మా వల్ల కాదు మహాప్రభో!

ప్రధానాంశాలు

మా వల్ల కాదు మహాప్రభో!

రాష్ట్ర, జిల్లా రోడ్ల పనులపై గుత్తేదారుల నిరాసక్తత
మూడుసార్లు టెండర్లు పిలిస్తే మూడో వంతుకే బిడ్లు
పాత బిల్లులన్నీ ఇస్తేనే చేస్తామని స్పష్టీకరణ
ఈనాడు - అమరావతి

జాతీయ రహదారుల పనులకు పోటీపడుతున్న గుత్తేదారులు.. రాష్ట్ర, జిల్లా రహదారుల పనులపై ఆసక్తి చూపడం లేదనడానికి పక్క చిత్రాలే ఉదాహరణ. జాతీయ రహదారుల పనులు చిన్నవైనా ఎక్కువమంది ముందుకొస్తున్నారు. అదే ఆర్‌అండ్‌బీ పరిధిలోని జిల్లా ప్రధాన రహదారులు (ఎండీఆర్‌), రాష్ట్ర రహదారులు (ఎస్‌హెచ్‌) పనులకు ఎవరూ బిడ్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలో 8,970 కి.మీ. మేర దెబ్బతిన్న రాష్ట్ర, జిల్లా రహదారులను రూ.2,205 కోట్లతో పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీనికోసం రూ.2 వేల కోట్ల బ్యాంకురుణం తీసుకునేందుకు అవకాశం కల్పించింది. అధికారులు 1,140 పనులకు టెండర్లు పిలిస్తే గుత్తేదారులు స్పందించలేదు. రెండోసారి రాయలసీమ జిల్లాల వరకు బిడ్లు వేసేలా చూడగలిగారు. కోస్తాలో విజయనగరం మినహా 8 జిల్లాల్లో ఎక్కడా బిడ్లు రాలేదు. మూడోసారి టెండర్లు పిలిచినా అదే పరిస్థితి. ఇప్పటివరకు 403 పనులకే టెండర్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ నిధుల విడుదలతో సంబంధం ఉండదని, నేరుగా బ్యాంకునుంచే బిల్లులు చెల్లిస్తామని అధికారులు చెప్పినా గుత్తేదారులు రావట్లేదు.

డిపాజిట్లు కట్టేందుకూ డబ్బుల్లేవు
టెండరులో పాల్గొని పని దక్కించుకుంటే, డిపాజిట్‌ చెల్లించేందుకూ డబ్బుల్లేవని కొందరు గుత్తేదారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం తాము చేసిన పనులకు కొంతమేర బిల్లులు చెల్లించినా అవి రెండేళ్ల వడ్డీలకే సరిపోయాయని అంటున్నారు. గత ఏడాది వర్షాలతో దెబ్బతిన్న రహదారులకు అత్యవసర మరమ్మతులు చేశామని, వాటికి రూ.388 కోట్లు ఇంకా చెల్లించలేదని వివరించారు. పాత బిల్లులు చెల్లించేవరకూ బిడ్లు వేయబోమని, ఈ విషయంలో తామంతా ఒకేమాటపై ఉన్నామని వారు స్పష్టం చేస్తున్నారు.

ఇక్కడైతే వెంటనే బిల్లుల చెల్లింపు
మరోవైపు జాతీయ రహదారుల పనులు చేసి, బిల్లులు సమర్పించగానే చెల్లిస్తున్నారని గుత్తేదారులు చెబుతున్నారు. అందుకే ఆ పనులకు పోటీపడుతున్నారు. 

* అనంతపురం క్లాక్‌టవర్‌ వద్ద 600 మీటర్ల వంతెన, 9 కి.మీ. నాలుగు వరుసల రహదారికి కలిపి రూ.226 కోట్ల సివిల్‌ పనులకు ఎన్‌హెచ్‌ ఇంజినీర్లు టెండరు పిలిస్తే 8 సంస్థలు బిడ్లు వేశాయి.

* గుంటూరు జిల్లా వినుకొండ- గుంటూరు మధ్య జాతీయరహదారిలో 11 కి.మీ.మేర పనులకు రూ.13 కోట్లతో టెండర్లు పిలిస్తే నలుగురు బిడ్లు వేశారు.

* చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలోరహదారిపై రైల్వే క్రాసింగ్‌ వద్ద రూ.50 కోట్లతో ఆర్వోబీ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తే 8 సంస్థలు బరిలో నిలిచాయి.

* అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ వద్ద బైపాస్‌ నిర్మాణానికి రూ.94 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిస్తే ఏడు సంస్థలు బిడ్లు వేశాయి.

రుణం మంజూరవ్వగానే బిడ్లు వేస్తారు
రాష్ట్ర, జిల్లా రహదారుల పునరుద్ధరణ పనులకు రూ.2వేల కోట్ల బ్యాంకురుణం ఈ నెలాఖరుకు మంజూరయ్యే వీలుందని ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఇప్పటికే మూడుదఫాలు గుత్తేదారుల సంఘంతో సమావేశాలు నిర్వహించామని, రుణం మంజూరవ్వగానే బిడ్లు వేసేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రూ.388 కోట్ల మేర అత్యవసర మరమ్మతుల నిధులు త్వరలో చెల్లించేలా చర్యలు చేపట్టామన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని