడాలని కేంద్రానికి సూచన

ఈనాడు, దిల్లీ: ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన విచారించేందుకు కాలపరిమితి విధించాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. చట్టసభ సభ్యులపై నమోదైన కేసుల్లో హైకోర్టులు స్టే ఉత్తర్వులిచ్చి ఉంటే నిర్ణీత సమయంలోగా వాటిని పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించవచ్చని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. నేతలపై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణను వేగŸంగా పూర్తిచేసి, శిక్షపడిన వారిని జీవితాంతం ఎన్నికల నుంచి బహిష్కరించేలా ఉత్తర్వులివ్వాలంటూ న్యాయవాది అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

రాష్ట్రాల్లో తాజా, మాజీ ప్రజాప్రతినిధులపై వివిధ ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసుల వివరాలను అమికస్‌ క్యూరీ (కోర్టు సహాయకుడు) విజయ్‌ హన్సారియా ధర్మాసనానికి వివరించారు. ఈ కేసులపై విచారణ ఏడాదిలోగా పూర్తయ్యేలా చూడాలని కోర్టును కోరారు. సత్వర పరిష్కారానికి జిల్లాకో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని అమికస్‌ క్యూరీ సూచించగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్కువ కేసులు లేవు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ త్వరగా ముగిసేలా ఎలా ముందుకు వెళ్లాలో హైకోర్టుల నుంచి కార్యాచరణ ప్రణాళిక కోరతామని ధర్మాసనం తెలిపింది. అధిక కేసులున్న రాష్ట్రాల్లో ఏం చేయాలో హైకోర్టులు నిర్ణయించేలా చూస్తామని పేర్కొంది. ఆదేశాలు వెబ్‌సైట్‌లో పెడతామని పేర్కొంది. ప్రజాప్రతినిధులపై సీబీఐ, ఈడీలు నమోదు చేసిన కేసుల తాజా పరిస్థితి గురించి ఆరా తీసింది. దర్యాప్తు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ... శీఘ్రగతిన తీర్పులు వెలువరించేందుకు అమికస్‌ క్యూరీ చేసిన సూచనల అమలుకు అభ్యంతరం లేదన్నారు. ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను న్యాయస్థానాలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజాప్రతినిధులపై కేసులకు నిర్ణీత సమయంలో సహేతుకమైన ముగింపును ఇవ్వాల్సి ఉందన్నారు. శిక్ష పడిన రాజకీయ నాయకులు జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలన్న అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ విజ్ఞప్తిపై సోమవారం విచారణ చేపడతామని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు.

అమికస్‌ క్యూరీ ఏమి చెప్పారంటే...
* దర్యాప్తుపై స్టే విధిస్తే సదరు కేసు రెండు వారాల్లో మళ్లీ విచారణకు వచ్చేలా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సిఫార్సు చేయాలని అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా కోరారు. విచారణ వేగంగా పూర్తి కావడానికి కర్ణాటక హైకోర్టు రూపొందించిన వీడియో కాన్ఫరెన్స్‌ బ్లూ ప్రింట్‌ను ధర్మాసనానికి అందజేశారు.
* దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులపై  4442 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అమికస్‌ క్యూరీ ఇది వరకే సుప్రీంకోర్టుకు తెలిపారు. బుధవారం నాటి అనుబంధ నివేదికలో మరో 200 కేసులు కూడా ప్రజాప్రతినిధులపై ఉన్నాయని, వీటిలో అత్యధికం అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్‌, పోక్సో చట్టాల కింద నమోదైనవని చెప్పారు. ఏపీ హైకోర్టుతో పాటు ఆ రాష్ట్రంలోని జిల్లాల వారీ కేసుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
* తెలంగాణలో సీబీఐ కోర్టు ముందు 13 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో ఎక్కువ భాగం ఎమ్మెల్యేలపై నమోదైనవేనని చెప్పారు. కొన్ని కేసుల్లో విచారణ ప్రారంభం కాలేదని, విచారణ వేగవంతం చేసేలా ట్రయల్‌ కోర్టులను ఆదేశించాలని కోరారు.
* కేసుల తీవ్రతను బట్టి ప్రాధాన్య క్రమంలో వాటి విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలని ఈ మేరకు ఐదు ప్రాధాన్య అంశాలను అమికస్‌ క్యూరీ కోర్టుకు తెలిపారు. ఉరి, యావజ్జీవ శిక్షలు పడే కేసులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మనీలాండరింగ్‌ కేసులకు ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎస్సీ/ఎస్టీలపై  వేధింపులు, బాలలపై లైంగిక నేరారోపణ కేసులను ప్రత్యేక కోర్టులు చేపట్టాలని సూచించారు. ఏడేళ్లు, అంతకుపైగా శిక్ష పడే కేసులనూ ప్రత్యేక కోర్టుల్లో విచారించాలని కోరారు.
* కొన్ని కేసుల్లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించకపోవటం, దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసినా అభియోగపత్రాలు దాఖలు చేయకపోవటం, సాక్షులను పిలిపించకపోవటం వంటి కారణాలతో కోర్టుల్లో విచారణలు నిలిచిపోయిన ఉదంతాలున్నాయని ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ గుర్తుచేశారు. అదనపు అఫిడవిట్‌ చూస్తుంటే గతం కంటే కేసులు పెరిగినట్లు ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.