విద్యా సంస్థల విషయంలో మీ జోక్యం ఎందుకు?

ప్రధానాంశాలు

విద్యా సంస్థల విషయంలో మీ జోక్యం ఎందుకు?

మాన్సాస్‌ ట్రస్టు ఈవో తీరుపై హైకోర్టు ఆగ్రహం
జీతాల చెల్లింపునకు అనుమతి

ఈనాడు, అమరావతి: మాన్సాస్‌ ట్రస్టుకు చెందిన విద్యాసంస్థల విషయంలో కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. మీకున్న పాత్ర ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రస్టు ప్రయోజనాలను కాపాడటం కోసం ఉన్నారా? లేక వ్యతిరేకించడం కోసమా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ట్రస్టుకు చెందిన విద్యాసంస్థలు బ్యాంకుల నుంచి సొమ్ము ఉపసంహరించుకునే విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ఖాతాలను స్తంభింపచేయాలని ఈవో బ్యాంకులకు రాసిన ఉత్తర్వులను సస్పెండు చేసింది. ఖాతాల నిర్వహణకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.

సిబ్బందికి జీతభత్యాల చెల్లింపు, రోజువారీ కార్యకలాపాల నిమిత్తం సొమ్ము ఉపసంహరించుకునేందుకు ప్రిన్సిపల్స్‌, కరస్పాండెంట్లను అనుమతించింది. చట్ట నిబంధనల మేరకే ఈవో వ్యవహరిస్తారని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పిన విషయాన్ని నమోదు చేసింది.

ప్రొసీడింగ్స్‌ అమలు నిలుపుదల
పాలకమండలి సమావేశం కోసం మాన్సాస్‌ ట్రస్టు ఈవో ఈ ఏడాది జూన్‌ 9న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ అమలును నిలిపేసింది. ట్రస్టు విషయంలో విజయనగరం జిల్లా ఆడిట్‌ అధికారులు నిర్వహిస్తున్న ఆడిట్‌ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. పారదర్శకత కోసం ఆడిట్‌ నిర్వహణ మంచిదేనని వ్యాఖ్యానించింది. జీవో 75 రద్దు విషయంలో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనరు, ట్రస్టు ఈవో డి.వెంకటేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 23కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.వెంకటరమణ మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ట్రస్టు పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చి 3న జారీ చేసిన జీవో 75ను రద్దు చేయాలని కోరుతూ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. పిటిషనరు తరఫున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి, న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలను వినిపించారు. ‘హైకోర్టు తీర్పుతో ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు బాధ్యతలను స్వీకరించినా విధులు నిర్వహించనీయకుండా ఈవో అడ్డుకుంటున్నారు. 2020 మార్చి నుంచి విద్యాసంస్థల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. ఛైర్మన్‌ సూచనలకు కట్టుబడి ఉండేలా ఈవోను ఆదేశించండి’ అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఈవో తరఫున న్యాయవాది మాధవరెడ్డి వాదనలను వినిపిస్తూ...‘ఛైర్మన్‌ లేఖల ద్వారా కోరిన సమాచారం ఇవ్వడానికి కొంత సమయం కావాలని మాత్రమే ఈవో కోరారు. 2004 నుంచి ఆడిట్‌ జరగలేదు. జీవో 75పై కౌంటరు వేసేందుకు కొంత సమయం కావాలని’ కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని