ఏ దిశలో ఉన్నాయ్‌?

ప్రధానాంశాలు

ఏ దిశలో ఉన్నాయ్‌?

బిల్లుల్లో కీలకాంశాలపై కేంద్రం అభ్యంతరాలు
ఉత్తర, ప్రత్త్యుత్తరాలతోనే కాలయాపన
ఈనాడు - అమరావతి

మహిళలు, బాలలపై జరిగే క్రూరమైన, లైంగిక నేరాల్లో సత్వర దర్యాప్తు, వేగవంతమైన న్యాయవిచారణ, కఠిన శిక్షలకు వీలుగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘‘దిశ’’ బిల్లులు రాష్ట్రంలోని ఉభయసభల్లో ఆమోదం పొంది ఏడాదిన్నర దాటినా.. అవి నేటికీ చట్టంగా మారి అమల్లోకి రాలేదు. ఈ బిల్లుల్లో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌-1860, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ -1973కు సవరణలు చేసినందున చట్టరూపం దాల్చాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. ఆ ప్రక్రియలో భాగంగా బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించగా.. సంబంధిత మంత్రిత్వ శాఖలు పలు ప్రశ్నలు లేవనెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవంటూ, సమగ్ర వివరణలు కోరుతూ కేంద్రం మళ్లీమళ్లీ తిప్పి పంపిస్తోంది. ఏడాదిన్నరగా ఇదే తంతు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు వెల్లడించిన అభిప్రాయాలు, అభ్యంతరాలన్నింటినీ క్రోడీకరించి తాజాగా హోంశాఖ ఏపీ ప్రభుత్వానికి పంపించింది. వాటికి సమాధానాల్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈసారైనా కేంద్రం సంతృప్తి చెందితేనే బిల్లుల ఆమోదానికి ముందడుగు పడుతుంది.

కీలక అభ్యంతరాలివీ..
* ‘లైంగిక నేరగాళ్ల జాబితాను రూపొందించి, డిజిటలైజ్‌ చేస్తాం. ఆ వివరాలు దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉంచుతాం’ అని బిల్లులో పేర్కొన్నారు. నేరస్థులవి కాకుండా నిందితులందరి వివరాలు ఎందుకు?
*ఒక ఘటన జరిగిందని బాధితుల పేరు (దిశ)తో చట్టాలు తేవడం ప్రారంభిస్తే ఐపీసీ మొత్తం పేర్లతోనే నిండిపోతుంది కదా?
* నేరం జరిగిన వారం రోజుల్లో పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి, ఛార్జిషీటు వేయాలంటే.. అంతతక్కువ వ్యవధిలో శాస్త్రీయ ఆధారాలు సేకరణ సాధ్యమా? న్యాయ నిరూపణ సరిగ్గా జరగక దోషి తప్పించుకోవచ్చు. హడావిడి దర్యాప్తు వల్ల నిర్దోషులు ఇరుక్కోవచ్చు కదా?
* ఐపీసీలో అదనంగా సెక్షన్లు జోడించడం, ఇప్పుడున్న సెక్షన్లలోని శిక్షల్ని పెంచడం ఎలా సాధ్యం? అవసరమైతే రాష్ట్ర స్థానిక చట్టాలు (స్పెషల్‌ లోకల్‌ లా) చేసుకోవచ్చు కదా?


చట్టం నేపథ్యమిది

2019 నవంబరు 28న హైదరాబాద్‌ శివారులో ‘దిశ’ హత్యాచార ఘటన జరిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ బిల్లులు రూపొందించింది. ఈ తరహా నేరాల్లో ఏడు రోజుల్లో పోలీసుల దర్యాప్తు, 14 రోజుల్లో న్యాయవిచారణ, 21 రోజుల్లో శిక్ష వేయించడం, ఈ కేసుల సత్వర న్యాయవిచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ బిల్లులు తెచ్చింది.


అంశాలన్నీ ఉమ్మడి జాబితాలోనివే..

1, ‘ఆంధ్రప్రదేశ్‌ దిశ బిల్లు- క్రిమినల్‌ లా (ఏపీ సవరణ) బిల్లు-2019; 2, ఆంధ్రప్రదేశ్‌ దిశ బిల్లు- ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలలపై జరిగే నిర్దేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు-2019’ పేరిట రెండు బిల్లులు రాష్ట్ర ఉభయసభల్లో 2019 డిసెంబరు 16 నాటికి ఆమోదం పొందాయి. క్రిమినల్‌ లా, క్రిమినల్‌ ప్రొసీజర్స్‌, న్యాయ పరిపాలన అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నందున వీటి చట్టబద్ధతకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 254(2) ప్రకారం రాష్ట్రపతి ఆమోదం అవసరం.


ఒకటి వెనక్కి.. సవరణలతో మరోటి!

కేంద్ర హోంశాఖ ఈ బిల్లులపై సంబంధిత మంత్రిత్వ శాఖల అభిప్రాయాల్ని కోరింది. వారు తెలిపిన అభ్యంతరాలు, కొర్రీలన్నింటినీ క్రోడీకరించి.. రెండో బిల్లులో పేర్కొన్న ‘లైంగిక నేరగాళ్ల జాబితా ప్రదర్శన’పై అభ్యంతరం చెప్పింది. ‘ఆంధ్రప్రదేశ్‌’, ‘ప్రత్యేక న్యాయస్థానాలు’ పదాలు రెండుసార్లు ఉన్నాయని, మరికొన్ని తప్పులున్నాయంటూ బిల్లులను వెనక్కి పంపించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో బిల్లును పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు 2020 డిసెంబరు
2న అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత ప్రకటించారు. ఆ స్థానంలో 2020 డిసెంబరు 3న ‘‘ఆంధ్రప్రదేశ్‌ దిశ (మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు) బిల్లు-2020’’ ప్రవేశపెట్టారు. తుదిగా దీన్నే కేంద్రానికి పంపించారు.


బిల్లులపై మా శాఖ చెప్పిన అభ్యంతరాలకు ఏపీ ప్రభుత్వం రెండుసార్లు వివరణలు ఇచ్చింది. రెండోసారి ఇచ్చిన వివరణపై మా అభిప్రాయాన్ని కేంద్ర హోంశాఖ ద్వారా ఏపీకి తెలియజేశాం.

- జులై 29న రాజ్యసభలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ


బిల్లులపై ఎవరేమన్నారు?
‘ఏపీ దిశ బిల్లులపై సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు తెలిపిన అభిప్రాయాలపై వివరణలు, సమాధానాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం. అక్కడ నుంచి మాకు ఇంకా వివరణలు అందలేదు.’

- జులై 27న లోక్‌సభలో హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రా


‘దిశ బిల్లులను కేంద్రానికి పంపించాం. వారు చాలా కొర్రీలు వేస్తున్నారు. ఆ పదం ఎందుకు పెట్టారు? ఇంత శిక్షెందుకు? అని అడుగుతున్నారు. కీలకాంశాల గురించి కాకుండా పరిమాణం, పరిభాషను ప్రశ్నిస్తున్నారు. అన్నింటికీ సమాధానాలిస్తున్నాం. కేంద్రం, రాష్ట్రపతి ఆమోదం పొందితేనే బిల్లు చట్టంగా మారుతుంది. ఇంకా ఆమోదం పొందలేదు.’

- సెప్టెంబర్‌ 3న మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌


ముందూవెనకా ఆలోచించాలి కదా?

భావోద్వేగాలతో చట్టాలు తెస్తే ‘దిశ’ బిల్లులకు ఎదురవుతున్న ఇబ్బందులే ఉత్పన్నమవుతాయి. చట్టం రూపొందించాలంటే మథనం జరగాలి. పర్యవసానాలు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే ప్రచారార్భాటాలకు బాగుంటాయి తప్ప.. ప్రయోజనం నెరవేరదు. వారం రోజుల్లో దర్యాప్తు, 21 రోజుల్లో శిక్ష ఆచరణ సాధ్యం కాదు. దర్యాప్తు సంస్థలు, ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలు, ప్రాసిక్యూషన్‌పై ఒత్తిడి పడుతుంది.      

-సుంకర రాజేంద్రప్రసాద్‌, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది, విజయవాడ


బిల్లు లోపభూయిష్టం

దిశ బిల్లులు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఐపీసీ, సీఆర్‌పీసీలకు రాష్ట్రాలు చేసే సవరణలు ఆమోదించాలంటే వాటి ప్రభావం, పర్యవసానాలపై కేంద్రం ఆలోచిస్తుంది. ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్న బిల్లుల్ని ఆమోదించే అవకాశం తక్కువే. ఈ బిల్లుల్లోని కొన్ని అంశాల వల్ల అమాయకులు ఇరుక్కునే ప్రమాదం ఉంది. రాజ్యాంగం ప్రకారం నిందితులకూ హక్కులుంటాయి. వాటిని హరించే ఆస్కారముంది.          

-ముప్పాళ్ల సుబ్బారావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని